ప్రపంచంలోనే అత్యంత సుందరమైన హైపర్‌కారు 'Bugatti Bolide'
ఇటాలియన్ సూపర్ కార్ బ్రాండ్ బుగాట్టి (Bugatti) రూపొందించిన ఓ కొత్త ఉత్పత్తి ప్రపంచంలోనే అత్యంత అందమైన హైపర్ కార్ కీర్తిని దక్కించుకుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కారు ఇంకా అధికారికంగా అమ్మకానికి కూడా రాలేదు. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

ఈ ఇటాలియన్ కంపెనీ తయారు చేసిన బుగాటి బొలిడ్ (Bugatti Bolide) అనే స్పోర్ట్స్ కారు ప్రపంచంలోనే అత్యంత అందమైన హైపర్ కారు టైటిల్ ను గెలుచుకుంది. పారిస్ లో జరుగుతున్న 36 వ వార్షిక ఫెస్టివల్ ఆటోమొబైల్ ఇంటర్నేషనల్ లోని ప్రముఖ కార్ డిజైనర్లు ఈ కారుకి ఆ అవార్డును ప్రకటించారు.

బుగాటి తమ బొలిడ్ కారును గతేడాది కాన్సెప్ట్ మోడల్ గా పరిచయం చేసింది. బుగాటి ఇంజనీర్లు ఈ కారును ప్రత్యేకించి రేసింగ్ ట్రాక్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్మించారు. బుగాటి బొలిడ్ హైపర్ కారు చాలా తేలికైనది మరియు వేగవంతమైనది. గతేడాది ప్రదర్శించిన కాన్సెప్ట్ వాహనాన్ని అనుసరించి, కంపెనీ ప్రస్తుత ప్రొడక్షన్ వెర్షన్ ను తయారు చేసింది.

ఇది ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగవంతమైన హైపర్ కార్ మోడల్. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బుగాటి బొలిడ్ హైపర్ కారు ఇంకా పేరు పెట్టని (అభివృద్ధి దశలో ఉన్న) మరో మూడు ఇతర హైపర్ కార్లతో పోటీపడుతుంది. ఇది వరకు చెప్పుకున్నట్లుగా బుగాటి బొలిడ్ కేవలం రేస్ ట్రాక్ లపై మాత్రమే ఉపయోగించదగిన / నడపదగిన స్పోర్ట్స్ కారు.

ఈ కారు స్ట్రీట్ లీగల్ కాదు, కాబట్టి దీనిని సాధారణ రోడ్లపై నడపటానికి అనుమతి ఉండదు. ఈ కారు కంపెనీ యొక్క పాపులర్ మోడల్ బుగాటి షిరాన్ (Bugatti Chiron) ప్లాట్‌ఫామ్ ను పంచుకుంటుంది. గతంలో ప్రదర్శించిన కాన్సెప్ట్ వెర్షన్ ను 8.0 లీటర్, క్వాడ్-టర్బో, డబ్ల్యూ 16 గ్యాసోలిన్ ఇంజన్‌తో ప్రదర్శించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 1,850 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 110 ఆక్టేన్ రేస్ ఇంధనంతో మాత్రమే పనిచేస్తుంది.

కాగా, ప్రొడక్షన్ వెర్షన్ బుగాటి బొలిడ్ హైపర్ కారు మాత్రం 98 ఆక్టేన్ ఇంధనంతో నడుస్తుంది. ఇందులో రీట్యూన్ చేయబడిన అదే ఇంజన్ గరిష్టంగా 1,600 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు మొత్తం బరువు కేవలం 1,450 కేజీలు మాత్రమే మరియు దీని పవర్-టు-వెయిట్ రేషియో 0.9 కేజీలు / పిఎస్ గా ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా కేవలం 40 యూనిట్ల బుగాటి బొలిడ్ (Bugatti Bolide) హైపర్ కార్లను విక్రయించనున్నారు. ఇప్పుడు ఈ కారును బుక్ చేసుకున్న కస్టమర్లకు 2024 లో డెలివరీలు అందే అవకాశం ఉంది. ఇందులో ఒక్కొక్క కారు విలువ సుమారు 40 లక్షల యూరోలు లేదా 47 లక్షల డాలర్లు. అంటే మనదేశ కరెన్సీలో సుమారు రూ. 35 కోట్లకు పైమాటే అన్నమాట.

ఈ డిజైన్ అవార్డు కోసం పాల్గొనే హైపర్ కార్లకు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఈ నిబంధనల ప్రకారం, పోటీలో పాల్గొనే హైపర్ కార్లు సిరీస్‌లో ఉత్పత్తి చేయబడినవి కావాలి మరియు వాటి ధర 60,000 యూరోల కంటే ఎక్కువగా ఉండాలి. ఈ కార్లు స్పోర్టీ డిజైన్ మరియు అత్యుత్తమ పనితీరును ప్రదర్శించేలా ఉండాలి.

బుగాటి బొలిడ్ ఇంకా సిరీస్ లో ఉత్పత్తి కాలేదు, కంపెనీ ప్లాన్ లో మాత్రం 40 యూనిట్లు ఉత్పత్తి చేయాలని ఉంది. వచ్చే ఏడాది నుండి ఈ కార్ల తయారీ ప్రారంభం అవుతుంది. అంతేకాదు, బుగాటి బొలిడ్ ఇప్పటికీ ప్రయోగాత్మక దశలోనే ఉంది, దీని తుది ఉత్పత్తి వెర్షన్ రాబోయే సంవత్సరాల్లో రూపుదిద్దుకుంటుంది. అయినప్పటికీ, ఈ కారుకి అత్యంత అందమైన హైపర్ కారు అవార్డ్ లభించడం గమనార్హం.

భవిష్యత్తులో రాబోయే ప్రొడక్షన్ మోడల్ బుగాటి బొలిడ్ కారు యొక్క డిజైన్ కి మరియు దాని కాన్సెప్ట్ యొక్క డిజైన్ కి పెద్ద మార్పులు ఉండబోవని సమాచారం. ఈ ట్రాక్ ఫోకస్డ్ హైపర్ కార్ పూర్తిగా ప్రత్యేకమైన ఇంటీరియర్ ను పొందుతుంది. ఈ విషయంలో దాని విడిభాగాలను మరియు ఇంటీరియర్లను బుగాటి చిరోన్ మోడల్ తో భాగస్వామ్యం చేయబడలేదు.

బుగాటి బోలిడ్ రూపకల్పన ఫంక్షన్-ఓవర్-ఫార్మ్ ఫిలాసఫీని అనుసరిస్తుంది మరియు రేస్‌కార్-శైలి కాక్‌పిట్ ను ప్రతిబింబిస్తుంది. ఈ సందర్భంగా బుగట్టి డిజైన్ డైరెక్టర్ అచిమ్ ఆన్‌షీడ్ మాట్లాడుతూ.. బుగాటి బొలిడ్ ఈ అత్యంత గౌరవనీయమైన అవార్డును గెలుచుకోవడం తమకెంతో గౌరవాన్ని తెచ్చిపెట్టిందని అన్నారు. ఈ కారుని డిజైన్ చేయటంలో కృషి చేసిన మొత్తం డిజైన్ బృందానికి ఈ అవార్డు అంకింతం అని చెప్పారు.


Click it and Unblock the Notifications








