ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు
ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ స్పెషల్ ఎడిషన్ గురించి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించినట్లుగానే, కంపెనీ ఈ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం ఫోర్డ్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఫ్రీస్టైల్ క్రాస్ఓవర్ హ్యాచ్‌బ్యాక్‌లో టాప్-ఆఫ్ ది లైన్‌గా ఈ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. స్టాండర్డ్ ఫ్రీస్టైల్ మోడల్‌తో పోల్చుకుంటే ఈ స్పెషల్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్‌లో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వేరియంట్ ధర రూ.7.69 లక్షలుగా ఉండగా, డీజిల్ వెర్షన్ ధర రూ.8.79 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. ఈ కొత్త ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్‌లో కేవలం కాస్మోటిక్ మార్పులు మాత్రమే ఉన్నాయి, ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ స్పెషల్ ఎడిషన్‌లో కొత్త బాడీ గ్రాఫిక్స్, కొత్త బూట్ లిడ్ డిజైన్ వంటి కాస్మోటిక్ మార్పులే కాకుండా దీని రూఫ్ మొత్తాన్ని నలుపు రంగులో ఫినిష్ చేశారు. అలాగే రూఫ్ రెయిల్స్ మరియు సైడ్ మిర్రర్లను కాంట్రాస్ట్ రెడ్ కలర్‌లో ఫినిష్ చేశారు. రెండు చివర్లలోని స్కఫ్ ప్లేట్లు కూడా ఎరుపు రంగులోనే ఉంటాయి. అల్లాయ్ వీల్స్ పూర్తిగా నలుపు రంగులో ఉంటాయి. ఈ మార్పులన్నీ హ్యాచ్‌బ్యాక్‌కు మరింత స్పోర్టీ లుక్‌నిస్తాయి.

ఇంటీరియర్స్‌లో కూడా ఈ స్పెషల్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ స్టాండర్డ్ మోడల్ కన్నా భిన్నంగా కనిపిస్తుంది. ఇందులోని సీట్లు మరియు డోర్ ట్రిమ్స్‌పై కాంట్రాస్ట్ రెడ్ కలర్ స్టిచింగ్ ఉంటుంది. కొత్త ‘ఫ్లెయిర్' వేరియంట్ పేరును డ్యూయల్ టోన్ సీట్ అప్‌హోలెస్ట్రీపై ముద్రించబడి ఉంటుంది. ఇంటీరియర్స్‌లో ఎక్స్‌క్లూజివ్ గ్రే కలర్ అప్‌హోలెస్ట్రీ ఉంటుంది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్‌లోని ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇందులో బిల్ట్-ఇన్ నావిగేషన్‌తో కూడిన 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు బ్రాండ్ యొక్క సింక్3 టెక్నాలజీ, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, ఆటో వైపర్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రిమోట్ సెంట్రల్ లాకింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంటీ-రోల్‌ఓవర్ ప్రొటెక్షన్, ఆరు ఎయిర్‌బ్యాగులు వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ కొత్త వేరియంట్‌లో పైన పేర్కొన్న మార్పులు తప్ప వేరే ఏ ఇతర మార్పులు లేవు. ఇంజన్ పరంగా కూడా కొత్త ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్‌లో ఎలాంటి మార్పులు లేవు. స్టాండర్డ్ ఫ్రీస్టైల్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లనే కొత్త ఫ్లెయిర్ వేరియంట్‌లోను ఆఫర్ చేయనున్నారు.

ఇందులోని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 95 బిహెచ్‌పి పవర్‌ని మరియు 119 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ 100 బిహెచ్‌పి శక్తిని మరియు 215 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానున్నాయి.

భారత మార్కెట్లో ఫోర్డ్ అందిస్తున్న ఫిగో మరియు ఎకోస్పోర్ట్ మోడళ్లకు మధ్యలో ఫ్రీస్టైల్ క్రాసోవర్‌ను అందిస్తున్నారు. ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఈ విభాగంలో మారుతి సుజుకి ఇగ్నిస్ మరియు మహీంద్రా కెయువి100 వంటి మోడళ్లకు పోటీ ఇస్తుంది.
ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా ఫోర్డ్ ఇండియా, మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ రైనా మాట్లాడుతూ "ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఒక బెంచ్‌మార్క్ కాంపాక్ట్ యుటిలిటీ వాహనంగా ఉంది, ఇందుకు గానూ దాని సరసమైన డిజైన్, ధరకు తగిన విలువ మరియు ఫన్-టు-డ్రైవ్ సామర్థ్యాలకు కృతజ్ఞతలు. ఈ అధునాతన ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ రానున్న పండుగ సీజన్లో మీ ఇంటికి తీసుకెళ్లటానికి ఒక కూల్ లుకింగ్ కారుగా నిలుస్తుంద"ని అన్నారు.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ ఇప్పుడు దేశంలోని సియువి (కాంపాక్ట్ యుటిలిటీ వెహికల్) విభాగంలో లభిస్తున్న కొత్త రేంజ్-టాపింగ్ వేరియంట్. కొత్త ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ కాస్మోటిక్ మార్పులతో పాటుగా అదనపు ఫీచర్లతో లభిస్తోంది. ఈ మార్పుల వలన ఇది ఇప్పుడు స్టాండర్డ్ మోడల్ కన్నా మరింత ఆకర్షణీయంగా మారింది.


Click it and Unblock the Notifications








