కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 వస్తోంది.. ఎర్టిగా మాదిరిగానే రిఫ్రెష్డ్ ఫీచర్లు, కొత్త గేర్‌బాక్స్‌తో..
ఇటీవలే కొత్త అప్‌డెటెడ్ 2022 మోడల్ ఎర్టిగా (Ertiga) ఎమ్‌పివిని మార్కెట్లో విడుదల చేసిన మారుతి సుజుకి, ఇప్పుడు తమ ఎక్స్ఎల్6 (XL6) ప్రీమియం ఎమ్‌పివిని అప్‌డేట్ చేసేందుకు సిద్ధమైంది. కంపెనీ ఇందుకు సంబంధించి ఓ టీజర్ వీడియోని కూడా విడుదల చేసింది. ఈ టీజర్ వీడియోలో కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (2022 Maruti Suzuki XL6) సరికొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానున్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త అప్‌డేటెడ్ మారుతి ఎక్స్ఎల్6 త్వరలోనే మార్కెట్లో విడుదల కానుంది.

కొత్త ఎర్టిగాలో అందించిన కొన్ని ఫీచర్లను ఈ కొత్త 2022 ఎక్స్ఎల్6 కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం, ఈ నెలాఖరు నాటికి కొత్త మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లో విడుదల అవుతుందని భావిస్తున్నారు. మారుతి సుజుకి విడుదల చేసిన 15-సెకన్ల టీజర్ వీడియోలో కొత్త ఎక్స్ఎల్6 తో పాటుగా బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ కూడా కనిపిస్తాడు. ఈ టీజర్‌ను బట్టి చూస్తుంటే, కొత్త ఎర్టిగా మాదిరిగానే ఈ కొత్త ఎక్స్ఎల్6 లో కూడా చిన్నపాటి డిజైన్ మార్పులే ఉన్నట్లు తెలుస్తోంది.

మారుతి సుజుకి తమ ఎర్టిగాలో కొత్త గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్ మినహా వేరే ఏ ఇతర మార్పులు ఎక్స్టీరియర్‌లో చేయలేదు. ఈ నేపథ్యంలో, కొత్తగా రాబోయే ఎక్స్ఎల్6 కూడా ఇదే రకమైన ఎక్స్టీరియర్ మార్పులను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇంటీరియర్‌లో కూడా మారుతి సుజుకి ఎర్టిగాలో కంపెనీ పెద్ద మార్పులేమీ చేయలేదు. అయితే, ఈ 2022 మోడల్ మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలో కొత్త ఇంటీరియర్ కలర్ స్కీమ్‌లు మరియు మరింత ప్రీమియం-ఫీలింగ్‌నిచ్చే అప్‌హెలెస్ట్రీని ఆఫర్ చేసే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఎర్టిగా యొక్క కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో కంపెనీ 7 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ను ఆఫర్ చేసిన సంగతి తెలిసినదే. అయితే, ఈ అప్‌డేటెడ్ మారుతి సుజుకి ఎక్స్ఎల్6 కారులో కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో కారులో అందించిన ప్రీమియం 9.0 ఇంచ్ స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించవచ్చని తెలుస్తోంది. ఈ కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ Apple CarPlay మరియు Android Auto కనెక్టివిటీని కలిగి ఉంటుంది.

అలాగే అప్‌డేటెడ్ మారుతి ఎక్స్ఎల్6 కారులో ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, మూడు వరుసలలో ఏసి వెంట్స్, రూఫ్ రెయిల్స్, మధ్యవరుస ప్రయాణీకుల కోసం వన్-టచ్ రిక్లైన్ కెప్టెన్ సీట్లు, 360-డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా వంటి మరెన్నో ఇతర ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. సేఫ్టీ విషయానికి వస్తే, మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలో 6-ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందించే అవకాశం ఉంది. అలాగే, ఇందులో లేన్-కీపింగ్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ డిటెక్షన్ మరియు పార్కింగ్ అసిస్ట్ వంటి మరికొన్ని అదనపు సేఫ్టీ ఫీచర్లను కూడా అందించవచ్చని తెలుస్తోంది.

