పరుగులు పెడుతున్న Skoda Kushaq బుకింగ్స్: ఎందుకింత డిమాండ్ అంటే?
ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా (Skoda) కొంత కాలం క్రితం భారతీయ మార్కెట్లో తన మిడ్-సైజ్ SUV అయిన స్కోడా కుషాక్ (Skoda Kushaq) ను విడుదల చేసింది. ఈ SUV భారతీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందకు సాగుతోంది. ఇటీవల కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఇప్పటికి Skoda Kushaq బుకింగ్స్ కేవలం నాలుగు నెలల కాలంలో 15,000 వరకు నమోదు చేయగలిగినట్లు తెలిపింది. స్కోడా అమ్మకాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి.

స్కోడా ఆటో యొక్క ఈ మిడ్-సైజ్ SUV స్కోడా కుషాక్, అమ్మకాల పరంగా గణనీయంగా ముందుకు సాగుతోంది. అయితే కంపెనీ తన ఉనికిని మరియు అమ్మకాలను మరింత విస్తరించాలనే నేపథ్యంలో మరో కొత్త మిడ్-సైజ్ సెడాన్ అయిన స్కోడా స్లావియాను 2021 నవంబర్ 18 న ఆవిష్కరించనుంది. అయితే ఈ కొత్త మోడల్ వచ్చే ఏడాది మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

కేవలం నాలుగు నెలల సమయంలో స్కోడా కుషాక్ యొక్క బుకింగ్స్ 15,000 యూనిట్ల కంటే ఎక్కువ కావడం అనేది కంపెనీ సాధించిన గొప్ప విజయం అనే చెప్పాలి. కంపెనీ ఈ కొత్త SUV ని MQB-A0-IN డిజైన్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించింది. అయితే ఈ SUV లో కంపెనీ 95 శాతం వరకు స్థానికీకరణను ఉపయోగించింది.

స్కోడా కుషాక్ SUV ని కంపెనీ భవిష్యత్తులో అన్ని భాగాలను భారతదేశంలోనే తయారుచేసే అవకాశం ఉంటుంది. స్కోడా కుషాక్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో స్కోడా యొక్క ఐకానిక్ ఫ్రంట్ గ్రిల్ ఇవ్వబడింది. ఇది కాకుండా, కారులో LED హెడ్‌ల్యాంప్స్, LED ఫాగ్ ల్యాంప్స్ మరియు LED టెయిల్ లైట్లు ఇవ్వబడ్డాయి. కారు ముందు భాగంలో పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు దిగువ భాగంలో బోనెట్ వంటివి ఉన్నాయి.

స్కోడా కుషాక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, ఆటో-డిమ్మింగ్ హెడ్‌ల్యాంప్స్, యాంబియంట్ క్యాబిన్ లైటింగ్, స్కోడా 6-స్పీకర్ ఆడియో సిస్టమ్‌తో కూడిన సబ్ వూఫర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఎలక్ట్రో-ఆపరేటెడ్ మరియు ఆటో- ఫోల్డ్ ORVM లు ఉన్నాయి.

ఇందులో మల్టిఫుల్ ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐసోఫిక్స్ సీట్లు, ఆటోమేటిక్ హెడ్‌లైట్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు మల్టీ-కొలిక్షన్ బ్రేక్‌లు, ఎబిడి విత్ ఇబిడి వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

స్కోడా కుషాక్ రెండు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది. మొదటి ఇంజిన్ 1.0-లీటర్ మూడు సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, ఇది 115 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ అందుబాటులో ఉంటుంది.
ఇక రెండవ ఇంజిన్ 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్‌తో 7 స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ ఆప్సన్ కలిగి ఉంది.

స్కోడా కుషాక్ కాంపాక్ట్ SUV ధర భారతీయ మార్కెట్లో రూ. 10.50 లక్షల నుండి రూ. 17.60 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంటుంది. ఈ కుషాక్ SUV ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉండి, వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగానే ఎక్కువమంది వాహన కొనుగోలుదారులు ఈ కొత్త స్కోడా కుషాక్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కావున ముందు ముందు ఈ SUV మరింత ఆకర్షణీయమైన అమ్మకాలను నమోదు చేస్తుంది.

స్కోడా (Skoda) దేశీయ మార్కెట్లో కొత్త స్లావియా (Slavia) సెడాన్‌ను విడుదల చేసేందుకు తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ కొత్త స్కోడా స్లావియా (Skoda Slavia) సెడాన్ కోసం భారతీయ మార్కెట్లో ఎంతోమంది వాహన ప్రియులు ఎదురుచూస్తున్నారు. స్కోడా ఆటో ఇండియా తన ట్విట్టర్ ద్వారా అందించిన సమాచారం ప్రకారం, ఈ కొత్త సెడాన్ 2021 నవంబర్ 18 మధ్యాహ్నం 2 గంటలకు వరల్డ్ ప్రీమియర్‌లో పరిచయం చేయబడుతుందని తెలిపింది. ఈ SUV విడుదలైతే కంపెనీ మరింత మంచి ఆదరణ పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.


Click it and Unblock the Notifications








