Skoda Slavia: డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ & ఫుల్ డీటైల్స్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా దేశీయ మార్కెట్లో కొత్త స్లావియా (Slavia) సెడాన్‌ను విడుదల చేసేందుకు తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ కొత్త స్కోడా స్లావియా (Skoda Slavia) సెడాన్ కోసం భారతీయ మార్కెట్లో ఎంతోమంది వాహన ప్రియులు ఎదురుచూస్తున్నారు. స్కోడా స్లావియా ఇండియా ప్లాన్ 2.0 క్రింద రానున్న బ్రాండ్ యొక్క రెండవ మోడల్.
కంపెనీ యొక్క స్కోడా రాపిడ్ సెడాన్ స్థానంలో ఈ కొత్త స్కోడా స్లావియా రానుంది. కావున ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. స్కోడా స్లావియా కంపెనీ యొక్క MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. అంతే కాకుండా Skoda రాపిడ్ కంటే పెద్దదిగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఈ ఆర్టికల్ లో స్కోడా స్లావియా యొక్క డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ వంటి పూర్తి వివరాలతో పాటు దాని ప్రత్యేకతలను గురించి పూర్తిగా తెలుసుకుందాం.. రండి.

Skoda Slavia డిజైన్:
Skoda Slavia చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఇది కంపెనీ యొక్క లేటెస్ట్ డిజైన్ కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇది లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది. ఇది కంపెనీ యొక్క MQB A0-IN ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది, ఇది విభిన్న బాడీ స్టైల్స్ మరియు ఇంజన్ ఆప్షన్‌లకు అనుగుణంగా ఉంటుంది.

స్కోడా స్లావియా సెడాన్ నాచ్ బ్యాక్ లాంటి స్టైలింగ్‌ను కలిగి ఉంది. ఇది క్రోమ్ సరౌండ్‌తో కూడిన సిగ్నేచర్ బటర్‌ఫ్లై గ్రిల్, LED DRLలతో కూడిన షార్ప్ LED హెడ్‌ల్యాంప్‌లు, స్లోపింగ్ రూఫ్‌లైన్, LED టెయిల్-లైట్లు మరియు డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, స్కోడా స్లావిక్ ఆటోమేటిక్ ల్యాంప్ కార్ వంటి వాటిని పొందుతుంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Skoda Slavia ఇంటీరియర్:
Skoda Slavia యొక్క ఇంటీరియర్ డిజైన్ కూడా కంపెనీ ఇటీవల విడుదల చేసింది. దీనికి సంబంధించిన టీజర్ కూడా అందుబాటులో ఉంది. స్కోడా స్లావియా లోపలి భాగంలో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు దాని వెనుక ఉంచిన డిజిటల్ ఇన్సర్ట్ క్లస్టర్‌తో 2-స్పోక్ మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి.

స్కోడా స్లావియా యొక్క స్టీరింగ్ వీల్ కూడా చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. దీనికి రెండు వైపులా అనేక బటన్లు కూడా ఉన్నాయి. దీనికి మధ్యలో కంపెనీ యొక్క లోగో ఇవ్వబడింది. ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ముందు ఉంచబడింది మరియు దాని వైపున SKODA అక్షరాన్ని చూడవచ్చు.

ఇందులో రౌండ్ ఏసీ వెంట్స్ అందుబాటులో ఉన్నాయి. బయట ఉన్న ORVM లు లోపలి నుండి కూడా కనిపిస్తాయి, డోర్ హ్యాండిల్స్, AC వెంట్స్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గేర్‌బాక్స్‌తో సహా ORVMలతో సహా అనేక ప్రదేశాలలో క్రోమ్ ఇవ్వబడుతుంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంటీరియర్ మొత్తానికి చాలా ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.

Skoda Slavia కొలతలు:
స్కోడా స్లావియా యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది. మొత్తంమీద, ఈ మిడ్ సైజ్ సెడాన్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది మరియు ఇది స్కోడా ర్యాపిడ్ కంటే సైజులో కొంచెం పెద్దదిగా ఉంటుంది, కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

అంతే కాకూండా స్కోడా స్లావియా యొక్క ప్రత్యర్థులైన హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ కంటే పెద్దదిగా ఉంటుంది, మరియు స్లావియా ఇప్పుడు దాని పోటీదారులందరి కంటే పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది, కావున ఎక్కువమంది వినియోగదారులను ఆకర్శించే అవకాశం ఉంటుంది.

Skoda Slavia ఇంజిన్:
Skoda Auto India (స్కోడా ఆటో ఇండియా) తన కొత్త Slavia (స్లావియా) ను రెండు ఇంజన్ ఎంపికలతో అందించే అవకాశం ఉంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టిఎస్ఐ 3 సిలిండర్ కాగా, మరొకటి 1.5-లీటర్ టిఎస్ఐ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.

ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ 3-సిలిండర్ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్‌తో అందించబడుతుంది. ఇక 1.5-లీటర్ ఇంజన్ 148 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

Skoda Slavia ధర:
స్కోడా కంపెనీ కొత్త స్కోడా స్లావియా యొక్క అధికారిక ధరను ఇంకా వెల్లడించలేదు. కానీ ఇది స్కోడా రాపిడ్ కంటే ఎక్కువ ధర ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. దీనికి సంబంధించిన సమాచారం త్వరలో వెల్లడవుతుంది. అప్పుడు స్కోడా స్లావియా ధర కూడా అందుబాటులో ఉంటుంది.

స్కోడా స్లావియా కూడా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది. కావున ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండే అవకాశం ఉంటుంది. ఇవి టాప్-ఎండ్ వేరియంట్‌లకు పరిమితం కావచ్చు. గ్లోబల్ ఎన్‌సిఎపి ప్రమాణాలకు ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంటుంది. మొత్తానికి కొత్త స్కోడా స్లావియా సురక్షితమైన సెడాన్‌లలో ఒకటిగా నిలుస్తుంది అని భావిస్తున్నాము.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త Skoda Slavia కంపెనీకి మరో ముఖ్యమైన మోడల్ కానుంది. కంపెనీ యొక్క కుషాక్ భారతీయ మార్కెట్లో ఆశించిన విజయాన్ని పొందింది. కావున కంపెనీ ఈ కొత్త మోడల్‌తో మరింత మంచి అమ్మకాలను పొందటానికి ఉపయోగిస్తుంది. రాబోయే రోజుల్లో కంపెనీ దీనిని ఆవిష్కరించిన తరువాత బుకింగ్‌లు ప్రారంభిస్తుంది. మొత్తానికి ఈ సెడాన్ 2022 జనవరిలో భారతీయ రోడ్లపై చూసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నాము. ఈ కొత్త సెడాన్ దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత ఎలాంటి ఆధరణ పొందుతుందో తెలుసుకోవడానికి, కొంత సమయం వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








