ఫిబ్రవరి 2021లో టాప్ 10 కార్ బ్రాండ్స్
ఫిబ్రవరి 2020తో పోలిస్తే ఫిబ్రవరి 2021 కార్ కంపెనీలకు బాగా కలిసొచ్చినట్లుగా తెలుస్తోంది. గత నెలలో చాలా వరకూ కార్ కంపెనీలు ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసుకున్నాయి. గడచిన జనవరి నెలలో కార్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచినప్పటికీ, అమ్మకాలు మాత్రం పెద్దగా ప్రభావితం కాలేదనే చెప్పాలి.

అయితే, ఈ సమయంలో కొన్ని కార్ కంపెనీలు మాత్రం నిరుత్సాహక ఫలితాలను నమోదు చేశాయి. మారుతి, హ్యుందాయ్, టాటా మోటార్స్, కియా మోటార్స్ వంటి సంస్థలు తమ స్థానాలను అలానే నిలుపుకున్నాయి. గత నెలలో బ్రాండ్ వారీగా కార్ల అమ్మకాల వివరాలు ఇలా ఉన్నాయి:

మారుతి సుజుకి ఇండియా గడచిన ఫిబ్రవరి 2021 నెలలో మొత్తం 1,44,700 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ మొత్తం అమ్మకాలు 1,33,702 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 8 శాతం వృద్ధిని సాధించగా, కంపెనీ మార్కెట్ వాటా 53.3 శాతం నుండి 46.9 శాతానికి పడిపోయింది.

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ గడచిన ఫిబ్రవరి 2021 నెలలో 51,600 యూనిట్లను విక్రయించిది. ఫిబ్రవరి 2020లో ఈ అమ్మకాల సంఖ్య 40,010 యూనిట్లుగా ఉంది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 29 శాతం పెరిగాయి. ఇదే సమయంలో మార్కెట్ వాటా కూడా 16 శాతం నుండి 16.7 శాతానికి పెరిగింది.

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ గడచిన నెలలో రెట్టింపు అమ్మకాలను నమోదు చేసింది. ఫిబ్రవరి 2020లో 12,430 యూనిట్లను విక్రయించిన టాటా మోటార్స్ ఫిబ్రవరి 2021లో 27,224 యూనిట్లను విక్రయించి ఏకంగా 119 శాతం వృద్ధిని సాధించింది. ఈ సమయంలో కంపెనీ మార్కెట్ వాటా 5.0 శాతం నుండి 8.8 శాతానికి పెరిగింది.

మరొక కొరియన్ బ్రాండ్ మరియు హ్యుందాయ్ అనుబంధ సంస్థ కియా మోటార్స్, ఈ జాబితాలో నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది. గత నెలలో కియా మొత్తం అమ్మకాలు 16,702 యూనిట్లుగా నమోదై 7 శాతం పెరిగాయి. అంతకు ముందు ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు 15,644 యూనిట్లుగా ఉన్నాయి. అయితే, ఈ సమయంలో కంపెనీ మార్కెట్ వాటా 6.2 శాతం నుండి 5.4 శాతానికి పడిపోయింది.

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా గడచిన నెలలో 15,380 యూనిట్లను విక్రయించి 43 శాతం అమ్మకాల వృద్ధిని సాధించింది. ఫిబ్రవరి 2020లో కంపెనీ అమ్మకాలు 10,756 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో కంపెనీ మార్కెట్ వాటా 4.3 శాతం నుండి 5.0 శాతానికి పెరిగింది.

టొయోటా అమ్మకాలు గత నెలలో 36 శాతం పెరిగి 14,609 యూనిట్లతో ఆరవ స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 2020 నెలలో ఈ బ్రాండ్ మొత్తం అమ్మకాలు 11,043 యూనిట్లుగా ఉన్నాయి.
ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన కైగర్ కంపెనీ అమ్మకాలను పెంచడంలో బాగా పనిచేసింది. ఫిబ్రవరి 2020తో పోలిస్తే, ఫిబ్రవరి 2021లో రెనో ఇండియా మొత్తం అమ్మకాలు 26 శాతం వృద్ధి చెంది 8,787 యూనిట్ల నుండి 11,043 యూనిట్లకు పెరిగాయి.

గత నెలలో హోండా అమ్మకాలు 28 శాతం వృద్ధి చెంది 7,269 యూనిట్ల నుండి 9324 యూనిట్లకు పెరిగాయి. ఇదే సమయంలో ఫోర్డ్ ఇండియా అమ్మకాలు 18 శాతం క్షీణించి 7,019 యూనిట్ల నుండి 5,775 యూనిట్లకు పడిపోయాయి.

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ మరియు నిస్సాన్ కంపెనీలు పోటాపోటీగా వాహనాలను విక్రయించాయి. గత నెలలో ఎమ్‌జి మోటార్ మొత్తం 4,329 కార్లను విక్రయించగా, నిస్సాన్ 4,244 కార్లను విక్రయించింది. గడచిన నెలలో మొత్తంగా అన్ని బ్రాండ్లు కలిపి 3,08,532 వాహనాలను విక్రయించాయి.


Click it and Unblock the Notifications








