మహీంద్రా థార్‌కి పోటీగా వస్తున్న ఫోర్స్ గుర్ఖా ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ
ఫోర్స్ మోటార్స్ నుంచి పాపులర్ అయిన కొత్త గూర్ఖా ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలో కంపెనీ ఓ కొత్త తరం మోడల్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. గడచిన 2020 ఆటో ఎక్స్‌పోలో ఫోర్స్ మోటార్స్ తొలిసారిగా తమ నెక్స్ట్ జనరేషన్ గుర్ఖా ఎస్‌యూవీని ప్రదర్శించింది.

వాస్తవానికి ఇప్పటికే కొత్త 2020 ఫోర్స్ గూర్ఖా దేశీయ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉండాల్సి ఉంది. అయితే, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి, దేశవ్యాప్త లాక్‌డౌన్ వంటి పలు కారణాల వలన దీని విడుదల ఆలస్యమైంది.

కానీ, తాజాగా ఆటోకార్ ఇండియా ఫోరం నుండి వచ్చిన నివేదికల ప్రకారం, ఫోర్స్ నుంచి రానున్న కొత్త గూర్ఖా ఎస్‌యూవీని కంపెనీ ఇప్పటికే భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. ఈ స్పై చిత్రాలలో చూసినట్లుగా, ఫోర్స్ గూర్ఖా ఎస్‌యూవీని కంపెనీ ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా టెస్టింగ్ చేస్తోంది.

దీన్ని బట్టి చూస్తుంటే సరికొత్త 2020 ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ఫోర్స్ మోటార్స్ ప్రదర్శించిన నెక్స్ట్-జెన్ ఫోర్స్ గూర్ఖాలో మునుపటి మోడల్‌తో పోలిస్తే అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి.

సరికొత్త ఫోర్స్ గుర్ఖాలో వెడల్పాటి బాడీ మరియు స్నార్కెల్ ఎయిర్ ఇన్‌టేక్స్, వాటర్ వేడింగ్, కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లు మరియు రెండు చివర్లలో సరికొత్త బంపర్లు, చంకీ బాడీ క్లాడింగ్ మరియు ఎస్‌యూవీ చుట్టూ స్కర్ట్‌లు వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

టెస్టింగ్ చేస్తున్న ఫోర్స్ గూర్ఖాను స్టీల్ వీల్స్‌పై పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది, బహుశా ఇది ఎంట్రీ లెవల్ వేరియంట్ అయి ఉండొచ్చని అంచనా. అయితే, ఈ ఎస్‌యూవీకి 245/70 టైర్ ప్రొఫైల్‌లతో కొత్త 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ఆప్షనల్ ఫీచర్‌గా రావచ్చని తెలుస్తోంది.

ఇంటీరియర్స్‌ను గమనిస్తే, ఈ కొత్త తరం ఆఫ్-రోడర్‌లో భారీ మార్పులు చేసినట్లు సమాచారం. ఇందులో సరికొత్త డాష్‌బోర్డ్ డిజైన్, దాని మధ్యలో కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. కలిగి ఉంది. ఇంకా ఇందులో ఎమ్ఐడి డిస్‌ప్లేతో కూడిన కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు మరియు కొత్తగా రూపొందించిన గుండ్రటి ఏసి వెంట్స్ వంటి మార్పులు ఉన్నాయి. ఈ కొత్త మార్పులతో వస్తున్న ఇంటీరియర్ క్యాబిన్ మునుపటి కన్నా మరింత ఆహ్లాదకరమైన అనుభూతిని అందించే అవకాశం ఉంది.

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2020 ఫోర్స్ గూర్ఖాలో మునుపటి బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన అదే 2.6-లీటర్ డీజిల్ ఇంజన్‌నే కొత్తగా బిఎస్6కి అప్‌గ్రేడ్ చేసి ఉపయోగించనున్నారు. ఇందులోని 2.6-లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజన్ గరిష్టంగా 90 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఇందులో ఆటోమేటిక్ ఆప్షన్ మరియు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉండకపోవచ్చని సమాచారం. కొత్త ఫోర్స్ గుర్ఖా ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభ్యం కానుంది. ఇందులో మాన్యువల్ లాకింగ్ డిఫరెన్షియల్స్ మరియు కష్టతరమైన భూభాగాలపై ప్రయాణించేందుకు వీలుగా లో-రేంజ్ గేర్‌బాక్స్ కూడా ఉంటాయని సమాచారం.

కొత్త తరం ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఫోర్స్ మోటార్స్ నుంచి రానున్న సరికొత్త ఫోర్స్ గూర్ఖా మునుపటి మోడల్ కంటే మరింత పెద్దగా, విశాలంగా ఉండనుంది. అంతేకాకుండా, మారుతున్న ట్రెండ్స్‌కి అనుగుణంగా, ఇందులో టెక్నాలజీ మరియు ఫీచర్లు కూడా మారే అవకాశం ఉంది. భారత మార్కెట్లో ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ ఈ విభాగంలో నేరుగా మహీంద్రా థార్‌తో తలపడనుంది.


Click it and Unblock the Notifications








