హోండా సివిక్ బిఎస్6 డీజిల్ విడుదల - ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు
జపనీస్ కార్ బ్రాండ్ 'హోండా కార్స్ ఇండియా' భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం సెడాన్ 'హోండా సివిక్'లో కంపెనీ కొత్తగా బిఎస్6 వేరియంట్‌ను నేడు మార్కెట్లో విడుదల చేసింది. హోండా సివిక్ సెడాన్ ఇప్పటి వరకూ పెట్రోల్ వేరియంట్లలో మాత్రమే లభ్యమవుతుండగా, కంపెనీ ఇందులో ఇప్పుడు బిఎస్6 డీజిల్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది.

'హోండా కార్స్ ఇండియా' విడుదల చేసిన కొత్త 2020 హోండా సివిక్ డీజిల్ సెడాన్ మొత్తం రెండు వేరియంట్లలో లభ్యం కానుంది, అవి - విఎక్స్ మరియు జెడ్ఎక్స్. ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన విఎక్స్ ధర రూ.20.72 లక్షలుగా ఉంటే, టాప్-ఎండ్ వేరియంట్ అయిన జెడ్‌ఎక్స్ ధర రూ.22.34 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

ఇంజన్ విషయానికి వస్తే.. కొత్త హోండా సివిక్ బిఎస్6 మోడల్‌లో 1.5 లీటర్ ఐ-డిటెక్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 118 బిహెచ్‌పి శక్తిని మరియు 2,000 ఆర్‌పిఎమ్ వద్ద 300 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేసేది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది, ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులో లేదు.

హోండా బ్రాండ్ యొక్క ఎర్త్ డ్రీమ్ టెక్నాలజీ సిరీస్‌లో భాగంగా తయారు చేసిన ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్‌ను హోండా సివిక్‌లో అమర్చారు. ఈ డీజిల్ ఇంజన్ మంచి పనితీరుతో పాటుగా గరిష్ట ఇంధ సామర్థ్యాన్ని కూడా ఆఫర్ చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, హోండా సివిక్ బిఎస్6 కంప్లైంట్ డీజిల్ ఇంజన్ లీటరుకు 23.9 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

హోండా సివిక్ డీజిల్ కారులో బిఎస్6 ఇంజన్ అప్‌డేట్‌తో పాటుగా ఈ రెండు వేరియంట్లలో కొత్తగా కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లను ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు వీటిలో ఆరు స్టాండర్డ్ ఎయిర్‌బ్యాగ్స్ లభిస్తాయి. ఈ రెండి మార్పులు తప్ప ఇందులో వేరే ఏ ఇతర మార్పులు లేవు. పెట్రోల్ వెర్షన్లలో లభించే అన్ని ఫీచర్లు డీజిల్ వెర్షన్లలో కూడా లభ్యం కానున్నాయి.

ఈ పదవ తరం హోండా సివిక్‌ను న్యూ-ఏజ్ డిజైన్‌తో తయారు చేశారు. ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, సి-ఆకారపు ఎల్‌ఈడి టెయిల్-లాంప్స్, క్రోమ్ సరౌండ్స్‌తో కూడిన ఫాగ్ ల్యాంప్స్, 17 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేసిన బూట్ లిప్ స్పాయిలర్ వంటీ డిజైన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

హోండా సివిక్ సెడాన్ బిఎస్6 కంప్లైంట్ పెట్రోల్ ఇంజన్‌తో కూడా లభ్యం కానుంది. ఇందులో 1.8 లీటర్ ఐ-విటెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పి శక్తిని మరియు 174 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎక్స్‌క్లూజివ్‌గా సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

పెట్రోల్ మరియు డీజిల్ రెండు మోడళ్లలో కూడా డ్యూయెల్ జోన్ ఆటోమేటిక్ కంట్రోల్, పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఫీచర్లతో హోండా బ్రాండ్ కనెక్టింగ్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో వాయిస్ అసిస్టెడ్ కమాండ్‌లు, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, స్టార్ట్ / స్టాప్ ఫంక్షన్ కోసం పుష్-బటన్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి మరెన్నో ఇతర ఫీచర్లు ఉన్నాయి.

ఈ కారును మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు డైరెక్టర్ రాజేష్ గోయెల్ మాట్లాడుతూ, "హోండా తమ సరికొత్త మరియు అధునాతన పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత మార్కెట్లోకి తీసుకురావడానికి కట్టుబడి ఉంది. మా ఐకానిక్ సెడాన్‌లో బిఎస్6 డీజిల్ వెర్షన్‌ను ప్రవేశపెట్టడంతో హోండా సివిక్ ఇప్పుడు మా కస్టమర్ల కోసం పెట్రోల్ మరియు డీజిల్ రెండూ ఆప్షన్లను అందిస్తుంది. డ్రైవింగ్ ప్లెజర్ కోసం ఎదురు చూస్తున్న వినియోగదారుల కోసం డీజిల్ వెర్షన్ సివిక్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంద"ని అన్నారు.

హోండా సివికి డీజిల్ బిఎస్6 విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
మేము ఇదివరకటి కథనంలో పేర్కొన్నట్లుగానే హోండా తమ సివిక్ బిఎస్6 డీజిల్ వెర్షన్‌ను దేశీయ విపణిలో విడుదల చేసింది. ప్రీమియం సెడాన్ విభాగంలో విడుదలైన హోండా సివిక్ భారత మార్కెట్లోని స్కోడా ఆక్టేవియా, హ్యుందాయ్ ఎలాంట్రా మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








