రూ.20 లక్షల లోపు లభించే బెస్ట్ మిడ్-సైజ్ సెడాన్లు: వెర్నా, సిటీ, ర్యాపిడ్, వెంటో..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో గత కొన్నేళ్లుగా ఎస్‌యూవీలు ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో, సెడాన్ కార్లు దేశీయ విపణిలో అంతగా ప్రాచుర్యం పొందలేదు. అయితే. భారత కార్ మార్కెట్లో సెడాన్ కార్లను ఇష్టపడే వినియోగదారులు కూడా ఉన్నారు. ఈ కథనంలో, భారతదేశంలో రూ.20 లక్షల లోపు లభించే బెస్ట్ మిడ్-సైజ్ సెడాన్ల గురించి తెలుసుకుందాం రండి.

1. హ్యుందాయ్ వెర్నా
కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ నుండి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ సెడాన్లలో వెర్నా కూడా ఒకటి. మార్కెట్లో ఈ సెడాన్ ధరలు రూ.9.19 లక్షల నుండి రూ.15.25 లక్షల మధ్యలో ఉన్నాయి.ఈ కారు 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

2. స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ
చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఆటో నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ మరియు మిడ్-సైజ్ సెడాన్ కారు ఈ ర్యాపిడ్. మార్కెట్లో స్కొడా ర్యాపిడ్ సెడాన్ ధరలు రూ.7.79 లక్షల నుండి రూ.13.29 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి. ఈ కారు 1.0-లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ప్రస్తుతం ఇందులో డీజిల్ ఇంజన్ లేదు. ఇది మొత్తం 6 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

3. కొత్త 2020 హోండా సిటీ
ఈ జాబితాలో మూడవ మోడల్ కొత్త 2020 హోండా సిటీ సెడాన్. మార్కెట్లో ప్రీమియం స్టైల్ మరియు విలాసవంతమైన ఇంటీరియర్స్‌తో లభించే హోండా సిటీ ధరలు రూ.10.99 లక్షల నుండి రూ.14.94 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉంటాయి. ఈ కారును 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో విక్రయిస్తున్నారు.

4. మారుతి సుజుకి సియాజ్
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నుండి లభిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ సెడాన్ 'సియాజ్'. మార్కెట్లో ఈ సెడాన్ ధరలు రూ.8.52 లక్షల నుండి రూ.11.50 లక్షల మధ్యలో ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా తేలికపాటి హైబ్రిడ్ సిస్టమ్‌తో కూడా లభిస్తుంది. కాకపోతే, ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేదు.

5. టొయోటా యారిస్
భారత మార్కెట్లో లభించే బెస్ట్ మిడ్-సైజ్ సెడాన్ కార్లలో టొయోటా యారిస్ కూడా ఒకటి. మార్కెట్లో ఈ కారు ధరలు రూ.9.16 లక్షల నుండి రూ.14.60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఈ కారు కూడా కేవలం ఒకే ఒక ఇంజన్ ఆప్షన్ (1.5-లీటర్ పెట్రోల్)తో మాత్రమే లభిస్తుంది. ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేదు.

6. నాల్గవ తరం హోండా సిటీ
హోండా తమ కొత్త 2020 సిటీ సెడాన్‌ను మార్కెట్లో విడుదల చేసిన తర్వాత కూడా, కంపెనీ పాత (నాల్గవ తరం) సిటీ సెడాన్‌ను విక్రయించడం కొనసాగిస్తోంది. ఈ మోడల్ ఇప్పటికీ చక్కటి డిజైన్‌తో మంచి చవకైన ఆప్షన్‌గా ఉంటుంది. మార్కెట్లో ఈ కారు ధరలు రూ.9.29 లక్షల నుంచి రూ.9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటాయి. ఈ మోడల్ కేవలం 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది.

7. ఫోక్స్‌వ్యాగన్ వెంటో
ఇక ఈ జాబితాలో చివరిది ఫోక్స్‌వ్యాగన్ వెంటో. జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్, భారత మార్కెట్లో ఈ కారును రూ.9.99 లక్షల నుండి రూ.13.83 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రైజ్ ట్యాగ్‌తో విక్రయిస్తోంది. ఈ కారు కేవలం 1.0 లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులో మొత్తం నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications








