ఏసిలు, ఫ్రిడ్జ్‌ల మాదిరిగానే భారతదేశంలో విక్రయించే కార్లకు కూడా (సేఫ్టీ) స్టార్ రేటింగ్ తప్పనిసరి!
భారతదేశంలో విక్రయించే ఎలక్ట్రానిక్ గృహోపకరణాలపై 1 నుంచి 5 వరకూ నక్షత్రాలతో రేట్ చేయబడి స్టార్ రేటింగ్స్ ఉంటాయి. ఇవి ఆయా గృహోపకరణాలు వినియోగించే సగటు వార్షిక విద్యుత్ వినియోగాన్ని సూచిస్తాయి. ఇదే తరహాలో ఇప్పుడు భారతదేశంలో విక్రయించబడే అన్ని కార్లు కూడా సేఫ్టీ స్టార్ రేటింగ్‌ను కలిగి ఉండేలా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒకప్పుడు భారతదేశంలోని కార్ కొనుగోలుదారులు బడ్జెట్ ధర మరియు అధిక మైలేజీకి మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు.

అయితే, ఇప్పుడు ట్రెండ్ మారిది. కస్టమర్లు తాము కొనుగోలు చేయబోయే కారు విషయంలో ఇప్పటికీ ఎంతో కొంత మైలేజీకి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, సదరు కారు యొక్క సేఫ్టీ విషయానికే వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త కారు కొనుగోలు విషయంలో వినియోగదారులు ఇప్పుడు తమ నిర్ణయం తీసుకునే ముందు వాటి క్రాష్ టెస్ట్ రేటింగ్‌లను చురుకుగా పరిశీలిస్తున్నారు. దురదృష్టవశాత్తు, భారతదేశంలో ఇప్పటికీ కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు సురక్షితమైన కార్లను ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా లేవు. తయారీ ఖర్చులను తగ్గించేందుకు, పోటీతత్వ మార్కెట్లో కొనసాగేందుకు కార్ల కంపెనీలు నాసిరకం వాహనాలను తయారు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, భారతదేశంలో తయారయ్యే మరియు విక్రయించబడే కొత్త కార్లన్నింటికీ సేఫ్టీ రేటింగ్‌లను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కొత్త నిబంధనతో, కార్ల తయారీదారులు భారతదేశంలో తమ వాహనాల ఉత్పత్తిని ప్రారంభించే ముందు తప్పనిసరిగా సదరు వాహనానికి క్రాష్ టెస్టింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దేశంలో దాదాపు ఏటా అర మిలియన్‌కు పైగా ప్రమాదాలు జరుగుతున్నాయని, అందులో 1.5 లక్షలకు పైగా ప్రమాదాలు ప్రాణాంతకంగా మారుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అందరూ స్వాగతించే చర్యగా కనిపిస్తోంది.

కొత్త కార్ల నాణ్యతను మరియు మరియు ప్రమాద సమయాల్లో అవి ప్రయాణీకులకు అందించే భద్రతను పరీక్షించేందుకు ఇప్పటికే ఏషియన్ ఎన్‌సిఏపి (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్), యూరో ఎన్‌సిఏపి మరియు గ్లోబల్ ఎన్‌సిఏపి వంటి ఏజెన్సీలు ఉన్నాయి. ఇదే తరహాలో మనదేశంలో కూడా భారత్ ఎన్‌సిఏపి (Bharat NCAP) క్రాష్ టెస్ట్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే, భారతదేశంలో తయారయ్యే అన్ని కార్లకు తప్పనిసరిగా ఈ సేఫ్టీ రేటింగ్ ఉండాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

