ఆల్ట్రోజ్‌తో అదరగొట్టిన టాటా, లాక్‌డౌన్‌లోనూ కొనసాగిన జోరు
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ 4.0లో కొన్ని సడలింపులనిస్తూ ఆటోమొబైల్ డీలర్‌షిప్‌లను తెరచుకోవచ్చని ప్రకటించడంతో గడచిన మే నెలలో కార్ల అమ్మకాలు జోరుగానే సాగాయి. రానున్న రోజుల్లో వైరస్ వ్యాప్తి మరింత ప్రబలే ఆస్కారం ఉన్న నేపథ్యంలో కస్టమర్లు ఇప్పుడు సురక్షితమైన ప్రయాణం కోసం కార్ల కొనుగోలు వైపు దృష్టి సారించారు.

భారతదేశపు ఆటోమొబైల్ దిగ్గడం టాటా మోటార్స్ గడచిన మే నెలలో లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ ప్రోత్సాహకర అమ్మకాలనే నమోదు చేసింది. మే 2020లో టాటా మోటార్స్ మొత్తం 3,000 కార్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో (మే 2019లో) 11,000 యూనిట్లను టాటా విక్రయించింది. అప్పటితో పోల్చుకుంటే ప్రస్తుత అమ్మకాలు 71 శాతం క్షీణించాయి.

ఈ మొత్తం అమ్మకాలలో టాటా మోటార్స్ అందిస్తున్న వివిధ మోడళ్ల వారీగా చూస్తే అన్నింటి కన్నా ఎక్కువగా టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు అమ్ముడయ్యాయి. టాటా అందిస్తున్న టియాగో, నెక్సాన్, హ్యారియర్ వంటి పాపులర్ మోడళ్లను పక్కకు నెట్టి ఆల్ట్రోజ్ 1,379 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది.

ఇకపోతే ద్వితీయ స్థానంలో టాటా మోటార్స్ అందిస్తున్న టాటా టియాగో నిలించింది. మే 2020లో టాటా టియోగా అమ్మకాలు 857 యూనిట్లుగా నమోదయ్యాయి. గడచిన సంవత్సరం ఇదే సమయంలో (మే 2019లో) టాటా టియాగో అమ్మకాలు 3,600 యూనిట్లుగా ఉంటే అవి ఇప్పుడు 75 శాతం తగ్గాయి.

టాటా మోటార్స్ నుంచి అత్యంత పాపులర్ అయిన కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ మే 2020లో 623 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే సమయంలో టాటా హ్యారియర్ 161 యూనిట్లు, టాటా టిగోర్ 132 యూనిట్ల అమ్మకాలతో నాలుగు మరియు ఐదో స్థానాల్లో నిలిచాయి. టాటా మోటార్స్ ఇటీవలే భారత మార్కెట్లో టియాగో, టిగోర్ మరియు నెక్సాన్ మోడళ్లను సరికొత్త డిజైన్‌తో రిఫ్రెష్ చేసిన సంగతి తెలిసినదే.

టాటా హ్యారియర్‌ను కూడా లాక్‌డౌన్‌కు కొద్ది రోజుల ముందే బిఎస్6 కాలుష్య నిబంధనలకు తగినట్లుగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ ఎస్‌యూవీలోని 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ను తాజాగా అప్‌గ్రేడ్ చేశారు. ఇప్పుడు ఈ బిఎస్6 ఇంజన్ గరిష్టంగా 170 బిహెచ్‌పిల శక్తిని (గతంలో కన్నా 30 బిహెచ్‌పిలు పెరిగింది) మరియు 350 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది.

ఇటీవలి కాలంలో సరికొత్త మోడళ్లను ప్రవేశపెట్టిన టాటా మోటార్స్, తమ ఇదివరకటి మోడళ్లయిన బోల్ట్, జెస్ట్, సఫారీ స్టోర్మ్, హెక్సా వంటి మోడళ్లను డిస్‌కంటిన్యూ చేసిన సంగతి తెలిసినదే. వీటిలో హెక్సా మినహా వేరే ఇతర మోడళ్ల తిరిగి ఉత్పత్తి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

టాటా మోటార్స్ సేల్స్ రిపోర్టుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
టాటా మోటార్స్ ఉత్పత్తులకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. టాటా నుంచి వచ్చిన లేటెస్ట్ మోడల్ ఆల్ట్రోజ్ తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీని దక్కించుకుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో వచ్చిన టాటా ఆల్ట్రోజ్ భారత మార్కెట్లో రూ.5.60 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)తో లభిస్తోంది. ఇది ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి బాలెనో, టొయోటా గ్లాంజా, వోక్స్‌వ్యాగన్ పోలో వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది.


Click it and Unblock the Notifications








