Maruti Suzuki బాటలోనే Volkswagen: సెప్టెంబర్ నెలలో కార్ల ధరల పెంపు
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ Maruti Suzuki బాటలోనే, జర్మన్ కార్ బ్రాండ్ Volkswagen కూడా ఈ నెలలో తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కంపెనీ అందిస్తున్న Polo హ్యాచ్‌బ్యాక్ మరియు Vento సెడాన్ కార్లను ధరలను కంపెనీ పెంచింది.

కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్ ను బట్టి ధరల పెంపు వేర్వేరుగా ఉంటుంది. కాగా, Polo హ్యాచ్‌బ్యాక్ ధరలను మూడు శాతం మరియు Vento సెడాన్ ధరలను రెండు శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. కాగా, Polo GT వేరియంట్ ధరలలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని Volkswagen India తెలిపింది.

ప్రస్తుతం మార్కెట్లో Volkswagen Polo హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ. 6.17 లక్షలు కాగా, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 9.75 లక్షలుగా ఉంది. అలాగే, Volkswagen Vento సెడాన్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు కాగా, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 14.10 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

Volkswagen India చివరిగా జనవరి 2021 లో ఈ రెండు మోడళ్ల ధరలను పెంచింది. కాగా, తాజా ధరల పెరుగుదలకు గల కారణాన్ని కంపెనీ ఇంకా వెల్లడించకపోయినప్పటికీ, ఇతర ఆటోమొబైల్ కంపెనీల మాదిరిగానే పెరుగుతున్న ముడి సరుకుల ధరలు మరియు ఇన్‌పుట్ వ్యయం కారణంగా కంపెనీ తమ కార్ల ధరలను కూడా పెంచినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, గత నెలలో ఈ రెండు కార్లను బుక్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆగష్టు 31, 2021 నాటికి Volkswagen Vento లేదా Polo కార్లను బుక్ చేసుకున్న కస్టమర్‌లకు ఈ ధరల పెంపు వర్తించదని కంపెనీ తెలిపింది. పెరిగిన ధరలు సెప్టెంబర్ 1, 2021వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి.

భారతదేశంలోని అత్యుత్తమ హ్యాచ్‌బ్యాక్ లలో Volkswagen Polo ఒకటిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే దీని శక్తివంతమైన ఇంజన్ మరియు అసాధారణమైన డ్రైవింగ్ డైనమిక్స్ కారణంగా, ఇది ఈ విభాగంలో కెల్లా ఉత్తమమైనదిగా ఉంటుంది. ఈ కారు మొత్తం ఐదు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి: ట్రెండ్‌లైన్, కంఫర్ట్ లైన్, హైలైన్ ప్లస్ మరియు జిటి. ఇందులో కంఫర్ట్ లైన్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, Volkswagen Polo హ్యాచ్‌బ్యాక్ మరియు Volkswagen Vento సెడాన్ రెండూ కూడా ఒకే రకమైన ఇంజన్లను కలిగి ఉంటాయి. కాకపోతే, Polo 1.0 లీటర్ న్యాచురల్ పెట్రోల్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్లతో లభిస్తుంది. కాగా, Vento కేవలం 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే లభిస్తుంది.

ఇందులో మొదటిది 1.0 లీటర్ టిఎస్ఐ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 109 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇకపోతే, రెండవది 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 74 బిహెచ్‌పి శక్తిని మరియు 95 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి.

గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికి వస్తే, న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ కేవలం 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తుంది. కాగా, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

ఈ కార్లలో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, 6.5 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసి వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్ విత్ ఈబిడి మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి ఉన్నాయి.

సెప్టెంబర్ 24న Volkswagen Taigun ఎస్‌యూవీ ఇండియా లాంచ్!
ఇదిలా ఉంటే, Volkswagen బ్రాండ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త ఎస్‌యూవీ ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun)ను కంపెనీ ఈనెల 24 న (సెప్టెంబర్ 24, 2021 తేదీన) భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. కంపెనీ ఇప్పటికే ఈ మోడల్ కోసం ప్రీ-బుకింగ్‌లను కూడా ప్రారంభించింది.

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో మిడ్-సైజ్ విభాగంలో ఇప్పటికే ఆదిపత్యం చలాయిస్తున్న Hyundai Creta తో పాటుగా ఇతర పాపులర్ మోడళ్లు అయిన Kia Seltos, Tata Harrier, MG Hector మరియు తాజాగా వచ్చిన Skoda Kushaq వంటి మోడళ్లతో Volkswagen Taigun పోటీ పడుతుంది.

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ Skoda ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన తమ కొత్త Kushaq ప్లాట్‌ఫామ్ ఆధారంగానే ఈ కొత్త Volkswagen Taigun ఎస్‌యూవీని కూడా తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, రెండు కార్లలో ఒకేరకమైన ఇంజన్స్ మరియు ఫీచర్లను మనం ఆశించవచ్చు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








