కోవిడ్-19 వారియర్ల కోసం మహీంద్రా వాహనాలపై స్పెషల్ డీల్స్
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఓ కొత్త ప్రణాళికను ప్రకటించింది. కరోనాపై పోరులో ముందు నిలిచి పోరాడిన కోవిడ్-19 వారియర్ల కోసం తమ వాహనాల కొనుగోలుపై స్పెషల్ డీల్స్ అందిస్తున్నామని కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా, తమ అన్ని రకాల వాహనాలపై ప్రత్యేకమైన ఫైనాన్స్ సదుపాయాలను కూడా అందిస్తున్నామని మహీంద్రా పేర్కొంది.

జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు, రైల్వే సిబ్బంది, విమానయాన సిబ్బందితో పాటుగా డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వాధికారులు, పోలీసులు మరియు ఈ పోరులో ముందుండి పనిచేసిన ప్రతి ఒక్కరి కోసం ప్రత్యేకమైన ఫైనాన్సింగ్ సదుపాయాన్ని అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కోవిడ్-19 వారియర్ల కోసం ఇప్పటికే పలు కార్ కంపెనీ ఆఫర్లను ప్రకటిస్తున్నప్పటికీ, జర్నిలిస్టులు, మీడియా, రైల్వే, విమానయాన సిబ్బందిని కూడా ఈ జాబితాలో చేర్చడం ఒక్క మహీంద్రాకే చెల్లింది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ నక్రా మాట్లాడుతూ.. ఇటువంటి కష్ట కాలంలో, ప్రపంచంలోని ఇతర దేశాల్లో మాదిరిగానే భారతదేశంలో కూడా ఫ్రంట్‌లైన్ మరియు ఎసెన్షియల్ సర్వీస్ ప్రొవైడర్లు నిర్విరామంగా అహర్నిశలూ శ్రమిస్తున్నారని, వారి పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేమని అన్నారు. అలాంటి వారికి కృతజ్ఞగతగా, మహీంద్రా వాహనాలను సొంతం చేసుకోవాలనుకునే వారి కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫైనాన్స్ స్కీమ్‌లను అందిస్తున్నామని తెలిపారు.

ఆరోగ్య మరియు వైద్య సిబ్బంది, పోలీసు అధికారులు, మీడియా ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు, మందులు, కూరగయాలు, పాలు మొదలైన నిత్యావసరాలు సరఫరా చేసే వారి కోసం ప్రత్యేకమైన ఆఫర్లను అందించడానికి తామెంతో సంతోషిస్తున్నామని నక్రా చెప్పారు.

ఇలా ఎస్సెన్షియల్ సర్వీసులను అందించే కస్టమర్లు మహీంద్రా వాహనాలపై రూ.66,500 వరకూ ప్రయోజనాలను పొందవచ్చు. కోవిడ్-19 వారియర్ల కోసం, వారి కారు కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేయటం కోసం మహీంద్రా అండ్ మహీంద్రా పలు ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకని సరసమైన వడ్డీ రేట్లకే ఆటో రుణాలను అందిస్తోంది.

కోవిడ్-19 కేర్ టేకర్లు ఇప్పుడు మహీంద్రా కారును కొనుగోలు చేసి మొదటి చెల్లింపును 2021 నుంచి చేయవచ్చు, ఈ లోన్ కాల పరిమితి 64 నెలలుగా ఉంటుంది. పూర్తిగా 100 శాతం రుణ సౌకర్యాన్ని అందిస్తారు మరియు 90 రోజుల వరకూ మారటోరియం ప్రయోజనాన్ని ఆస్వాదించవచ్చు. డాక్టర్లకు ప్రాసెసింగ్ ఫీజులో 5 శాతం రాయితీలను కూడా ఇస్తున్నారు. మరిన్ని వివరాలు కస్టమర్లు సమీపంలోని మహీంద్రా డీలర్లను సంప్రదించాల్సి ఉంటుంది.

ఇక మహీంద్రాకు సంబంధించిన ఇతర వార్తల్లోకి వెళితే.. మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఆగస్ట్ నాటికి ఓ సరికొత్త 2020 థార్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన తుది దశ టెస్టింగ్‌లు కూడా పూర్తయినట్లు సమాచారం. అధికారికంగా అందిన సమాచారం ప్రకారం, ఇప్పటికే దేశంలోని కొన్ని మహీంద్రా షోరూమ్‌లలో కొత్త థార్ కోసం బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నట్లు సమాచారం.

కొత్త 2020 మహీంద్రా థార్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ సరికొత్త డిజైన్‌ను మరింత ప్రీమియం ఇంటీరియర్లను కలిగి ఉండనుంది. వాస్తవానికి ఈ కొత్త థార్ ఎస్‌యూవీ ఇప్పటి మార్కెట్లో విడుదల కావల్సి ఉండగా, కోవిడ్-19 కారణంగా దీని విడుదల జాప్యం అయ్యింది.

కోవిడ్-19 కేర్ టేకర్ల కోసం మహీంద్రా ఆఫర్ చేస్తున్న స్పెషల్ ప్రయోజనాలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
దేశంలోని పలు ఇతర ఆటోమొబైల్ కంపెనీల మాదిరిగానే మహీంద్రా కూడా లాక్‌డౌన్ తర్వాత అమ్మకాలను పెంచుకునే దిశగా కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్రణాళికలను సిద్దం చేసుకుంది. ప్రత్యేకించి కరోనాపై పోరులో ముందు నిలిచి అన్ని రకాలుగా సేవలందించిన వారి కోసం మహీంద్రా స్పెషల్ ఆఫర్లను ప్రకటించడం నిజంగా మంచి విషయమే.


Click it and Unblock the Notifications








