కొత్త ఐఎమ్‌టి క్లచ్‌లెస్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో రానున్న హ్యుందాయ్ వెన్యూ
దక్షిణ కొరియా కార్ బ్రాండ్ హ్యుందాయ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీలో (ఐఎమ్‌టి) ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను వేరియంట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసినదే. హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో కంపెనీ ఈ కొత్త గేర్‌బాక్స్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

హ్యుందాయ్ ఇప్పటికే ఈ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉన్న ఆప్షనల్ గేర్‌బాక్స్‌లతో పాటుగా ఈ కొత్త ఐఎమ్‌టి గేర్‌బాక్స్‌ను పరిచయం చేయనుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 1.0 లీటర్ టి-జిడిఐ పెట్రోల్ టర్బో ఇంజన్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సెవన్-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఆఫర్ చేయబడుతోంది. కాగా కొత్తగా రానున్న ఐఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ ఈ నెలలో విడుదల కావచ్చని అంచనా.

ఐఎమ్‌టి అంటే ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, పేరుకు తగినట్లుగానే ఈ గేర్‌బాక్స్‌లోని క్లచ్ ఇంటెలిజెంట్‌గా పనిచేస్తుంది. అంటే, ఇందులో క్లచ్‌ని ఆపరేట్ చేయటానికి మానవ ప్రమేయం అవసరం ఉండదు. అంత మాత్రాన ఇందులో క్లచ్ ఉండదని అర్థం కాదు ఇందు క్లచ్ కూడా ఉంటుంది, కానీ ఈ క్లచ్‌ని ఆపరేట్ చేసే ప్రక్రియను డ్రైవర్ కాకుండా కారులో ఉండే యాంత్రిక సాంకేతిక అయిన టిసియూ - ట్రాన్సిమిషన్ కంట్రోల్ యూనిట్ కొన్ని సెన్సార్ల సాయంతో నిర్వహిస్తుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే, ఐఎమ్‌టి ట్రాన్సిమిషన్ కలిగిన హ్యుందాయ్ వెన్యూ కారులోని క్లచ్‌ను డ్రైవర్ కాకుండా కారులో ఉండే కంప్యూటర్ ఆపరేట్ చేస్తుందన్నమాట. డ్రైవర్ గేర్ మార్చాలనుకున్న ప్రతిసారి సెన్సార్లు క్లచ్ ప్లేట్‌ను ఎంగేజ్ లేదా డిస్ఎంగేజ్ చేయటానికి కారులోని హైడ్రాలిక్ యాక్యుయేటర్‌కు సిగ్నల్స్ పంపుతుంది. ఫలితంగా క్లచ్ ప్లేట్ డ్రైవర్ అవసరం లేకుండానే ఆటోమేటిక్‌గా పైకి క్రిందకు కదులుతుంది.

కన్వెన్షనల్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మాదిరిగా కాకుండా, ఈ కొత్త ఐఎమ్‌టి గేర్‌బాక్స్ ఇంధన సామర్థ్యం, ఇంజన్ పనితీరులో ఎలాంటి రాజీ పడకుండా మెరుగైన సౌలభ్యాన్ని, సౌకర్యాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

ప్రస్తుతం హ్యుందాయ్ వెన్యూ 1.0-లీటర్ టి-జిడిఐ ఇంజన్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రెండు వెర్షన్లలో లభిస్తోంది. టర్బో-పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.8.46 లక్షల నుండి రూ.11.51 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కొత్తగా రానున్న ఐఎమ్‌టి కూడా ఒక్క వేరియంట్‌కే పరిమితం కాకుండా కొన్ని ఇతర వేరియంట్లలో కూడా విడుదల చేయవచ్చని అంచనా.

హ్యుందాయ్ వెన్యూ టర్బో పెట్రోల్ ఇంజన్‌తోనే కాకుండా ఇతర ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లతో కూడా అందుబాటులో ఉంది. ఇందులోని 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ ఇంజన్ 82 బిహెచ్‌పి శక్తిని మరియు 115 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇకపోతే ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 100 బిహెచ్‌పి మరియు 240 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ కారులోని కొన్ని హైలైట్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు బ్రాండ్ యొక్క 'బ్లూలింక్' కనెక్టింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేసే ఇచ్చే ఎనిమిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగులు, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, డిజిటల్ గైడ్‌లైన్స్‌తో కూడిన రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు ఈబిడితో కూడిన ఏబిఎస్ వంటి ఫీచర్లున్నాయి.

హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ సెగ్మెంట్లో కొత్తగా వచ్చిన హోండా డబ్ల్యూఆర్-వి, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యువి300 మారుతి విటారా బ్రెజ్జా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. మరోవైపు భారతదేశంలో అత్యంత పోటీతత్వంతో కూడుకున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో త్వరలో విడుదల కానున్న నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్, కియా సోనెట్ వంటి మోడళ్లు కూడా హ్యుందాయ్ వెన్యూకి గట్టి పోటీ ఇవ్వనున్నాయి.

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి గేర్‌బాక్స్ వేరియంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
భారత మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ టర్బో-పెట్రోల్ వేరియంట్ ఖచ్చితంగా ఓ కొత్త విప్లవాన్ని తీసుకువచ్చిందనే చెప్పాలి. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ వేరియంట్లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఇప్పుడు ఇందులో కొత్తగా ఈ ఐఎమ్‌టి ట్రాన్సిమిషన్ వచ్చి చేరినట్లయితే, ఈ మోడల్‌కు గిరాకీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కొత్త గేర్‌బాక్స్ సాయంతో డ్రైవర్లు క్లచ్‌ను ఆపరేట్ చేయాల్సిన అవసరం లేకుండానే గేర్లు మార్చుకోవచ్చు. అంటే మ్యాన్యువల్ కారులో ఆటోమేటిక్ సౌకర్యాన్ని పొందవచ్చన్నమాట.


Click it and Unblock the Notifications