కొత్త 2022 ఎర్టిగాలో మొత్తం లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, ప్యాడిల్ షిఫ్టర్‌లు (ఆటోమేటిక్ వేరియంట్‌లో), ఆన్‌బోర్డ్ వాయిస్ అసిస్టెంట్, సుజుకి కనెక్ట్, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, సీట్ బ్యాక్ రిక్లైనర్ మరియు ఫ్లాట్ ఫోల్డ్ ఆప్షన్‌తో కూడిన 50:50 స్ప్లిట్ థర్డ్ రో సీట్స్, క్రూయిజ్ కంట్రోల్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. అలాగే, ఇందులో యాంటీ-పించ్ ఫీచర్‌తో కూడిన డ్రైవర్ సైడ్ ఆటో-విండో, ఫాలో మీ హోమ్ ఫంక్షనాలిటీతో కూడిన ఆటో హెడ్‌ల్యాంప్‌లు, రిట్రాక్టబుల్ కీ-ఆపరేటెడ్ సైడ్ మిర్రర్స్ మరియు S-CNG వేరియంట్‌లలో సిఎన్‌జి నిర్దిష్ట స్పీడోమీటర్ వంటి ఫీచర్లను కంపెనీ పరిచయం చేసింది.

ఎర్టిగా కోసం కంపెనీ రెండు కొత్త కలర్ ఆప్షన్లను కూడా ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి తమ ఎక్స్ఎల్6 ఎమ్‌పివి విషయంలో కూడా కొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేయవచ్చని భావిస్తున్నారు. అలాగే, కంపెనీ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్‌లో కూడా చిన్నపాటి అప్‌గ్రేడ్స్ ఏమైనా చేసే అవకాశం ఉంది. ఎర్టిగా ఇంటీరియర్‌లో అందించిన మార్పులలో కొన్నింటిని ఈ కొత్త ఎక్స్ఎల్6 లో కూడా ఆశించవచ్చు.

ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, మారుతి సుజుకి ఎర్టిగాలో ఉపయోగించిన అదే అప్‌డేటెడ్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఈ కొత్త 2022 ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలో కూడా ఉపయోగించనున్నారు. కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ కొత్త 1.5-లీటర్ డ్యూయల్ వివిటి పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన ఈ ఇంజన్ గరిష్టంగా 105 పిఎస్ పవర్‌ను మరియు 138 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
కాగా, కంపెనీ ఇందులో మునుపటి 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానంలో కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను పరిచయం చేయనుంది. ఎర్టిగా మైలేజ్ గణాంకాలను గమనిస్తే, ఇందులోని పెట్రోల్ వెర్షన్ లీటరుకు 20.51 కిమీ మైలేజీనిస్తుండగా, సిఎన్‌జి వెర్షన్ కేజీకి 26.11 కిమీ మైలేజీనిస్తుందని సర్టిఫై చేయబడింది. కాగా, మారుతి ఎక్స్ఎల్6 కారులో సిఎన్‌జి వెర్షన్ ఉండదు కాబట్టి ఇందులోని మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లు రెండూ కూడా లీటరు 20 కిమీ పైగా మైలేజీని అందిస్తాయని అంచనా.

ధర విషయానికి వస్తే, మారుతి సుజుకి తమ కొత్త 2022 మోడల్ ఎర్టిగా ఎమ్‌పివిని రూ. 8.35 లక్షల నుండి రూ. 12.79 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) రేంజ్‌లో విడుదల చేసింది. కాబట్టి, మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ప్రీమియం ఎమ్‌పివి కావడంతో దీని ధర సుమారు రూ.10 లక్షల నుండి ప్రారంభం కావచ్చని అంచనా. ఇది ఈ విభాగంలో ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన కియా కారెన్స్ ఎమ్‌పివితో పోటీపడే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








