రోడ్డెక్కిన 7 లక్షల బాలెనో కార్లు: ప్రతి 3 నిమిషాలకు ఒకటి అమ్ముడైంది!
మారుతి సుజుకి బాలెనో.. ఈ కారు గురించి తెలియనివారంటూ ఉండరు. స్విఫ్ట్, డిజైర్, ఆల్టో కార్ల తరహాలో బాలెనో కూడా మారుతికి భారీ విజయాన్నిచ్చింది. మారుతి బాలెనో ఎప్పటిలాగే భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

మారుతి సుజుకి దేశవ్యాప్తంగా ఉన్న 200 నెక్సా షోరూముల ద్వారా బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును విక్రయిస్తోంది. అక్టోబర్ 2015లో విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ ఏకంగా 7,20,733 బాలెనో కార్లను విక్రయించారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 2015 అక్టోబర్ నుండి ఇప్పటి వరకూ ప్రతి మూడు నిమిషాలకు ఒక బాలెనో కారు చొప్పున అమ్ముడైంది. మారుతి బాలెనో మొత్తం సేల్స్‌లో 6,16,867 యూనిట్ల పెట్రోల్ వేరియంట్లు అమ్ముడవ్వగా.. కేవలం 1,03,866 యూనిట్ల డీజల్ వేరియంట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల జాబితాలో కూడా మారుతి బాలెనో కారుదే పైచేయి. కేవలం 51 నెలల్లోనే ఏకంగా 7.20 లక్షల బాలెనో కార్లు రోడ్డెక్కాయి. బాలెనో కంటే ముందు నెంబర్ వన్ స్థానంలో హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారుకు పోటీగా తీసుకొచ్చి అనతికాలంలోనే ఐ20 మోడల్‌ను అధిగమించింది.

మారుతి సుజుకి ఇప్పుడు బాలెనో డీజల్ వేరియంట్ల విక్రయాలను నిలిపేసింది. పెట్రోల్ వేరియంట్ల సేల్స్ ఎక్కువగా ఉండటం మరియు భారత ప్రభుత్వం తీసుకొచ్చి కఠినమైన బీఎస్6 నేపథ్యంలో డీజల్ ఇంజన్‌ను వీడ్కోలు పలికింది.

అయితే ప్రస్తుతానికి మారుతి సుజుకి బాలెనో మోడల్‌ను పెట్రోల్ మరియు పెట్రోల్-హైబ్రిడ్ అనే రెండు విభిన్న ఇంజన్ వేరియంట్లలో విక్రయిస్తోంది. ఈ రెండింటినీ బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ది చేసింది. ఏప్రిల్ 01, 2020 నుండి అన్ని కార్లు మరియు బైకుల్లో బీఎస్6 వెర్షన్ ఇంజన్ తప్పనిసరి చేశారు.

మారుతి సుజుకి బాలెనో పెట్రోల్ మరియు హైబ్రిడ్ వేరియంట్ల ధరల శ్రేణి రూ. 5.7 లక్షల నుండి రూ. 9.03 లక్షల మధ్య, ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. వీటిని మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఛాయిస్‌లో ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications








