ఫోక్స్‌వ్యాగన్ ఐడి.బజ్ (Volkswagen ID.Buzz) ఎలక్ట్రిక్ మినీ వ్యాన్ ఆవిష్కరణ.. త్వరలో విడుదల!
జర్మన్ కార్ బ్రాండ్ 'ఫోక్స్‌వ్యాగన్' (Volkswagen) 1950 కాలంలో విక్రయించిన ఐకానిక్ మినీ వ్యాన్ 'కోంబి' (Kombi) ఆ సమయంలో అత్యంత ప్రజాదరణ పొందిన పాపులర్ వాహనాలలో ఒకటిగా ఉండేది. మినీ బస్ గా, పెద్ద ఫ్యామిలీ కారుగా ప్రాచుర్యం పొందిన ఈ వాహనాన్ని కంపెనీ ఇప్పుడు ఆధునిక రూపంతో, ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో మార్కెట్లో అందుబాటులోకి తీసుకురాబోతోంది. తాజాగా, ఇప్పుడు కంపెనీ ఈ మినీ వ్యాన్ ను 'ఫోక్స్‌వ్యాగన్ ఐడి.బజ్' (Volkswagen ID.Buzz) పేరుతో ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ గా ఆవిష్కరించింది.

ఫోక్స్‌వ్యాగన్ ఐడి.బజ్ ఎలక్ట్రిక్ మైక్రోబస్ మొదటి చూపులోనే ఇది యాభైలు మరియు అరవైల కాలంలో మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించిన కోంబి మినీ వ్యాన్ వాహనం నుండి ప్రేరణ పొంది తయారైన ఎలక్ట్రిక్ వ్యాన్ అని చెప్పకనే తెలిసిపోతుంది. ఫోక్స్‌వ్యాగన్ తమ ఐడి బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తుంది. ఇప్పుడు ఈ బ్రాండ్ చరిత్రలో మిగిలిపోయిన ఐకానిక్ కోంబి మినీ వ్యాన్ కు ఆధునిక రూపాన్ని అందించింది.

ఈ ఆల్-ఎలక్ట్రిక్ మినీ వ్యాన్ ఓ చక్కటి ఫ్యామిలీ కార్ గా, బిజినెస్ వెహికల్ గా మరియు టాక్సీ వాహనంగా వివిధ అవసరాల కోసం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం, కాన్సెప్ట్ గా పరిచయమైన కొత్త 2022 Volkswagen ID.Buzz ఈ సంవత్సరం చివరి నాటికి యూరోపియన్ మార్కెట్లలో మరియు మరో ఏడాది నాటికి అమెరికన్ మార్కెట్లో విడుదల కావచ్చని భావిస్తున్నారు. ఫోక్స్‌వ్యాగన్ తమ ఐడి బజ్ ఎలక్ట్రిక్ మినీ బస్ యొక్క రెండు వెర్షన్ లను ఆవిష్కరించింది.

ఈ రెండింటిలో ఒకటి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఉద్దేశించబడింది కాగా, మరొకటి వాణిజ్య ప్రయోజనాల కోసం కార్గోను తరలించడానికి వీలుగా రూపొందించబడింది. కొత్త 2022 ఫోక్స్‌వ్యాగన్ ఐడి బజ్ మాడ్యులర్ ఎలక్ట్రిక్ డ్రైవ్ కిట్ (MEB) ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి తయారు కానుంది. ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ నుండి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లను రూపొందించే ఆధునిక ప్లాట్‌ఫారమ్ కూడా ఇదే కావడం విశేషం. ప్రస్తుతం కంపెనీ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో 30 శాతం MEB ప్లాట్‌ఫామ్ ఆధారంగానే నిర్మితమవుతున్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ ఇప్పటికే తయారు చేసిన ఐడి.3, ఐడి.4 మరియు కొత్తగా ప్రవేశపెట్టిన ఐడి.5 ఎలక్ట్రిక్ వాహనాల తర్వాత, ఇది (ఐడి.బజ్) Volkswagen యొక్క నాల్గవ డెడికేటెడ్ ఎలక్ట్రిక్ మోడల్ కానుంది. ఫోక్స్‌వ్యాగన్ 2025 నాటికి 80 శాతం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా ప్యాసింజర్ కార్స్ బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఛైర్మన్ రాల్ఫ్ బ్రాండ్‌స్టాటర్ మాట్లాడుతూ.. కొత్త ఐడి.బజ్ మైక్రోబస్ ఫోక్స్‌వ్యాగన్ మాత్రమే రూపొందించగల మోడల్ అని చెప్పారు.

అప్పటి మినీ వ్యాన్ తో పోల్చుకుంటే, ఫోక్స్‌వ్యాగన్ రూపొందించిన ఈ అధునాతన ఐడి.బజ్ మైక్రోబస్ పూర్తిగా ఉద్గార రహితమైనది, స్థిరమైనది మరియు పూర్తిగా నెట్‌వర్క్ చేయబడింది. అదనంగా, ఈ ఎలక్ట్రిక్ వాహనం అటానమస్ డ్రైవింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుందని సమాచారం. అంటే, టెస్లా కార్ల మాదిరిగా వీటిని డ్రైవర్ ప్రమేయం లేకుండా ఆపరేట్ చేసే సౌలభ్యం ఉంటుంది. కంపెనీ ఈ అటానమస్ టెక్నాలజీని యూఎస్ స్టార్టప్ అర్గో ఏఐ సహకారంతో అభివృద్ధి చేసింది.

ఆర్గో అభివృద్ధి చేసిన అటానమస్ టెక్నాలజీని ఎనేబుల్ చేయడానికి ఈ వాహనంలో కెమెరాలు, లైడార్ మరియు రాడార్ సెన్సార్‌లు వంటి ఆధునిక సాంకేతికలు మరియు పరికరాలు ఉన్నాయి. పవర్‌ట్రైన్ విషయానికి వస్తే, ఫోక్స్‌వ్యాగన్ ఐడి.బస్ లో 82 kWh బ్యాటరీ ప్యాక్ మరియు 201 బిహెచ్‌పి శక్తిని జనరేట్ చేసే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటాయి. సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ వాహనం గరిష్టంగా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

ఐడి.బజ్ లో ఐదుగురు ప్రయాణీకులు సౌకర్యవంతంగా ప్రయాణించగలిగే ప్యాసింజర్ వెర్షన్ మొదటగా మార్కెట్లోకి వస్తుందని ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది. ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని కేవలం 30 నిమిషాల్లోనే 5 శాతం నుండి 80 శాతానికి ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఐరోపాలో, ద్వి దిశాత్మక (బై-డైరెక్షనల్) ఛార్జింగ్ అవసరమైనప్పుడు ఈ వాహనం అక్కడి గృహాలకు కూడా శక్తినిస్తుంది. అంటే, ఇదొక మినీ హౌస్ పవర్ బ్యాంక్ మాదిరిగా పనిచేస్తుందన్నమాట.

ఫోక్స్‌వ్యాగన్ ఐడి.బజ్ మైక్రోబస్ యొక్క యూఎస్ వెర్షన్ పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఆరుగురు ప్రయాణికుల వరకూ కూర్చోవచ్చు. ఈ వాహనంలో దాని బ్యాటరీ ప్యాక్ ఫ్లోర్ దిగువ బాగంలో అమర్చబడి (టెస్లా మాదిరిగా) ఉంటుంది. ఇది విశాలమైన క్యాబిన్ స్థలాన్ని కలిగి ఉంటుంది. ఇక భద్రత విషయానికి వస్తే, ప్రస్తుత ఆధునిక అవసరాలకు అనుగుణమైన అన్ని నాణ్యతా మరియు భద్రతా ప్రమాణాలతో ఇది మార్కెట్లోకి రానుంది.

ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఈ ఎలక్ట్రిక్ వ్యాన్ డిజైన్ 1950ల నాటి ఫోక్స్‌వ్యాగన్ బస్ టి1 మోడల్ నుండి ప్రేరణ పొంది రూపొందించబడింది. ఇందులో ఆధునిక ఎల్ఈడి హెడ్‌లైట్‌లు, షార్ట్ ఫ్రంట్ ఓవర్‌హాంగ్‌లు మరియు ఐకానిక్ V-ఆకారపు ఫ్రంట్ ప్యానెల్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ముందు వైపు బంపర్ పిక్సెలేషన్ ప్రభావాన్ని సృష్టించే ప్రత్యేకమైన డైమండ్ ప్యాటర్న్ తో దాని గ్రిల్ రూపొందించబడింది. ఇక వెనుక వైపు భాగం బాక్సీ షేప్ లో ఉండి, సన్నటి స్మోకీ ఎల్ఈడి టెయిల్‌లైట్‌లను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








