Tata కార్లపై సెప్టెంబర్ నెల ఆఫర్లు.. రూ. 70,000 వరకూ నగదు ప్రయోజనాలు!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) తమ కార్లపై సెప్టెంబర్ 2021 నెల ఆఫర్లను ప్రకటించింది. ఈ నెలలో కంపెనీ తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్టంగా రూ. 70,000 వరకూ తగ్గింపులను మరియు వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తోంది.

Tata కార్లపై కంపెనీ అందిస్తున్న ప్రయోజనాలలో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ వంటి పలు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ డిస్కౌంట్లు మరియు ప్రయోజనాలు నగరాన్ని బట్టి మరియు కస్టమర్ ఎంచుకునే మోడల్, వేరియంట్ ను బట్టి మారుతూ ఉంటాయి మరియు స్టాక్స్ లభ్యతకు లోబడి ఉంటాయి. వివిధ మోడళ్లపై కంపెనీ అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

1. Tata Harrier
Tata Motors అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ Tata Harrier (టాటా హారియర్) పై కంపెనీ ఈ సెప్టెంబర్ నెలలో అత్యధికంగా రూ. 70,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 25,000 నగదు తగ్గింపు, రూ. 40,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌లు ఉన్నాయి.

కాగా, Harrier క్యామో మరియు డార్క్ ఎడిషన్ మోడళ్లపై నగదు తగ్గింపు ఆఫర్ వర్తించదు. అయితే, వీటిని కొనుగోలు చేసే కస్టమర్లు ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్‌లను పొందవచ్చు.

2. Tata Safari
కంపెనీ నుండి లేటెస్ట్ గా వచ్చిన Safari ఎస్‌యూవీపై ప్రస్తుతానికి ఎలాంటి నగదు తగ్గింపు లేదా కార్పొరేట్ డిస్కౌంట్ ఆఫర్లు లేవు. అయితే, ఆసక్తి గల కస్టమర్లు కోసం కంపెనీ ఈ ఎస్‌యూవీ రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ను అందిస్తోంది.

Tata Safari ఎస్‌యూవీలో పవర్‌ఫుల్ 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

3. Tata Tigor
ఈ బ్రాండ్ నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ సెడాన్ Tata Tigor యొక్క పెట్రోల్ వేరియంట్ లపై కంపెనీ రూ. 43,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ. 20,000 నగదు తగ్గింపు, రూ. 20,000 ఎక్సేంజ్ బోనస్ మరియు రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లు కలిసి ఉన్నాయి.

4. Tata Tiago
Tata Tiago కంపెనీ నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్. ఈ సెప్టెంబర్ నెలలో Tiago కొనుగోలుపై కస్టమర్లు రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లను పొందవచ్చు. అంటే, సెప్టెంబర్‌లో Tiago కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్న కస్టమర్లు గరిష్టంగా రూ. 38,000 వరకు మొత్తం ప్రయోజనాలను పొందవచ్చన్నమాట.

5. Tata Nexon
Tata Nexon యొక్క డీజిల్ వేరియంట్ రూ. 20,000 వరకు మొత్తం ప్రయోజనాలు లభ్యం కానున్నాయి. ఇందులో రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 5,000 కార్పొరేట్ డిస్కౌంట్ లు కలిసి ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్‌లు కస్టమర్‌లలో ప్రముఖ ఎంపికగా ఉన్నాయి మరియు వీటిపై రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ మాత్రమే లభిస్తుంది.

6. Tata Nexon EV
ఎలక్ట్రిక్ కార్ విభాగంలో లభిస్తున్న Tata Nexon EV పై కూడా కంపెనీ కొన్ని ఆఫర్లను అందిస్తోంది. ఈ కారు కొనుగోలుపై కస్టమర్లకు రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ (XZ ప్లస్ వేరియంట్ పై మాత్రమే) ను మరియు టాప్-ఎండ్ వేరియంట్ కొనుగోలుపై రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ను ఆఫర్ చేస్తోంది. దీనిపై క్యాష్ లేదా కార్పొరేట్ డిస్కౌంట్ లేదు.

7. Tata Altroz
Tata Motors నుండి లభిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ Altroz XZ వేరియంట్ కొనుగోలు పై కంపెనీ రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్ ను మాత్రమే అందిస్తోంది. ఈ మోడల్ పై ఎక్స్‌ఛేంజ్ బోనస్ లేదా కార్పొరేట్ డిస్కౌంట్ లేదు.
డీలర్‌షిప్ ఉండే ప్రాంతం, నగరం మరియు స్టాక్ లభ్యతను బట్టి ఈ ఆఫర్లు మారుతూ ఉంటాయి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత టాటా మోటార్స్ డీలర్‌షిప్ ను సందర్శించండి.

టాటా మోటార్స్ ఈ కొత్త ఆఫర్ల ద్వారా తమ నెల అమ్మకాలను పెంచుకోవాలని చూస్తోంది. ఈ పండుగ సీజన్ సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునేందుకు కంపెనీ గట్టిగా ప్రయత్నిస్తోంది. గడచిన ఆగస్ట్ నెలలో కంపెనీ 28,017 యూనిట్లను విక్రయించి, వార్షిక అమ్మకాల పరంగా 51 శాతం వృద్ధిని సాధించింది. ఆగస్ట్ 2020 లో ఇవి 18,583 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో కంపెనీ మార్కెట్ వాటా కూడా 8.2 శాతం నుండి 11.4 శాతానికి పెరిగింది.

పండుగ సీజన్‌లో Tata Punch లాంచ్..
ఇదిలా ఉంటే, Tata Motors ఇటీవల ఆవిష్కరించిన తమ సరికొత్త మైక్రో ఎస్‌యూవీ Tata Punch ను కంపెనీ ఈ పండుగ సీజన్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్కెట్ సమాచారం ప్రకారం, ఈ మైక్రో ఎస్‌యూవీ అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ ప్రారంభంలో మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది.

Tata Punch మైక్రో ఎస్‌యూవీని కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్లతో విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో మొదటిది 1.2-లీటర్, 3-సిలిండర్ రివోట్రాన్ ఇంజన్. ఇది గరిష్టంగా 86 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభించే అవకాశం ఉంది.

ఇకపోతే, రెండవది 1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 140 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications