బిఎమ్‌డబ్ల్యూ ఇండియా కొత్త ప్రెసిడెంట్‌గా విక్రమ్ పవా
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్, తమ ఇండియా విభాగానికి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంది. బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్‌గా 'విక్రమ్ పవా'ను నియమించామని, ఆగస్టు 1, 2020 నుండి ఆయన నియామకం అమలవుతుందని కంపెనీ ప్రకటించింది. అప్పటి వరకూ విక్రమ్ పవా బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా తన ప్రస్తుత హోదాలోనే కొనసాగుతారని బిఎమ్‌డబ్ల్యూ తెలిపింది.

విక్రమ్ పవా బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడిగా నియమించబడక ముందు 2017లో బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్‌లో చేరారు. ఆ తర్వాత అతను 2018లో బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ విభాగాలకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించబడ్డారు. ఆ తర్వాత లగ్జరీ కార్ల విభాగంలో బిఎమ్‌డబ్ల్యూ గ్రూపులో బలమైన స్థానానికి చేరుకున్నాడు.

ఈ సందర్భంగా.. బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఆసియా-పసిఫిక్, తూర్పు యూరప్, మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా రీజియన్ల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హెండ్రిక్ వాన్ కుయెన్‌హీమ్ మాట్లాడుతూ, "విక్రమ్ పవా నాయకత్వంలో, బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ తీవ్రమైన పోటీ వాతావరణంలో కూడా నిలదొక్కుకొని భారత మరియు ఆస్ట్రేలియన్ లగ్జరీ కార్ మార్కెట్లలో గణనీయమైన వృద్ధిని కనబరిచిందని" అన్నారు.

"ఓ ప్రాధాన్యత మార్కెట్‌గా, లగ్జరీ ఆటోమోటివ్ విభాగంలో భవిష్యత్ వృద్ధికి మరియు అభివృద్ధికి భారతదేశంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. కొనసాగుతున్న కరోనా మహమ్మారి కారణంగా సవాలుగా మారిన వ్యాపార పరిస్థితుల్లో బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియాను మార్గదర్శకం చేయడానికి పావా అద్భుతమైన ముందస్తు షరతులను తీసుకొచ్చారు. అతని వ్యూహాత్మక ఆలోచనలు, చేతలు మరియు ప్రజలను నడిపించే సామర్థ్యాలతో ఈ అల్లకల్లోల సమయాల్లో కూడా సంస్థను చక్కగా మార్గదర్శకం చేయగలడని భావిస్తున్నామని" హెండ్రిక్ చెప్పారు.

గడచిన ఏప్రిల్ 2020లో బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా మునుపటి అధ్యక్షుడు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన రుద్రతేజ్ సింగ్ ఆకస్మిక మరణంతో ఈ సంస్థలో ఇప్పటి వరకూ ప్రెసిడెంట్‌ను ఎన్నుకోలేదు. అప్పటి నుండి ఈ సంస్థకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీ ఆర్లిండో టీక్సెరియా యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ మన దేశంలో బిఎమ్‌డబ్ల్యూ, మినీ, మరియు మోటారాడ్ (ద్విచక్ర వాహనాల బ్రాండ్) బ్రాండ్‌లను రీటైల్ చేస్తుంది. భారత ఆటోమొబైల్ మార్కెట్‌లోని ప్రీమియం విభాగంపై కన్నేసిన బిఎమ్‌డబ్ల్యూకి చెన్నైలోని ఒక తయారీ కర్మాగారం, ముంబైలోని విడిభాగాల వేర్‌హౌస్, గుర్గావ్ ఎన్‌సిఆర్ వద్ద ఒక శిక్షణా కేంద్రం మరియు దేశంలోని ప్రధాన నగరాల్లోని డీలర్‌షిప్ కేంద్రాలను కలిగి ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా గ్రూపుకి విక్రమ్ పవా అధ్యక్షుడిగా ఎన్నిక కావటంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
బిఎమ్‌డబ్ల్యూ గ్రూపులో అధ్యక్షుని స్థానాన్ని భర్తీ చేయటానికి విక్రమ్ పవా సరైన వ్యక్తి అనేది మా అభిప్రాయం. ఈయన అత్యంత పోటీతో కూడుకున్న అంతర్జాతీయ మార్కెట్లలో సైతం విజయవంతంగా నిలబడిన వ్యక్తి. ఈ నేపథ్యంలో, విక్రమ్ పవా రెట్టింపు ఉత్సాహంతో భారతదేశంలో కూడా విజయకేతనాన్ని ఎగురవేస్తాడని మేము భావిస్తున్నాము.


Click it and Unblock the Notifications








