ఆగస్ట్ 17న విడుదల కానున్న హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్; బుకింగ్స్ ఓపెన్!
జపనీస్ కార్ బ్రాండ్ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ కాంపాక్ట్ సెడాన్ అమేజ్‌లో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త 2021 హోండా అమేజ్ సెడాన్‌ను ఆగస్టు 17న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

మార్కెట్ సమాచారం ప్రకారం, ఇప్పటికే కొన్ని హోండా డీలర్‌షిప్‌లు కొత్త అమేజ్ కోసం అనధికారికంగా బుకింగ్‌లను స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త 2021 హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ అనేక డిజైన్ అప్‌డేట్స్‌తో పాటు, కొన్ని కొత్త ఫీచర్లతో కూడా అందుబాటులోకి రావచ్చని సమాచారం.

హోండా తమ సెకండ్ జనరేషన్ అమేజ్ మోడల్‌ను 2018 ఆటో ఎక్స్‌పోలో ప్రవేశపెట్టింది మరియు అది ఈ సంవత్సరం నుండే మన దేశంలో అమ్ముడవుతోంది. ప్రస్తుతానికి, గడచిన మూడేళ్లలో కంపెనీ తమ కాంపాక్ట్ సెడాన్‌లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏమీ చేయలేదు. హోండా అమేజ్ భారతదేశంలో మాత్రమే తయారు చేయబడుతోంది మరియు ఇక్కడి నుండి అది వివిధ దేశాలకు ఎగుమతి అవుతోంది.

అమేజ్ ఫేస్‌లిఫ్ట్‌లో ఏయే అప్‌గ్రేడ్స్ ఉంటాయి?
కొత్త 2021 హోండా అమేజ్‌లో పూర్తి ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్, కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్ వంటి మార్పులను ఆశించవచ్చు. అంతే కాకుండా, కంపెనీ ఇందులో కొన్ని కొత్త కలర్ ఆప్షన్లను కూడా జోడించే అవకాశం ఉంది. ప్రీమియం లుక్ అండ్ ఫీల్ కోసం ఇందులో ఎక్కువగా క్రోమ్ గార్నిష్ చేసే అవకాశం ఉంది.

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో కొత్త ఫ్యాబ్రిక్ అప్‌హోలెస్ట్రీ మరియు కొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ ఉండే అవకాశం ఉంది. ఇవే కాకుండా, కారులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఆప్షన్‌ను కూడా అందించవచ్చని తెలుస్తోంది. మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త మోడల్‌లోని ఎంట్రీ లెవల్ ట్రిమ్స్‌లో కంపెనీ మరింత స్టాండర్డ్ ఫీచర్లను ఆఫర్ చేసే అవకాశం ఉంది.

ఇంజన్, ట్రాన్సిమిషన్
ఇంజన్ పరంగా కొత్త అమేజ్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న హోండా అమేజ్ సెడాన్‌లో ఉపయోగిస్తున్న పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లనే ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లోను ఉపయోగించనున్నారు. పెట్రోల్ వెర్షన్‌లో 1.2-లీటర్ ఐ-విటిఇసి పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్‌లో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్లు ఉండనున్నాయి.

ఈ ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానున్నాయి. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పి పవర్‌ను మరియు 110 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, డీజిల్ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా ఫ్యూచర్ ప్లాన్స్
హోండా అందిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ సెడాన్ సిటీలో కంపెనీ ఓ హైబ్రిడ్ వేరియంట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోందని సమాచారం. అంతేకాకుండా, కంపెనీ త్వరలోనే తమ కాన్సెప్ట్ ఎస్‌యూవీ 'ఎన్‌ఎక్స్7' ఉత్పత్తిని కూడా ప్రారంభించే అవకాశం ఉంది.

భారతదేశంలో 'ఎలివేట్' పేరుతో కంపెనీ ఓ కొత్త మోడల్ కోసం ట్రేడ్‌మార్క్‌ను కూడా దాఖలు చేసింది. ప్రస్తుతం హోండా నుండి భారతదేశంలో చాలా తక్కువ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం, హోండా ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో జాజ్, డబ్ల్యూ-ఆర్‌వి, సిటీ మరియు అమేజ్ మోడళ్లు మాత్రమే ఉన్నాయి.


Click it and Unblock the Notifications








