Celerio vs Santro vs Tiago: మైలేజ్‌లో ఏది బెస్ట్?
భారతదేశంలో అధిక మైలేజ్ ఇచ్చే కార్లకు ఎల్లప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ప్రత్యేకించి పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి కార్ల అవసరం ఎంతో ఉంది. బెస్ట్ మైలేజ్ కార్లు ప్రధానంగా గుర్తుకు వచ్చేవి, మారుతి సుజుకి కార్లు. భారతదేశపు నెంబర్ వన్ కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి విక్రయిస్తున్న కొన్ని మోడళ్లు సెగ్మెంట్లో కెల్లా అత్యుత్తమమైన మైలేజీని అందిస్తాయి.

తాజాగా, మారుతి సుజుకి నుండి వచ్చిన కొత్త 2021 సెలెరియో హ్యాచ్‌బ్యాక్ ఈ సెగ్మెంట్లో కెల్లా అత్యధిక మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. కొత్త తరం మారుతి సెలెరియో ఈ విభాగంలో నేరుగా హ్యుందాయ్ శాంత్రో మరియు టాటా టియాగో వంటి ఎంట్రీ లెవల్ స్మాల్ కార్స్ తో పోటీ పడుతుంది. మరి సెలెరియో దాని పోటీదారులతో పోల్చుకుంటే, ఎంత అధిక మైలేజీని అందిస్తుందో తెలుసుకుందాం రండి.

పెట్రోల్ మాన్యువల్
కొత్త తరం 2021 మారుతి సుజుకి సెలెరియో దాని 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో లభిస్తుంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్ తో లీటరు పెట్రోల్ కి 25.23 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే, కొత్త సెలెరియోలోని LXi, VXi మరియు ZXi వేరియంట్లు మాత్రమే ఇంత అధిక మైలేజీనిస్తాయి. కాగా, సెలెరియో ZXI+ వేరియంట్ మాత్రం లీటరు పెట్రోల్ కి 24.97 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇది దాని విభాగంలో అత్యధిక మైలేజీని కలిగి ఉండి, ఇతర పోటీదారులను అధిగమిస్తుంది.

మారుతి సెలెరియో తర్వాత, హ్యుందాయ్ శాంత్రో విషయానికి వస్తే, ఇది 1.1 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది మరియు ఈ కారు మాన్యువల్ మరియు ఏఎమ్‌టి గేర్‌బాక్స్ లు రెండూ కూడా ఒకేరకమైన మైలేజీని ఆఫర్ చేస్తాయి. ఇది లీటరుకు 20.3 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇంజన్ మరియు మైలేజ్ పరంగా శాంత్రో రెండవ స్థానంలో ఉంది. కాగా, ఆ తర్వాతి స్థానంలో టాటా టియాగో ఉంది. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది మరియు ఇది మాన్యువల్ గేర్‌బాక్స్ తో లీటరుకు 20.09 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

పెట్రోల్ ఆటోమేటిక్
పెట్రోల్ ఆటోమేటిక్ (ఏఎమ్‌టి లేదా ఏజిఎస్) గేర్‌బాక్స్ విషయానికి వస్తే, కొత్త తరం 2021 మారుతి సుజుకి సెలెరియో పెట్రోల్ ఇంజన్ మరియు ఏఎమ్‌టి గేర్‌బాక్స్ సాయంతో లీటరు పెట్రోల్ కి 26.68 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇది VXi వేరియంట్‌లో లభిస్తుంది. కాగా, పెట్రోల్ ఇంజన్ మరియు ఏఎమ్‌టి కాంబినేషన్ లో సెలెరియో ZXi, ZXi+ వేరియంట్‌లు లీటరు పెట్రోల్ కి 26 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి.

అయితే, హ్యుందాయ్ శాంత్రో పెట్రోల్ ఇంజన్ తో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులో లేదు. కానీ, టాటా టియాగో మాత్రం పెట్రోల్ ఇంజన్ మరియు ఏఎమ్‌టి గేర్‌బాక్స్ తో అందుబాటులో ఉంటుంది. ఇది లీటరుకు 19.27 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. పైన పేర్కొన్న మైలేజ్ గణాంకాలన్నీ కూడా ఏఆర్ఏఐ ద్వారా అందించబడినవి మరియు వాస్తవ పరిస్థితుల్లో ఇవి మారే అవకాశం ఉందని గమనించాలి.

ఈ గణాంకాలను గమనిస్తే, మారుతి సుజుకి యొక్క కొత్త తరం సెలెరియో హ్యాచ్‌బ్యాక్ ఈ మూడు కార్లలో కెల్లా అత్యధిక మైలేజ్‌ను అందిస్తుంది. ఇదిలా ఉంటే, మారుతి సుజుకి రాబోయే నెలల్లో ఈ సెలెరియో సిఎన్‌జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) తో నడిచే ఓ కొత్త వెర్షన్ కూడా తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సిఎన్‌జి వెర్షన్ సెలెరియో కూడా దాని పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే ఈ సెగ్మెంట్లో కెల్లా అత్యధిక మైలేజీని అందించవచ్చని తెలుస్తోంది.

సమాచారం కొరకు, పాత తరం మారుతి సుజుకి సెలెరియో యొక్క 998 సిసి పెట్రోల్ ఇంజన్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో లీటరుకు 21.63 కిలోమీటర్ల మైలేజీని అందించేది. అలాగే, సిఎన్‌జి మాన్యువల్ మోడల్ కేజీకి 30.47 కిలోమీటర్ల మైలేజీని అందించేది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కొత్త తరం 2021 సెలెరియో యొక్క CNG మోడల్‌ను వ్యక్తిగత మరియు వాణిజ్య ఉపయోగం కోసం విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

భారత మార్కెట్లో కొత్త తరం 2021 మారుతి సుజుకి సెలెరియో హ్యాచ్‌బ్యాక్ ధరలు రూ. 4.99 లక్షల నుండి రూ. 6.94 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఈ మోడల్ కోసం దేశవ్యాప్తంగా బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. ఆసక్తిగల కస్టమర్లు రూ. 11,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి వెబ్‌సైట్ లో కానీ లేదా అధికారిక డీలర్‌షిప్ నుండి కానీ బుక్ చేసుకోవచ్చు. కొత్త అవతార్‌లో వచ్చిన సెలెరియోలో మునుపటి కన్నా మెరుగైన డిజైన్ మరియు ఫీచర్లు ఉన్నాయి.

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 సెలెరియో కారులో కంపెనీ లేటెస్ట్ 1.0-లీటర్ కె10సి సిరీస్ త్రీ-సిలిండర్ డ్యూయెల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 65 బిహెచ్‌పి పవర్ ను మరియు 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో లభిస్తుంది. ఈ ఇంజన్ మైలేజీని మెరుగుపరచడానికి కంపెనీ ఇందులో స్టార్ట్-స్టాప్ టెక్నాలజీని జోడించింది.


Click it and Unblock the Notifications








