భారతీయ మార్కెట్లో విడుదలైన 2022 Audi A8 L: పూర్తి వివరాలు
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'ఆడి' (Audi) భారతీయ మార్కెట్లో తన కొత్త '2022 ఆడి ఏ8 ఎల్' (2022 Audi A8 L) విడుదల చేసింది. ఇది 'సెలబ్రేషన్' మరియు 'టెక్నాలజీ' అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 1.29 కోట్లు (సెలబ్రేషన్ ఎడిషన్) మరియు రూ. 1.57 కోట్లు (టెక్నాలజీ) (ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త లగ్జరీ సెడాన్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్లో విదలైన ఈ సెడాన్ యొక్క బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి, కావున కొనుగోలుచేయాలనుకునే కస్టమర్లు ఆడి ఏ8 ఎల్ ఫేస్‌లిఫ్ట్ కోసం కంపెనీ డీలర్‌షిప్‌లలో లేదా బ్రాండ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 10 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇది సిబియు మార్గం ద్వారా విక్రయించబడుతుంది.

ఆడి ఏ8 ఎల్ సెడాన్ మొత్తం 8 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి టెర్రా గ్రే, డిస్ట్రిక్ గ్రీన్, ఫిర్మమెంట్ బ్లూ, ఫ్లోరెట్ సిల్వర్, గ్లేసియర్ వైట్, మాన్హాటన్ గ్రే, వేసివియస్ గ్రే మరియు మిథోస్ బ్లాక్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

ఆడి కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త సెడాన్ అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. 2022 ఆడి A8 L గ్రిల్ క్రోమ్-ఫినిష్డ్ రీప్రొఫైల్డ్ ఫ్రంట్ ఎండ్‌ను పొందుతుంది. ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ పక్కనే యాంగ్యులర్ ఎయిర్ ఇంటేక్ చూడవచ్చు. A8 L సెలబ్రేషన్ ట్రిమ్ ఎల్ఈడి హెడ్‌లైట్ పొందుతుంది, కాగా టెక్నాలజీ ట్రిమ్ మాత్రం డిజిటల్ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందుతుంది. ఇవి రెండూ కూడా మంచి దృశ్యమానతను అందిస్తాయి.

సైడ్ ప్రొఫైల్ లో 19 ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక వైపున ఈ సెడాన్ వెడల్పు అంతటా లైట్ బార్ ఉంటుంది, అదే సమయంలో సొగసైన ఓఎల్ఈడీ టెయిల్-ల్యాంప్ ఉంటుంది. మొత్తం మీద ఇది చాలా అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఇక ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులోని క్యాబిన్ చాలా లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. ఇందులో 10.1-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం ఉంటుంది. ఇది నావిగేషన్ మొదలైన వాటిని కంట్రోల్ చేస్తుంది.
అంతే కాకుండా ఇందులో 3డి సౌండ్ సిస్టం కూడా ఉంటుంది. ఎయిర్ అయోనైజర్, ఫోర్ జోన్ ఎయిర్ కండిషనింగ్, హెడ్స్ ఆఫ్ డిస్ప్లే, మసాజ్ ఫంక్షనాలిటీ మరియు 30 కలర్ యాంబియంట్ లైటింగ్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

2022 ఆడి ఏ8 ఎల్ సెడాన్ 3.0-లీటర్, టర్బో-పెట్రోల్ వి6 ఇంజిన్ పొందుతుంది. ఇది 340 హెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కి జతచేయబడి ఉంటుంది. ఇందులో క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంటుంది.
ఆడి ఏ8 ఎల్ కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

2022 ఆడి ఏ8 ఎల్ యొక్క బేస్ వేరియంట్ సెలబ్రేషన్ ట్రిమ్ 5 సీటింగ్ లో అందుబాటులో ఉంది. అయితే టెక్నాలజీ వేరియంట్ 5 సీటర్ లేదా 4 సీటర్ ఆప్సన్ లో అందుబాటులో ఉంటుంది. కావున మీకు నచ్చిన సీటింగ్ ఆప్సన్ వేరియంట్ కొనుగోలు చేయవచ్చు. చివరగా సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, 2022 ఆడి ఏ8 ఎల్ 8 ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీ కెమెరాతో పార్క్ అసిస్ట్ ఫీచర్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉంటాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతీయ మార్కెట్లో ఆడి కంపెనీ మంచి ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్ బ్రాండ్. కావున కంపెనీ యొక్క వాహనాలు మంచి సంఖ్యలో అమ్ముడవుతూ ఉన్నాయి. ఇప్పుడు దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త సెడాన్ కూడా అదే విధంగా ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాము. అయితే ఇది దేశీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, బిఎండబ్ల్యు 7 సిరీస్, లెక్సిస్ ఎల్ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








