గ్రీన్ హైడ్రోజెన్ ధరను కేజీకి రూ.70-80 మధ్యలో ఉంచేందుకు కేంద్రం ప్లాన్స్..!
భారతదేశంలో ఫ్యూయెల్-సెల్ ఎలక్ట్రిక్ వాహనాలను (FCEVs) ప్రవేశపెట్టడానికి గల సాధ్యాసాధ్యాలను అన్వేషించేందుకు ప్రభుత్వం గత కొన్ని నెలల క్రితమే ఓ అధ్యయనాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ హైడ్రోజన్ (Green Hydrogen)ధరను కిలోకు రూ. 70 నుండి రూ. 80 లేదా ఒక డాలర్ మార్క్‌గా ఉంచే భారత ప్రభుత్వ ప్రణాళికల గురించి తెలియజేశారు. దీన్నిబట్టి చూస్తుంటే, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటుగా హైడ్రెజెన్ ఫ్యూయెల్ ఎలక్ట్రిక్ వాహనాలు కూడా మంచి ప్రాముఖ్యతను సంతరించుకోనున్నట్లు తెలుస్తోంది.
బ్యాటరీ పవర్ తో నడిచే సాధారణ ఎలక్ట్రిక్ వాహనాలకు మరియు హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇవి రెండూ కూడా ఎలక్ట్రిక్ వాహనాలే కదా, అయితే ఎందుకు ఇవి భిన్నంగా ఉంటాయనే ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతూనే ఉండొచ్చు. ఆ సందేహాలను ఈ కథనంలో నివృత్తి చేసుకుందాం రండి.

ఎఫ్‌సిఈవి (Fuel Cell Electric Vehicle) మరియు ఎలక్ట్రిక్ వాహనం (Electric Vehicle) మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసం ఏమిటంటే, FCEVలు వాహనం యొక్క ఎలక్ట్రిక్ మోటార్‌లకు శక్తినివ్వడానికి హైడ్రోజన్‌ను ఉపయోగించే ఇంధన కణాలను (ఫ్యూయెల్ సెల్స్) కలిగి ఉంటాయి మరియు వీటికి బాహ్య (ఎక్స్‌టర్నల్) ఛార్జింగ్ అవసరం లేదు. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో అలా కాదు, ఇవి చాలా పెద్ద బ్యాటరీ ప్యాక్ లను కలిగి ఉంటాయి మరియు ఈ బ్యాటరీలను చార్జ్ చేయడానికి బయటి నుండి విద్యుత్ వనరు అవసరం అవుతుంది.

ఇదే ఈ రెండు రకాల ఎలక్ట్రిక్ వాహనాల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం. అయితే, ధర విషయానికి వస్తే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చు కిలోకు మూడు నుండి నాలుగు డాలర్ల మధ్యలో ఉంటుంది. అంటే, కిలో హైడ్రోజెన్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు సుమారు రూ. 230 మరియు రూ. 350 వరకూ ఉంటుదన్నమాట. కాగా, ఇప్పుడు ఈ గ్రీన్ హైడ్రోజెన్ ధరను భారతదేశంతో సహా అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు కూడా కిలోకు డాలర్ లేదా రెండు డాలర్లకు తగ్గించే దిశగా పని చేస్తున్నాయి. అంటే కిలో హైడ్రోజెన్ ధర సుమారు రూ. 80 లేదా రూ. 150 గా ఉండేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఆగష్టు 15, 2021 వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేషనల్ హైడ్రోజన్ మిషన్‌ను ప్రారంభించారు. ప్రభుత్వం తన వాతావరణ లక్ష్యాలను చేరుకోవడంలో సహాయం చేయడం మరియు భారతదేశాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మార్చడమే ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. ఫలితంగా, 2030 నాటికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ వినియోగం లక్ష్యంగా నిర్ణయించబడింది. అయితే, ప్రస్తుతం హైడ్రోజన్‌తో నడిచే కార్లు చాలా పరిమితంగా ఉన్నాయి.

ప్రస్తుతానికి, హైడ్రోజన్‌తో నడిచే రెండు మాస్-మార్కెట్ కార్లు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. వీటిలో టొయోటా మిరాయ్ (Toyota Mirai) మరియు హ్యుందాయ్ నెక్సో (Hyundai Nexo) ఉన్నాయి. సమాచారం ప్రకారం, టొయోటా మిరాయ్ హైడ్రోజన్ పవర్డ్ కారును ఫుల్ ట్యాంక్ సాయంతో (5.6 కిలోల H2)పై గరిష్టంగా 647 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అంటే, హైడ్రోజన్ ధరను సుమారు కిలోకు రూ. 70 గా నిర్ణయింతే, టొయోటా మిరాయ్ సెడాన్ రన్నింగ్ కాస్ట్ కిలోమీటరుకు రూ. 1.65 అవుతుంది.

ఇది ప్రస్తుత ఎలక్ట్రిక్ వాహనాల యొక్క రన్నింగ్ కాస్ట్ కన్నా కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టే, భారత ప్రభుత్వం కూడా తయారీదారులు మరియు వినియోగదారులను హైడ్రోజెన్ పవర్డ్ కార్లను వినియోగించేలా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. గత కొన్ని నెలలుగా నితిన్ గడ్కరీ కూడా ఢిల్లీలో టొయోటా మిరాయ్ హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్ వాహనాన్ని తన రోజువారీ కారుగా ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా, భారత ప్రభుత్వం యొక్క ఆటోమోటివ్ టెస్టింగ్ ఏజెన్సీ, iCAT (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ) కూడా టొయోటా మిరాయ్‌ను పరీక్షిస్తోంది.

గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి? అదెలా తయారవుతుంది?
గ్రీన్ హైడ్రోజన్ అనేది విద్యుద్విశ్లేషణ (Electrolysis) ద్వారా పునరుత్పాదక శక్తి (Renewable Energy)ని ఉపయోగించి ఉత్పత్తి చేయబడే హైడ్రోజన్. ఈ పద్ధతి నీటిలో ఉండే ఆక్సిజన్ నుండి హైడ్రోజన్‌ను వేరు చేయడానికి విద్యుత్ ప్రవాహాన్ని ఉపయోగిస్తారు. ఈ విద్యుద్విశ్లేషణకు అవసరమైన విద్యుత్తును సౌరశక్తి (Sola Energy) నుండి కానీ లేదా గాలిశక్తి (Wind Power) వంటి పునరుత్పాదక వనరులను ఉపయోగించి తయారు చేస్తారు.

ఈ విధంగా, ప్రకృతి సిద్ధంగా లభించే వనరులతో తయారయ్యే హైడ్రోజన్ ఉత్పత్తి ప్రక్రియలో ఎలాంటి కాలుష్య కారక వాయువులు (Greenhouse Gasses) విడుదల కావు. అందుకే దీనిని గ్రీన్ హైడ్రోజెన్ (Green Hydrogen) లేదా స్వచ్ఛమైన హైడ్రోజెన్ అని పిలుస్తారు. ఒకవేళ గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి శిలాజ ఇంధనాల (పెట్రోల్, డీజిల్ మొదలైనవి) ఉపయోగించినట్లయితే, ఈ హైడ్రోజెన్ ఉత్పత్తి ప్రక్రియలో కార్బన్ డై-ఆక్సైడ్ (CO2) కూడా విడుదల అవుతుంది. కాబట్టి, అప్పుడు దానిని గ్రీన్ హైడ్రోజెన్ అని పిలువలేము.


Click it and Unblock the Notifications