మారుతి సుజుకి వాహనాలపై జులై 31 వరకు ఫ్రీ సర్వీస్, వారంటీల పొడగింపు
కరోనా మహమ్మారి కారణంగా, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ పాక్షిక లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. ఈ నేపథ్యంలో, భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, తమ వినియోగదారుల సౌలభ్యం కోసం ఉచిత సేవ (ఫ్రీ సర్వీస్), వారంటీ మరియు పొడిగించిన (ఎక్స్‌టెండెడ్) వారంటీని జూలై 31, 2021వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

గతంలో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తమ కొత్త వాహనాల విషయంలో ఉచిత సర్వీస్ మరియు వారంటీ వ్యవధిని జూన్ 30, 2021 వరకూ పొడిగించిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు ఈ సేవలను జులై 31, 2021 వరకు పొడగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ఈ ఏడాది మార్చి 15 నుంచి జూన్ 30 మధ్య కాలంలో ఉచిత సేవ మరియు వారంటీ కాలం ముగిసిన వాహనాలకు ఈ సేవల పొడిగింపు వర్తిస్తుందని కంపెనీ వివరించింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి.

ఈ సమయంలో, ఆయా రాష్ట్రాలలో స్థానిక లాక్‌డౌన్, కర్ఫ్యూ మరియు ప్రయాణ ఆంక్షలు కూడా అమలులో ఉన్నాయి. ఫలితంగా, దేశంలోని మారుతి సుజుకి కస్టమర్లు తమ వాహనాలను ఎక్కువగా ఉపయోగించలేకపోయారు లేదా సరైన సమయానికి వాటిని సర్వీస్ చేయించలేకపోయారు.

ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో కస్టమర్లు తమ వాహనాల యొక్క ఉచిత సర్వీస్, వారంటీ మరియు ఎక్స్‌టెండెడ్ వారంటీ సేవలను పూర్తిగా వినియోగించుకోలేకపోయారు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న మారుతి సుజుకి సంస్థ, తమ వినియోగదారుల సౌకర్యం కోసం ఈ సేవలను జులై 2021 నెలఖరు వరకూ పొడగించింది.

ఈ విషయంపై మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సర్వీసెస్) పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. "జూలై 31 వరకు ఉచిత సేవలు, వారెంటీలు మరియు ఎక్స్‌టెండెడ్ వారెంటీల గడువును పొడిగించాలని కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వలన వినియోగదారులకు ఈ మహమ్మారి సమయంలో పరిమితం చేయబడిన కదలికను ఎదుర్కొంటున్నందున వారికి మంచి సౌకర్యాన్ని అందిస్తుంది" అని ఆయన అన్నారు.

జులై నెలలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సడలింపులు కొనసాగుతున్న తరుణంలో, కస్టమర్లు ఇప్పుడు తమ సౌలభ్యం ప్రకారం ఈ సేవలను నెలాఖరులోగా ఎప్పుడైనా పొందవచ్చు. ఇకపోతే, మారుతి సుజుకి ప్రభుత్వం నిర్దేశించిన అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తూ తమ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. వినియోగదారుల కోసం వాహన పికప్, డ్రాప్ వంటి సేవలను కూడా అందిస్తోంది.

ఇదిలా ఉంటే, మారుతి సుజుకి ఇండియా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త తరం సెలెరియో హ్యాచ్‌బ్యాక్ విడుదల మరికొంత ఆలస్యమైనట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి, ఈ ఏడాది ఏప్రిల్ నెల నాటికి భారత మార్కెట్లో విడుదల కావల్సిన కొత్త తరలం సెలెరియో, కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యమైంది.

అయితే, తాజా మీడియా నివేదికల ప్రకారం, మారుతి సుజుకి ఇప్పుడు తమ కొత్త తరం 2021 సెలెరియో కారును సెప్టెంబరు నెలలో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కొత్త సెలెరియో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా మరింత శుద్ధి చేయబడిన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభించనుంది.


Click it and Unblock the Notifications








