Mahindra Javelin దూసుకొస్తోంది.. పక్కకు జరగండి..
భారతదేశపు ప్రముఖ మరియు అగ్రగామి యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) ఇటీవల ప్రవేశపెట్టిన XUV700 మోడల్‌తో కొత్త మోడళ్ల విడుదలకు తెరతీసింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ తర్వాత కంపెనీ అనేక కొత్త మోడళ్లను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

తాజాగా, మహీంద్రా జావెలిన్ (Mahindra Javelin) అనే పేరును కంపెనీ ట్రేడ్‌మార్క్ చేసింది. ఇటీవల జరిగిన టోక్యో ఒలంపిక్స్ 2020 లో భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా అథ్లెట్ విభాగంలో, జావెలిన్ త్రో ఆటలో బంగారు పతకం గెలిచిన నీరజ్ చోప్రా నుండి ప్రేరణ పొంది Mahindra ఈ కొత్త Javelin అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే, ఇంకా అధికారికంగా తెలియాల్సిన విషయం ఏంటంటే, Mahindra Javelin అనే పేరుతో కంపెనీ పూర్తిగా ఓ సరికొత్త మోడల్ ను మార్కెట్లో విడుదల చేయబోతోందా లేక జావెలిన్ త్రో ఆటగాళ్ల నుండి ప్రేరణ పొంది ఇప్పటికే మార్కెట్లో ఉన్న మోడళ్ల నుండి ఏదైనా స్పెషల్ ఎడిషన్ ని విడుదల చేయబోతోందా అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతానికి Mahindra ఈ విషయం గురించి ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. కంపెనీ ఈ పేరును ఆగస్టు 9 న ట్రేడ్‌మార్క్ కోసం రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 7 న టోక్యో ఒలింపిక్స్ 2020 లో జావెలిన్ త్రో పోటీలో నీరజ్ చోప్రా స్వర్ణం గెలుచుకున్న నేపథ్యంలో, అతడికి ఓ సరికొత్త Mahindra XUV700 ని కానుకగా ఇవ్వనున్నట్లు Anand Mahindra ప్రకటించిన సంగతి తెలిసినదే.

మా అంచనా ప్రకారం, ఈ విషయాలన్నింటినీ కలిపి చూసినట్లయితే, Mahindra Javelin అనే పేరు XUV700 ఎస్‌యూవీతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. టోక్యో ఒలింపిక్స్ 2020 లో గోల్డ్ మెడల్ సాధించిన విజేత నీరజ్ చోప్రాకు అంకితం చేసేలా XUV700 ఎస్‌యూవీలో కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్ మోడల్ ను ఆటగాళ్లకు ఇచ్చే బహుమతిగా ఉంటుందని తెలుస్తోంది.

ఒకవేళ ఇది స్పెషల్ ఎడిషన్ అయినట్లయితే, Mahindra Javelin ను కంపెనీ అదే థీమ్ (జావెలిన్ త్రో) ఆధారంగా రూపొందించే అవకాశం ఉంది. ఇటీవలే ప్రముఖ కార్ డిజైనర్ ప్రతాప్ ఘోష్ Mahindra బృందంలో చేరారు మరియు ఈ పరిస్థితుల నేపథ్యంలో, అతను ఈ స్పెషల్ ఎడిషన్ కారును స్వయంగా డిజైన్ చేయవచ్చని సమాచారం. మరి అది ఎలా ఉండబోతోందనని సర్వత్రా ఆసక్తిగా ఉంది.

నీరజ్ చోప్రా విషయం అటుంచితే, ఇటీవల జరిగిన పారాలింపిక్స్‌లో మూడోసారి జావెలిన్ త్రోలో తన సొంత రికార్డును బద్దలు కొట్టిన సుమిత్ అంటిల్ కు కూడా కొత్త XUV700 ఎస్‌యూవీని బహుమతిగా ఇస్తున్నట్లు Anand Mahindra ప్రకటించారు. ఇటీవల అతను ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు మరియు ఈ కారు రూపకల్పన బాధ్యత కూడా ఇవ్వబడింది ప్రతాప్ ఘోష్ కే అప్పగించబడింది.

Mahindra and Mahindra లిమిటెడ్ చీఫ్ డిజైన్ ఆఫీసర్ ప్రతాప్ ఘోష్ ని ట్యాగ్ చేస్తూ, Anand Mahindra ఈ ప్లేయర్ కోసం XUV700 యొక్క Javelin ఎడిషన్‌ను డిజైన్ చేయమని ట్వీట్ చేశారు. దీన్నిబట్టి చూస్తుంటే, సుమిత్ ఆంటిల్ కూడా ఈ స్పెషల్ ఎడిషన్ Mahindra Javelin XUV700 ఎస్‌యూవీని పొందవచ్చని భావిస్తున్నారు.

మొత్తమ్మీద చూసుకుంటే, Mahindra Javelin అనేది XUV700 ఎస్‌యూవీ యొక్క స్పెషల్ ఎడిషన్ అని తెలుస్తోంది మరియు దీనిని ప్రత్యేకించి జావెలిన్ త్రో ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన వెర్షన్ అనిపిస్తోంది.

Mahindra XUV700 గురించి క్లుప్తంగా..
ఇక Mahindra XUV700 ఎస్‌యూవీని విషయానికి వస్తే, కంపెనీ ఇటీవలే ఈ మోడల్ ను MX మరియు AX అనే రెండు ట్రిమ్‌లలో మొత్తం నాలుగు వేరియంట్‌లలో ప్రవేశపెట్టింది. ఇందులో 5-సీటర్ మరియు 7-సీటర్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఈ మోడల్ లో మరిన్ని వేరియంట్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

కొత్త XUV700 యొక్క MX మరియు AX ట్రిమ్‌లు రెండూ కూడా అనేక అధునాతన ఫీచర్లు మరియు పరికరాలతో పాటుగా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌ల ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి. కంపెనీ ఈ కారును కేవలం రూ.11.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే మార్కెట్లో విడుదల చేసింది.

ఈ కారులో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఒకే డ్యాష్‌బోర్డులో అమర్చిన రెండు 10.25 ఇంచ్ డిజిటల్ స్క్రీన్లు (ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం మరొకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం), సరికొత్త సోనీ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ కార్‌ప్లే, ఈ-సిమ్ ఆధారిత కనెక్టింగ్ టెక్నాలజీ, వాయిస్ అసిస్టెంట్, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫయర్ వంటి మరెన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇందులో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌లు ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 197 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా, డీజిల్ ఇంజన్ రెండు ట్యూన్‌లలో లభిస్తుంది.

ఇందులో మొదటిది 153 బిహెచ్‌పి పవర్ మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇకపోతే, రెండవది 182 బిహెచ్‌పి పవర్ మరియు 450 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్లన్నీ కూడా 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications








