మారుతి సుజుకి ఈకో అంబులెన్స్‌పై రూ.88,000 తగ్గింపు; కారణమేంటంటే..?
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న ఈకో వ్యాన్ యొక్క అంబులెన్స్ వెర్షన్ ధరలను కంపెనీ భారీగా తగ్గించింది. ఈ మోడల్‌పై ఇప్పుడు గరిష్టంగా రూ.88,000 తగ్గింపు లభిస్తుంది.

ధరల తగ్గింపు తర్వాత ఈ మోడల్ ఇప్పుడు రూ.6.16 లక్షల (ఎక్స్-షోరూమ్)కు లభిస్తుంది. అంబులెన్సులపై సవరించిన జిఎస్‌టి రేట్లే ఇందుకు ప్రధాన కారణం. ఇదివరకు అంబులెన్సులపై జిఎస్‌టి 28 శాతం ఉండగా, ఇప్పుడు దానిని 12 శాతానికి తగ్గించారు.

అయితే, గమనించాల్సిన విషయం ఏంటంటే, తగ్గిన జిఎస్‌టి రేట్ల ఉపశమనం కేవలం సెప్టెంబర్ 30, 2021 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి.

తాజా ధరల సవరణ అనంతరం, మారుతి సుజుకి ఈకో అంబులెన్స్ ధర రూ.6.16 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. అంతకు ముందు దీని ధర రూ.7.04 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ)లో రెగ్యులేటరీ ఫైలింగ్ సందర్భంగా మారుతి సుజుకి ఈ విషయాన్ని వెల్లడించింది.

రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మారుతి సుజుకి పేర్కొన్న సమాచారం ప్రకారం "ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ నెంబర్ 05/2021 ప్రకారం, ఈకో అంబులెన్సులపై జిఎస్‌టి రేటు సెప్టెంబర్ 30, 2021 వరకు 28 శాతం నుండి 12 శాతానికి తగ్గించబడింది.

దీని ప్రకారం, ఈకో అంబులెన్స్ యొక్క ఎక్స్-షోరూమ్ ధరలో తగ్గింపు ఉంటుంది మరియు ఢిల్లీలో వర్తించే సవరించిన ఎక్స్-షోరూమ్ ధర రూ.6,16,875 అవుతుంది" అని పేర్కొంది.

జూన్ 21, 2021 నుండి అమల్లోకి వచ్చే విధంగా డీలర్లకు ఇన్వాయిస్ చేసిన వాహనాలతో పాటు డీలర్‌షిప్‌ల ద్వారా ఇన్వాయిస్ చేయబడిన వాహనాలకు కూడా ఈ ధరల మార్పు వర్తిస్తుందని బిఎస్‌ఇ ఫైలింగ్‌లో మారుతి సుజుకి తెలిపింది.

జూన్ 14న మారుతి ఇకో అంబులెన్స్ బుక్ చేసుకున్న వినియోగదారులకు కూడా ఈ తగ్గింపు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఇక మారుతి సుజుకి ఈకో అంబులెన్స్ విషయానికి వస్తే, ఇందులో స్టాండర్డ్ ఈకో వ్యాన్‌లో లభించే అదే 1.2-లీటర్, ఫోర్ సిలిండర్ల ఇంజన్ ఉంటుంది.

ఈ ఇంజన్ గరిష్టంగా 72 బిహెచ్‌పి శక్తిని మరియు 98 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 44వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో, కంపెనీ ఈ ప్రకటన చేసింది. ఈ సమావేశంలో వివిధ రకాల మందులు, కోవిడ్ టెస్టింగ్ కిట్లు, మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు మరియు బై-పాప్ యంత్రాలతో సహా కోవిడ్-19 రిలీఫ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఉపయోగిస్తున్న నిర్దిష్ట వస్తువులపై జిఎస్‌టి రేట్లను ఈ కౌన్సిల్ తగ్గించింది.


Click it and Unblock the Notifications








