భారత మార్కెట్లో కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 'సిల్వర్ షాడో ఎడిషన్' విడుదల: ధర, ఫీచర్లు
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ (BMW) దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎక్స్4 (BMW X4) మోడల్‌లో ఓ కొత్త 'సిల్వర్ షాడో ఎడిషన్' (Silver Shadow Edition) ను కంపెనీ విడుదల చేసింది. గతంలో బిఎమ్‌డబ్ల్యూ విడుదల చేసిన BMW X4 'బ్లాక్ షాడో ఎడిషన్' (Black Shadow Edition) కు మంచి ఆదరణ లభించడంతో కంపెనీ ఇప్పుడు ఇందులో కొత్త సిల్వర్ షాడో ఎడిషన్ ను విడుదల చేసింది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 'సిల్వర్ షాడో ఎడిషన్' డీజిల్ మరియు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ కూపే (SAC) ని హై-గ్లోస్ క్రోమ్ డిజైన్ ఎలిమెంట్స్‌తో మరింత అందంగా మరియు ప్రీమియంగా కనిపించేలా డిజైన్ చేసింది. ఇదివరకటి BMW X4 'బ్లాక్ షాడో ఎడిషన్' మాదిరిగానే ఈ కొత్త BMW X4 'సిల్వర్ షాడో ఎడిషన్' ను కూడా కంపెనీ చెన్నైలోని బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ప్లాంట్‌లో స్థానికంగా ఉత్పత్తి చేయనుంది. ఈ కారు కోసం బుకింగ్‌లు కూడా ప్రారంభించామని, ఆసక్తిగల కస్టమర్లు ఈ కొత్త స్పెషల్ ఎడిషన్‌ను ఈరోజు నుండి shop.bmw.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 'సిల్వర్ షాడో ఎడిషన్'లో చేసిన ప్రధాన మార్పుల విషయానికి వస్తే, ఇది బిఎమ్‌డబ్ల్యూ బ్రాండ్ యొక్క సిగ్నేచర్ మెష్ కిడ్నీ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఇది చాలా విలక్షణమైన ఫ్రేమ్ మరియు గ్రిల్ నగ్గెట్‌లను హై గ్లోస్ క్రోమ్ ఫినిషింగ్ లో కలిగి ఉంటుంది. ఇందులో హై గ్లోస్ క్రోమ్ మరియు నిలువుగా అమర్చబడిన రిఫ్లెక్టర్ లతో కొత్త అన్విల్-ఆకారపు ఇన్‌లేస్ తో షాడో మెటాలిక్ కలర్ లో బంపర్ పెయింట్ చేయబడి ఉంటుంది.

ఇందులో కారు వెనుక భాగం అంతా వ్యాపించి ఉన్నట్లుగా అనిపించే స్ప్లిట్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, పెద్ద ఆటోమేటిక్ టెయిల్‌గేట్ మరియు క్రోమ్ ఫినిషింగ్‌లో కూడిన వెడల్పాటి ఫ్రీ-ఫారమ్ టెయిల్‌పైప్ వంటి ప్రత్యేకమైన డిజైన్ ఫీచర్లు ఉంటాయి. కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ కారును సరికొత్త కార్బన్ బ్లాక్, ఫైటోనిక్ బ్లూ మరియు ఆల్పైన్ వైట్ కలర్ స్కీమ్ లలో అందుబాటులో ఉంచింది. ఇంటీరియర్స్ లో డెకర్ స్టిచింగ్‌తో 'మోఖా' రంగులో ఉండే లెదర్ వెర్నాస్కా అప్‌హోలెస్ట్రీ ఈ కారుకు మరింత లగ్జరీని తెచ్చిపెడుతుంది.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కారులో వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద 12.35 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఉంటుంది. ఈ మార్పులు మినహా కొత్త BMW X4 'సిల్వర్ షాడో ఎడిషన్' లో వేరే ప్రత్యేకమైన మార్పులు ఏవీ లేవు. ఇది డీజిల్ మరియు పెట్రోల్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి:
* BMW X4 xDrive30i : రూ. 71.90 లక్షలు
* BMW X4 xDrive30d : రూ. 73.90 లక్షలు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 ని కంపెనీ మూడు ఇంజన్ ఆప్షన్లతో విక్రయిస్తోంది. వీటిలో మొదటిది 187 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే 2.0-లీటర్, టర్బోచార్జ్డ్, ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజన్. రెండవది 248 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే 2.0-లీటర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. కాగా మూడవది 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్. ఈ ఇంజన్ 261 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్లన్నీ కూడా 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో స్టాండర్డ్ గా జతచేయబడి ఉంటాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తమ కార్ల కోసం సర్వీస్ ఇన్‌క్లూజివ్ మరియు సర్వీస్ ఇన్‌క్లూజివ్ ప్లస్ సదుపాయాన్ని ఆప్షనల్ గా అందిస్తుంది. ఈ సర్వీస్ ప్యాకేజీలు కండిషన్ బేస్డ్ సర్వీస్ (CBS) మరియు నిర్వహణ పనులను (మెయింటినెన్స్ వర్స్ లను) కవర్ చేస్తాయి. ఇవి 3 సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల నుండి ప్రారంభమవుతాయి మరియు 10 సంవత్సరాలు లేదా 2,00,000 కిలోమీటర్ల వరకు పొడిగించబడతాయి. ఈ ప్యాకేజ్ ప్రతి కిలోమీటరుకు రూ. 1.52 ఆకర్షణీయమైన ధరతో ప్రారంభమవుతుంది.

కొత్తగా విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కోసం కంపెనీ ఆప్షనల్ బిఎమ్‌డబ్ల్యూ రిపేర్ ఇన్‌క్లూజివ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. ఇది రెండు సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ వ్యవధి పూర్తయిన తర్వాత, మూడవ సంవత్సరం ఆపరేషన్ నుండి గరిష్టంగా ఆరవ సంవత్సరం వరకు వారంటీ ప్రయోజనాలను పొడిగిస్తుంది. మొత్తంగా, ఈ ప్యాకేజీలు కార్ల యజమానులకు పూర్తి మనశ్శాంతిని మరియు అపరిమిత డ్రైవింగ్ ఆనందాన్ని ఆస్వాదించడానికి స్వేచ్ఛను అందిస్తాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఫైనాన్స్ ఆఫర్
బిఎమ్‌డబ్ల్యూ తమ వినియోగదారుల కోసం ఫైనాన్స్ సేవలను కూడా అందిస్తోంది. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ బిఎమ్‌డబ్ల్యూ 360 డిగ్రీ ఫైనాన్షియల్ పేరుతో ఓ ఆకర్షణీయమైన ప్లాన్‌ని అందజేస్తుంది. ఇందులో భాగంగా కంపెనీ నెలవారీ ధర రూ. 89,999 ఈఎమ్ఐ ఆఫర్, బైబ్యాక్ అష్షూరెన్స్ మరియు సౌకర్యవంతమైన ముగింపు (లోన్ క్లోజరింగ్) వంటి సదుపాయాలను కూడా అందిస్తోంది. అంతేకాకుండా, కస్టమర్ల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా అనుకూలీకరించిన ఆర్థిక పరిష్కారాలను కూడా బిఎమ్‌డబ్ల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందిస్తోంది.


Click it and Unblock the Notifications