భారత్ ఎన్‌సిఏపి కి సంబంధించి, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవలే క్రాష్ టెస్టింగ్ ఏజెన్సీ కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను ఆమోదించింది. ఇది OEMలు (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యాన్యుఫాక్చరర్స్) తయారు చేసే తమ వాహనాలను దేశం యొక్క స్వంత అంతర్గత పరీక్షా సౌకర్యాలలో పరీక్షించడానికి అనుమతిస్తుంది. ప్రస్తుతం, భారతదేశంలో, క్రాష్ టెస్టింగ్ స్వచ్ఛందంగా నిర్వహించబడుతుంది. మనదేశంలో వాహన తయారీదారులు తయారు చేసే వాహనాలకు గ్లోబల్ ఎన్‌సిఏపి ఏజెన్సీ ద్వారా క్రాష్ టెస్ట్ నిర్వహిస్తారు. అలా వచ్చిన సేఫ్టీ రేటింగ్ లనే ప్రమోట్ చేస్తారు.

ఇలా గ్లోబల్-ఎన్‌సిఏపిలో ఖచ్చితమైన 5-స్టార్ రేటింగ్‌ను సాధించిన మొదటి భారతీయ వాహనం టాటా నెక్సాన్. ఆ తర్వాతి కాలంలో దేశంలోని తయారీదారులు సురక్షితమైన వాహనాలను తయారు చేయడం ప్రారంభించారు. గ్లోబల్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న ఇతర వాహనాలలో టాటా పంచ్, మహీంద్రా ఎక్స్‌యూవీ300, టాటా ఆల్ట్రోజ్, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ700 మొదలైనవి ఉన్నాయి. అయితే, కొత్తగా భారత్ ఎన్‌సిఏపి ఏజెన్సీని మనదేశంలోనే ప్రారంభించినట్లయితే, ఇకపై ఇక్కడ తయారైన వాహనాలను ఇక్కడే స్థానికంగా పరీక్షించవచ్చు.

భారతదేశంలో భారత్ ఎన్‌సిఏపి పరిచయంతో, మన దేశం దాని స్వంత అంతర్గత అత్యాధునిక క్రాష్ టెస్టింగ్ సదుపాయాన్ని కలిగి ఉంటుంది. ఇది యూఎస్ ఎన్‌సిఏపి, యూరో ఎన్‌సిఏపి, జపాన్ ఎన్‌సిఏపి, ఏషియన్ ఎన్‌సిఏపి, చైనా ఎన్‌సిఏపి, కొరియన్ ఎన్‌సిఏపి, లాటిన్ ఎన్‌సిఏపి మరియు గ్లోబల్ ఎన్‌సిఏపి వంటి ఇతర పరీక్షా సౌకర్యాలతో ఇది సమానంగా ఉంటుంది. ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చినట్లయితే, ఇకపై భవిష్యత్తులో తయారుదారులు తయారు చేసే అన్ని కార్లు మరింత సురక్షితంగా మరియు నాణ్యమైనవిగా మారే అవకాశం ఉంది.

ఇది దేశంలోని భద్రతా ప్రమాణాల కవచాన్ని ముందుకు తీసుకురావడంలో భారతీయ కార్ల తయారీదారులను ప్రోత్సహించడమే కాకుండా, కార్లలో భద్రతా ప్రమాణాల ప్రాముఖ్యత గురించి వినియోగదారులలో అవగాహనను కూడా మెరుగుపరుస్తుంది. న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (NCAP) ఆటోమొబైల్స్ భద్రతను మెరుగుపరచడానికి లక్ష్యంగా పెట్టుకుంది. దానితో పాటుగా, కొత్త కారు యొక్క క్రాష్‌వర్థీనెస్ గురించి దాని వినియోగదారులకు తెలియజేయాలనే లక్ష్యంతో రూపొందించబడింది.

గగడచిన 2020 నుండి రికార్డులను పరిశీలిస్తే, భారతదేశంలో మొత్తం 3.54 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి మరియు ఈ ప్రమాదాల వల్ల 1.33 లక్షల మందికి పైగా మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అలాగే, ఈ రోడ్డు ప్రమాదాల్లో 3.35 లక్షల మందికి పైగా గాయపడ్డారు. భారత్ ఎన్‌సిఏపి (Bharat NCAP) ని ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం ఈ సంఖ్యలను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది.


Click it and Unblock the Notifications