ఏప్రిల్ 2022 నెలలో హోండా కార్లపై ఆఫర్లు.. ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందంటే..?
జపనీస్ కార్ బ్రాండ్ హోండా, గడచిన మార్చి 2022 నెల అమ్మకాలలో తగ్గుదలను నమోదు చేయడంతో, ఏప్రిల్ 2022 నెలలో అమ్మకాలను పెంచుకునేందుకు తమ కార్లపై డిస్కౌంట్లను మరియు వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. హోండా కార్స్ ఇండియా తమ మొత్తం ప్రోడక్ట్ లైనప్‌పై ఈ ఏప్రిల్ నెలలో ఆకర్షణీయమైన తగ్గింపులు మరియు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో జాజ్, అమేజ్, డబ్ల్యూఆర్-వి, 4వ తరం సిటీ మరియు 5వ తరం సిటీ సెడాన్ కార్లు ఉన్నాయి.

ఈ నెలలో (ఏప్రిల్ 2022లో) హోండా కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు గరిష్టంగా రూ. 33,158 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్‌లలో నగదు తగ్గింపులు (క్యాష్ డిస్కౌంట్స్), మార్పిడి ప్రయోజనాలు (ఎక్సేంజ్ బోనస్) మరియు కార్పోరేట్ తగ్గింపులు ఉన్నాయి. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30, 2022 మధ్య జరిగే అన్ని కొనుగోళ్లపై ఈ ఆఫర్‌లు మరియు తగ్గింపులు చెల్లుబాటు అవుతాయని కంపెనీ తెలిపింది. వివిధ మోడళ్ల వారీగా హోండా కార్స్ ఇండియా అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

హోండా జాజ్ (Honda Jazz)
హోండా అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్ పై కంపెనీ ఈ నెలలో గరిష్ట ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఏప్రిల్ 2022 నెలలో హోండా జాజ్ కారును కొనుగోలు చేసే కస్టమర్లు గరిష్టంగా రూ. 33,158 వరకు నగదు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 10,000 వరకు నగదు బోనస్ లేదా రూ. 12,158 వరకు యాక్సెసరీలను ృఎంచుకోవచ్చు. అదనంగా, కస్టమర్లు రూ. 12,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 లాయల్టీ బోనస్ మరియు రూ. 4,000 కార్పొరేట్ బోనస్ వంటి ఇతర ఆఫర్‌లను కూడా పొందవచ్చు.

హోండా జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలో హోండా ఫిట్ పేరుతో విక్రయిస్తోంది. మనదేశంలో ఇది కేవలం ఒకే ఒక పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తోంది. ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ20, టొయోటా గ్లాంజా వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లతో పోటీ పడుతుంది. మార్కెట్లో హోండా జాజ్ ధరలు రూ. 7.77 లక్షల నుండి రూ. 10.08 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

హోండా అమేజ్ (Honda Amaze)
మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఔరా వంటి మోడళ్లకు పోటీగా హోండా అందిస్తున్న కాంపాక్ట్ సెడాన్ అమేజ్. ఏప్రిల్ 2022 నెలలో కస్టమర్లు ఈ కారు కొనుగోలుపై గరిష్టంగా రూ. 15,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. హోండా అమేజ్ కారుపై కంపెనీ రూ. 5,000 లాయల్టీ బోనస్, రూ. 6,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 4,000 కార్పొరేట్ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ ఆఫర్ హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ యొక్క అన్ని వేరియంట్లపై అందుబాటులో ఉంటాయి.

భారత మార్కెట్లో హోండా అమేజ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇది హోండా నుండి లభిస్తున్న అత్యంత సరసమైన సెడాన్. హోండా సిటీ కారు యొక్క ప్రీమియం ధరను భరించలేని కస్టమర్లు అమేజ్ ను ఎంచుకోవచ్చు. మార్కెట్లో హోండా అమేజ్ యొక్క పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ. 6.43 లక్షల నుండి రూ. 9.16 లక్షల మధ్యలో ఉండగా, అమేజ్ డీజిల్ వేరియంట్ల ధరలు రూ. 8.78 లక్షల నుండి రూ. 11.26 లక్షల మధ్య ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

హోండా డబ్ల్యూఆర్-వి (Honda WR-V)
హోండా అందిస్తున్న ఏకైక యుటిలిటీ వెహికల్ హోండా డబ్ల్యూఆర్-విపై కంపెనీ ఈ నెలలో గరిష్టంగా రూ.26,000 వరకూ ప్రయోజనాలను అందిస్తోంది. అయితే, ఇవి కేవలం పెట్రోల్ వేరియంట్లపై మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇందులో రూ. 17,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 లాయల్టీ బోనస్ మరియు రూ. 4,000 కార్పొరేట్ డిస్కౌంట్ లు కలిసి ఉంటాయి. కాగా, హోండా డబ్ల్యూఆర్-వి యొక్క డీజిల్ వేరియంట్‌లపై మాత్రం ఎలాంటి ఆఫర్లు అందుబాటులో లేవు. మార్కెట్లో హోండా డబ్ల్యూఆర్-వి ధరలు రూ. 8.88 లక్షల నుండి రూ. 12.07 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

4వ తరం హోండా సిటీ (4th Generation Honda City)
హోండా కార్స్ ఇండియా గతేడాది తమ కొత్త (5వ) తరం హోండా సిటీ సెడాన్ ను మార్కెట్లో విడుదల చేసినప్పటికీ, దానితో పాటుగా కంపెనీ దాని మునుపటి (4వ) తరం హోండా సిటీ సెడాన్ ను కూడా మార్కెట్లో విక్రయించడాన్ని కొనసాగిస్తోంది. ఈ ఏప్రిల్ నెలలో హోండా తమ 4వ తరం సిటీ సెడాన్ పై రూ. 7,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 5,000 లాయల్టీ బోనస్ మరియు రూ. 8,000 కార్పొరేట్ తగ్గింపుతో సహా రూ. 20,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ మోడల్ కేవలం రెండు వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. అవి: SV మరియు V, మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ. 9.29 లక్షలు మరియు రూ. 9.99 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉన్నాయి.

5వ తరం హోండా సిటీ (5th Generation Honda City)
ప్రస్తుతం, భారత మార్కెట్లో హోండా యొక్క ఫ్లాగ్‌షిప్ సెడాన్ అయిన 5వ తరం సిటీ పై కంపెనీ ఈ ఏప్రిల్ నెలలో గరిష్టంగా రూ. 30,396 వరకు ప్రయోజనాలను అందిస్తోంది.ఇందులో కస్టమర్‌లకు రూ. 5,000 వరకు నగదు బోనస్ లేదా రూ. 5,396 వరకు యాక్సెసరీలు అందించబడతాయి. వీటికి అదనంగా, కస్టమర్లు రూ. 12,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 లాయల్టీ బోనస్ మరియు రూ. 8,000 కార్పొరేట్ బోనస్ వంటి ఇతర ఆఫర్‌లను కూడా పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఈ కొత్త తరం హోండా సిటీ సెడాన్ ధరలు రూ. 11.28 లక్షల నుండి రూ. 15.23 లక్షల మధ్యలో (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంటాయి.


Click it and Unblock the Notifications








