జీప్ కంపాస్ 7-సీటర్ ఎస్‌యూవీ కొత్త టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల
అమెరికన్ ఐకానిక్ కార్ బ్రాండ్ జీప్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న కంపాస్ ఎస్‌యూవీలో ఓ 7-సీటర్ వెర్షన్‌ను ప్రవేశపెట్టబోతోందని తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజాగా, జీప్ ఇండియా ఇందుకు సంబంధించిన ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది.

జీప్ కంపాస్ ప్రపంచ వ్యాప్తంగా 5-సీటర్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తోంది. కాగా, కంపెనీ ఇప్పుడు ఇందులో తొలిసారిగా ఓ 7-సీటర్ వెర్షన్‌ను తీసుకురాబోతోంది. జీప్ కంపాస్ ఆధారంగా తయారు చేయబోయే ఈ 7-సీటర్ మోడల్‌ని "జీప్ కమాండర్" అని పిలిచే ఆస్కారం ఉంది.

ఈ టీజర్ వీడియోలో ఇది పాక్షికంగా స్పష్టమవుతుంది. ఇందులో ER బ్యాడ్జ్‌ని కంపెనీ హైలైట్ చేసింది. జీప్ కంపాస్ 7-సీటర్ (అలియాస్ జీప్ కమాండర్) ముందుగా బ్రెజిలియన్ మార్కెట్లో విడుదల కానుంది. ఆ తర్వాత, భారతదేశంలో కూడా విడుదల కానుంది.

జీప్ కమాండర్ డిజైన్ అంశాలను చూపించే వీడియోను కంపెనీ టీజ్ చేసింది. తాజా నివేదికల ప్రకారం, కొత్త జీప్ 7-సీటర్ మోడల్ ఈ ఏడాది చివరినాటికి భారత మార్కెట్లోకి ప్రవేశించవచ్చని అంచనా. జీప్ యొక్క ఇతర మోడళ్లైన రెనెగేడ్, కంపాస్ మరియు ఫియట్ టోరోలతో పాటు బ్రెజిల్‌లోని గోయానాలో ఈ కమాండర్ ఎస్‌యూవీ ఉత్పత్తి చేయనున్నారు.

జీప్ బ్రాండ్ 2000 ల ప్రారంభ కాలంలో కమాండర్ అనే ఏడు సీట్ల మోడల్‌ను విక్రయించేంది. కంపెనీ ఇప్పుడు ఆ పేరును తిరిగి ఉపయోగించుకోనుంది. ఈ కొత్త 7-సీటర్ ఎస్‌యూవీ, కంపాస్ ఆధారంగా తయారవుతున్నప్పటికీ, ఇందులో పూర్తిగా సరికొత్త ప్యాకేజీలు ఉంటాయని భావిస్తున్నారు.

భారతదేశం కోసం జీప్ డెవలప్ చేస్తున్న మోడల్‌ని కమాండర్ అని పిలువకపోవచ్చు. ప్రస్తుతం కంపెనీ ఈ మోడల్‌ను హెచ్ 6 కోడ్‌నేమ్‌తో డెవలప్ చేస్తోంది. ఈ టీజర్ వీడియోలో కమాండర్ ఎస్‌యూవీ యొక్క గ్రిల్ మరియు హెడ్‌ల్యాంప్ డిజైన్‌ను చూడవచ్చు. ఇందులోని గ్రిల్ డిజైన్ స్టాండర్డ్ 7-స్లాట్ గ్రిల్ కన్నా భిన్నంగా కనిపిస్తుంది.

భారత రోడ్లపై ఈ 7-సీటర్ కంపాస్ మోడల్‌ని కంపెనీ ఇప్పటికే విస్తృతంగా పరీక్షిస్తోంది. భారత మార్కెట్లో, ఈ కొత్త ఎస్‌యూవీని కంపాస్ మరియు గ్రాండ్ చెరోకీల మధ్యలో ఉంచనున్నారు. ఇది ఐదు సీట్ల కంపాస్ మోడల్ మాదిరిగానే మోనోకోక్ ప్లాట్‌ఫాంపై నిర్మించబడుతుందని భావిస్తున్నారు.

స్టాండర్డ్ కంపాస్‌తో పోల్చుకుంటే, దీని ఇంటీరియర్ క్యాబిన్ చాలా విశాలంగా ఉండి, మూడవ వరుసలోని ప్రయాణీకులకు సైతం సౌకర్యవంతమైన సీటింగ్ అనుభవాన్ని అందించేలా ఉంటుందని సమాచారం. ఇందుకోసం కంపెనీ దీని వీల్‌బేస్ పెంచనుంది. కొత్త కంపాస్‌లో 6-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగేరేషన్స్ ఉండొచ్చని అంచనా.

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, దీని తయారీ ఖర్చును తగ్గించేందుకు కంపెనీ ప్రస్తుత 5-సీటర్ కంపాస్‌లో ఉపయోగిస్తున్న ఇంజన్లనే ఈ 7-సీటర్ మోడల్‌లోనూ కొనసాగించవచ్చని సమాచారం. ఇందులో అదే 2.0 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్ మరియు 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను ఇవ్వవచ్చు.

ఇందులోని పెట్రోల్ ఇంజన్‌ను వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్ నుండి మరియు డీజిల్ ఇంజన్‌ను 5 సీట్ల కంపాస్ మోడల్ నుండి తీసుకోవచ్చు. ఈ ఇంజన్ 172 బిహెచ్‌పి శక్తిని, 350 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

గేర్‌బాక్స్ విషయానికి వస్తే, పెట్రోల్ వెర్షన్ 8-స్పీడ్ ఆటోమేటిక్‌తో మరియు డీజిల్ వెర్షన్ 6-స్పీడ్ మాన్యువల్ అలాగే 9-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లతో లభ్యం కావచ్చు. ఈ ఎస్‌యూవీకి 4x4 తో పాటుగా 4x2 ఆప్షన్లను జోడించవచ్చు.


Click it and Unblock the Notifications








