జులై 2021 నెలలో టాప్ 10 కార్లు.. మారుతి సుజుకిదే పై చేయి..
కరోనా లాక్‌డౌన్ సడలింపుల తర్వాత జూలై 2021 నెలలో కార్ల అమ్మకాలు జోరుగా సాగాయి. వైరస్ వ్యాప్తి భయంతో ప్రజలు స్వంత కార్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపడంతో అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో, గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ జాబితాలో ఎప్పటి మాదిరిగానే మారుతి సుజుకి ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఆసక్తికరంగా ఈసారి వ్యాగన్ఆర్ నెంబర్ వన్ స్థానంలో నిలువగా, స్విఫ్ట్ ద్వితీయ స్థానానికి పడిపోయింది. గత నెలలో టాప్ 10 కార్ల జాబితాలో 8 మోడళ్లు మారుతి సుజుకి సంస్థకు చెందినవే ఉన్నాయి. మిగిలినవి హ్యుందాయ్, టాటా కంపెనీలకు చెందిన కార్లు ఉన్నాయి.

మారుతి సుజుకి నుండి అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన వ్యాగన్ఆర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. గత నెలలో, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కార్ల అమ్మకాలు 22,836 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది జూలైలో ఇవి 13,515 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో వ్యాగన్ఆర్ అమ్మకాలు 68.97 శాతం పెరిగాయి.

ఇక రెండవ స్థానంలో ఉన్న దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన మారుతి సుజుకి స్విఫ్ట్. జులై 2021లో మొత్తం 18,834 యూనిట్ల స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు అమ్ముడయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 10,173 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ కాలంలో స్విఫ్ట్ అమ్మకాలు 81.21 శాతం పెరిగాయి.

ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నది కూడా మారుతి సుజుకి కారే. నెక్సా డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా కంపెనీ విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మారుతి సుజుకి బాలెనో గత నెలలో 14,729 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. కాగా, గతేడాది ఇదే సమయంలో ఇవి 11,575 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో మారుతి బాలెనో అమ్మకాలు 57.97 శాతం పెరిగాయి.

మారుతి సుజుకి అందిస్తున్న పాపులర్ ఎమ్‌పివి ఎర్టిగా ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. గత నెలలో మొత్తం 13,434 యూనిట్ల మారుతి ఎర్టిగా ఎమ్‌పివిలు అమ్ముడయ్యాయి. జులై 2020 నెలలో ఇవి 8,504 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో మారుతి సుజుకి ఎర్టిగా విక్రయాలు 57.97 శాతం పెరిగాయి.

ఈ జాబితాల టాప్ 5 స్థానంలో నిలిచింది హ్యుందాయ్ అందిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటా. గత నెలలో 13,000 యూనిట్ల హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 11,549 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ కాలంలో క్రెటా అమ్మకాలు 12.56 శాతం పెరిగాయి.

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ మారుతి సుజుకి ఆల్టో, అమ్మకాల పరంగా గత నెలలో ఆరవ స్థానానికి పడిపోయింది. జులై 2021లో మొత్తం 12,867 యూనిట్ల ఆల్టో కార్లు అమ్ముడయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 13,654 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో ఆల్టో అమ్మకాలు 5.76 శాతం తగ్గాయి.
| Rank | Model | July 2021 | July 2020 | Growth (%) |
| 1 | Maruti Wagonr | 22,836 | 13,515 | 69 |
| 2 | Maruti Swift | 18,434 | 10,173 | 81.2 |
| 3 | Maruti Baleno | 14,729 | 11,575 | 27.2 |
| 4 | Maruti Ertiga | 13,434 | 8,504 | 58 |
| 5 | Hyundai Creta | 13,000 | 11,549 | 12.5 |
| 6 | Maruti Alto | 12,867 | 13,654 | -5.7 |
| 7 | Maruti Vitara Brezza | 12,676 | 7,807 | 62.3 |
| 8 | Maruti Dzire | 10,470 | 9,046 | 15.7 |
| 9 | Tata Nexon | 10,287 | 4,327 | 137.7 |
| 10 | Maruti Eeco | 10,057 | 8,501 | 18.3 |

ఇకపోతే, ఈ జాబితాలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా 12,676 యూనిట్లతో ఏడవ స్థానంలో (62.37 శాతం) ఉండగా, మారుతి సుజుకి డిజైర్ 10,470 యూనిట్లతో ఎనిమిదవ స్థానంలో (15.74 శాతం), టాటా నెక్సాన్ 10,287 యూనిట్లతో తొమ్మిదవ స్థానంలో (137.74 శాతం) మరియు మారుతి సుజుకి ఈకో 10,057 యూనిట్లతో (18.30 శాతం) పదవ స్థానాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








