కొత్త సంవత్సరంలో బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే.. టాప్ ప్లేస్‌లో మారుతి సుజుకి బాలెనో
ప్రస్తుతం, భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ఎంట్రీ లెవల్ కార్లు మరియు ఎస్‌యూవీలకు డిమాండ్ పెరగడంతో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ లకు ఆదరణ క్రమంగా తగ్గుతోంది. అయినప్పటికీ, ఇవి ఈ విభాగంలో తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. సాధారణ ఎంట్రీ లెవల్ కార్లతో పోల్చుకుంటే, ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు అదనపు ఫీచర్లను కలిగి ఉండటమే కాకుండా, విశాలంగా కూడా ఉంటాయి. మన మార్కెట్లో ఆరు ప్రధానమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు ఉన్నాయి.

వీటిలో మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్, టొయోటా గ్లాంజా, ఫోక్స్‌వ్యాగన్ పోలో మరియు హోండా జాజ్ మోడళ్లు ఉన్నాయి. గడచిన జనవరి 2022లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల అమ్మకాలను పరిశీలిస్తే, ఈ జాబితాలో మారుతి సుజుకి తమ ప్రీమియం నెక్సా షోరూమ్ ల ద్వారా విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఇతర కార్ మోడళ్లు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం రండి.
| Rank | Premium Hatchback | Jan 2022 | Jan 2021 | Growth (%) |
| 1 | Maruti Baleno | 6,791 | 16,648 | -59.2 |
| 2 | Hyundai i20 | 6,350 | 8,505 | -25.3 |
| 3 | Tata Altroz | 4,525 | 7,378 | -38.6 |
| 4 | Toyota Glanza | 1,347 | 2,556 | -47.3 |
| 5 | Volkswagen Polo | 891 | 1,747 | -48.9 |
| 6 | Honda Jazz | 588 | 953 | -38.3 |

1. మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno)
టాప్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ల జాబితాలో మారుతి సుజుకి బాలెనో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. గత నెలలో (జనవరి 2022) కంపెనీ 6,791 యూనిట్ల బాలెనో కార్లను విక్రయించింది. కాగా, గత ఏడాది ఇదే సమయంలో (జనవరి 2021లో) మారుతి సుజుకి బాలెనో అమ్మకాలు 16,648 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో బాలెనో విక్రయాలు 59.2 శాతం క్షీణించాయి. అయితే, ఇందుకు ప్రధాన కారణం, కంపెనీ ఇందులో ఓ కొత్త 2022 మోడల్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుండటమే.

ప్రస్తుత బాలెనోతో పోల్చుకుంటే, మారుతి సుజుకి తమ కొత్త 2022 మోడల్ బాలెనో కారును సరికొత్త ఫీచర్లు మరియు రిఫ్రెష్డ్ డిజైన్ తో అందుబాటులోకి తీసుకురానుంది. తాజాగా, కంపెనీ ఇందుకు సంబంధించిన ఓ టీజర్ ను కూడా విడుదల చేసింది. ఈ టీజర్ వీడియో ప్రకారం, మారుతి సుజుకి తమ బాలెనో కారులో కొత్తగా 'హెడ్స్ అప్ డిస్‌ప్లే' (Head-up Display) ఫీచర్ ను అందించనుంది. దీంతో పాటుగా కంపెనీ మరికొన్ని అదనపు ఫీచర్లను కూడా అందించనుంది. మరికొద్ది రోజుల్లోనే ఇది మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

2. హ్యుందాయ్ ఐ20 (Hyundai i20)
హ్యుందాయ్ వెన్యూ రాకతో కస్టమర్లు ఎక్కువగా ఐ20 కన్నా వెన్యూ ఎస్‌యూవీని కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. అయినప్పటికీ, కొత్త తరం ఐ20 అమ్మకాలు మాత్రం జోరుగానే సాగుతున్నాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా గడచి నెలలో మొత్తం 6,350 ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లను విక్రయించి ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (జనవరి 2021లో) హ్యుందాయ్ ఐ20 అమ్మకాలు 8,505 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో ఇవి 25.3 శాతం క్షీణించాయి.

3. టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న 5-స్టార్ సేఫ్టీ రేటెడ్ సాలిడ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. గత నెలలో కంపెనీ మొత్తం 4,525 యూనిట్ల టాటా ఆల్ట్రోజ్ కార్లను విక్రయించింది. కాగా, గత ఏడాది జనవరిలో ఈ మోడల్ విక్రయాలు 7,378 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో టాటా ఆల్ట్రోజ్ విక్రయాలు 38.6 శాతం క్షీణించాయి. అయినప్పటికీ, ఇది గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను పొంది, దేశంలో కెల్లా అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉంది.

4. టొయోటా గ్లాంజా (Toyota Glanza)
మారుతి సుజుకి అందిస్తున్న బాలెనో కారును రీబ్యాడ్జ్ చేసి టొయోటా విక్రయిస్తున్న గ్లాంజా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఈ జాబితాలో నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది. జనవరి 2022లో, టొయోటా గ్లాంజా అమ్మకాలు 1,347 యూనిట్లుగా ఉన్నాయి. కాగా, గత ఏడాది జనవరిలో, వీటి అమ్మకాలు 2,556 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో గ్లాంజా అమ్మకాలు కూడా 47.3 శాతం పడిపోయాయి.

5. ఫోక్స్‌వ్యాగన్ పోలో (Volkswagen Polo)
జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పోలో ఈ జాబితాలో ఐదవ స్థానాన్ని దక్కించుకుంది. గత నెలలో కంపెనీ మొత్తం 891 యూనిట్లను విక్రయించగా, గతేడాది ఇదే సమయంలో 1,747 యూనిట్ల ఫోక్స్‌వ్యాగన్ పోలో కార్లను విక్రయించింది. ఈ సమయంలో పోలో విక్రయాలు 48.9 శాతం తగ్గాయి.

6. హోండా జాజ్ (Honda Jazz)
జపనీస్ కార్ బ్రాండ్ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హోండా జాజ్ ఈ జాబితాలో చివరి (ఆరవ) స్థానంలో నిలిచింది. గడచిన జనవరిలో హోండా మొత్తం 588 యూనిట్ల జాజ్ కార్లను విక్రయించింది. కాగా, గత ఏడాది ఇదే సమయంలో హోండా మొత్తం 953 యూనిట్ల జాజ్ కార్లను విక్రయించింది. ఈ సమయంలో హోండా జాజ్ విక్రయాలు కూడా 38.3 శాతం క్షీణించాయి.

గతేడాది జనవరి (2021) తో పోలిస్తే, గడచిన జనవరి 2022 నెలలో అన్ని ప్రీమయం హ్యాచ్‌బ్యాక్ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జనవరి 2022లో మొత్తం 2,58,329 యూనిట్ల ప్యాసింజర్ వాహనాల రిజిస్ట్రేషన్ చేయబడ్డాయి. గతేడాది జనవరిలో జరిగిన రిజిస్ట్రేషన్ కంటే ఈ రిజిస్ట్రేషన్ ఇది 10.12 శాతం తక్కువ. జనవరి 2021లో, అన్ని కంపెనీలకు చెందిన మొత్తం 2,87,424 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు రిజిస్టర్ చేయబడ్డాయి. జనవరి 2020లో ఈ సంఖ్య 2,94,955 యూనిట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications








