మహీంద్రా నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ ఏదో తెలుసా..?
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన కొత్త తరం థార్ మరియు ఎక్స్‌యూవీ700 వంటి మోడళ్లతో కంపెనీ అమ్మకాలు ఇప్పుడు సరికొత్త రికార్డులను చేరుకుంటున్నాయి. గత నెలలో మహీంద్రా విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ 7-సీటర్ ఎస్‌యూవీ బొలెరో అమ్మకాలు కొత్త గరిష్టాలను తాకాయి. మహీంద్రా బ్రాండ్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ మోడళ్లలో ఒకటైన బొలెరో గత నెలలో మొత్తం 11,045 యూనిట్లను విక్రయాలను నమోదు చేసింది.

గత ఫిబ్రవరి 2021లో కేవలం 4,843 బొలెరో ఎస్‌యూవీలు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ సమయంలో మహీంద్రా బొలెరో (Mahindra Bolero) అమ్మకాలు దాదాపు 128.06 శాతం వృద్ధి చెందాయి. ఫిబ్రవరి 2022లో మొత్తం మహీంద్రా కార్ల అమ్మకాలలో కేవలం బొలెరో వాటానే 40.07 శాతంగా ఉంది. మహీంద్రా బొలెరో తర్వాత ఈ జాబితాలో మహీంద్రా థార్ (Mahindra Thar) రెండో స్థానంలో ఉంది.

మహీంద్రా తమ సెకండ్ జనరేషన్ థార్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీని 2020 చివర్లో మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుండి మహీంద్రా థార్ ఎస్‌యూవీ కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది, ఫలితంగా దాని వెయిటింగ్ పీరియడ్ కూడా చాలా అధికంగా ఉంటోంది. సమాచారం ప్రకారం, కొన్ని ప్రాంతాల్లో మహీంద్రా థార్ కోసం కస్టమర్లు దాదాపు 8-12 నెలల వరకూ వేచి ఉండాల్సి వస్తోంది. అధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్నప్పటికీ, కస్టమర్లు మాత్రం ఈ 4-సీటర్ ఎస్‌యూవీ కోసం క్యూలో వేచి ఉంటున్నారు.

ఫిబ్రవి 2022లో మహీంద్రా థార్ విక్రయాలు 5,072 యూనిట్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరి 2021లో ఇవి కేవలం 2,842 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. ఈ సమయంలో థార్ విక్రయాలు ఏకంగా 78.47 శాతం పెరిగాయి. మహీంద్రా బొలెరో మరియు థార్ ఎస్‌యూవీలు మాత్రమే కాకుండా కంపెనీ విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ700, ఫుల్-సైజ్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ700 మోడళ్ల అమ్మకాలు కూడా గత ఫిబ్రవరిలో సాధారణం కంటే మెరుగ్గా ఉన్నాయి.

ఈ జాబితాలో 3వ మరియు 4వ స్థానాల్లో నిలిచిన XUV300 మరియు XUV700 మోడళ్లు గత నెలలో వరుసగా 4,511 యూనిట్లు మరియు 4,138 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. వీటిలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700) ఈ బ్రాండ్ నుండి లేటెస్ట్‌గా మార్కెట్లోకి వచ్చిన 7-సీటర్ ఎస్‌యూవీ, ఇది గతేడాది ద్వితీయార్ధంలో భారత మార్కెట్లో విడుదలైంది. ఇక సేఫ్టీ విషయంలో 5-స్టార్ రేటింగ్ దక్కించుకున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫిబ్రవరి 2021లో 3,174 యూనిట్ల విక్రయాలను మాత్రమే నమోదు చేసింది. ఈ సమయంలో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ అమ్మకాలు 42.12 శాతం పెరిగాయి.

మహీంద్రా విక్రయిస్తున్న స్కార్పియో (Mahindra Scorpio) ఎస్‌యూవీ ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 2021లో మహీంద్రా మొత్తం 3,532 స్కార్పియో కార్లను విక్రయించగా, గత నెలతో ఇవి 26.10 క్షీణించి 2,610 యూనిట్లకు పడిపోయాయి. మహీంద్రా స్కార్పియో అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం, కంపెనీ ఇందులో ఓ కొత్త రిఫ్రెష్డ్ మోడల్ ను పరిచయం చేయబోతుందన్న వార్తలు వినిపించడమే. మహీంద్రా కూడా అంతర్గతంగా, ఓ కొత్త తరం స్కార్పియో ఎస్‌యూవీని పరిచయం చేసేందుకు కృషి చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే ఆస్కారం ఉంది.

పైన తెలిపిన ఐదు ఎస్‌యూవీలు కూడా మహీంద్రా నుండి అత్యధికంగా అమ్ముడయ్యే టాప్-5 ఎస్‌యూవీలు. ఇవి కాకుండా, మహీంద్రా మరాజో, మహీంద్రా ఆల్ట్యురాస్ జి4, మహీంద్రా కెయూవీ100 వంటి ఇతర మోడళ్లను కంపెనీ విక్రయిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ మోడళ్ల విక్రయాలు మాత్రం పెద్దగా జరగలేదనే చెప్పాలి. గత నెలలో మరాజో అమ్మకాలు 147 యూనిట్లుగా ఉన్నాయి. అయితే ఫిబ్రవరి 2021లో విక్రయించహడిన 120 యూనిట్లతో గత నెలలో మరాజో అమ్మకాలు 22.50 శాతం పెరిగాయి. కానీ, జనవరి 2022లో 1 యూనిట్ మరాజో కారు కూడా విక్రయించబడలేదు.

మహీంద్రా అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ ఆల్ట్యురాస్ జి4 ను ఆదరించే కస్టమర్లు చాలా పరిమితంగా ఉన్నారు. ప్రీమియం ధర కారణంగా ఈ వాహనాన్ని కొనుగోలు చేసే కస్టమర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. గత నెలలో మహీంద్రా ఆల్ట్యూరాస్ జి4 అమ్మకాలు 27 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే, ఫిబ్రవరి 2021లో మాత్రం మొత్తం 36 ఆల్ట్యురాస్ జి4 కార్లు అమ్ముడయ్యాయి. మహీంద్రా అందిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ కారు, ఇ-వెరిటో, గత నెలలో 12 యూనిట్లు మరియు కెయూవీ100 ఒక యూనిట్ అమ్మకాలను నమోదు చేసింది.

మొత్తంగా చూస్తే, గడచిన ఫిబ్రవరి 2022లో దేశీయ మార్కెట్లో మహీంద్రా మొత్తం 27,563 కార్లను విక్రయించింది. కాగా ఫిబ్రవరి 2021లో కంపెనీ 15,380 కార్లను మాత్రమే విక్రయించగలిగింది. ఈ సమయంలో మహీంద్రా కార్ల అమ్మకాలు 79.21 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. కాగా, జనవరి 2022లో మహీంద్రా 19,860 యూనిట్లను విక్రయించింది, ఆ నెలతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 38.79 శాతం నెలవారీ వృద్ధిని నమోదు చేశాయి.


Click it and Unblock the Notifications