సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో ఈ మోడళ్లు దొరికితే వదులుకోకండి..!
భారత కార్ మార్కెట్ చాలా వైవిధ్యమైనది. ఇటీవలి కాలంలో మనదేశంలోకి అనేక కొత్త కార్ కంపెనీలు మరియు కార్ మోడళ్లు ప్రవేశించాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోగలిగాయి. వాస్తవానికి, కొన్ని కార్ మోడళ్లు అన్ని రకాలుగా గొప్పగానే ఉన్నప్పటికీ, బలహీనమైన మార్కెట్ స్ట్రాటజీల కారణంగా ఇవి దేశంలో కనుమరుగయ్యాయి.
Recommended Video
అయితే, ఇవి కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి అందుబాటులో లేనప్పటికీ, సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో ఇప్పటికీ లభిస్తూనే ఉంటాయి. ఒకవేళ మీరు కూడా సెకండ్ హ్యాండ్ కారును కొనాలని చూస్తుంటే, డీల్‌లో మీరు మిస్ చేసుకోకూడని ఆ టాప్ మోడళ్లు ఏంటో ఈ కథనంలో చూద్దాం రండి.

ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ (డిఎస్‌జి)
మీరు తక్కువ బడ్జెట్‌లో ఓ మంచి పెర్ఫార్మెన్స్ కారుని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ ఇటీవలే నిలిపివేసిన పోలో జిటి టిఎస్ఐ వేరియంట్ మీకు ఉత్తమ ఎంపికగా ఉంటుంది. ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి యొక్క పాత వెర్షన్లు DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందించబడ్డాయి. అయితే, ఇటీవలి కొత్త వెర్షన్లు మాత్రం మాన్యువల్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో విక్రయించబడ్డాయి. మీ బడ్జెట్ తక్కువగా ఉండి లేదా మీరు డిఎస్‌జి ఆటోమేటిక్ వేరియంట్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, మీరు యూజ్డ్ కార్ మార్కెట్లో Polo GT TSI (DSG)ని సులభంగా కనుగొనవచ్చు.

డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన 4 నుండి 5 సంవత్సరాల వయస్సు గల Polo GT TSI (DSG)సుమారు రూ. 6 లక్షల నుండి రూ. 8 లక్షల మధ్యలో అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ కారును మెయింటినెన్స్ చాలా ఖరీదైనది. దీనికితోడు DSG సాంకేతికత చాలా ఖరీదైనది మరియు దీని విషయంలో ఏదైనా సమస్య వస్తే, దానిని రిపేర్ చేయడానికి లేదా భర్తీ చేయడానికి చాలానే ఖర్చు అవుతుంది. కాబట్టి, మీరు ఫన్ టూ డ్రైవ్ కారు కోసం చూస్తుండి, మెయింటినెన్స్ గురించి ఆలోచించనట్లయితేనే ఈ కారును ఎంచుకోండి.

హోండా సివిక్
జపనీస్ కార్ బ్రాండ్ హోండా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న అద్భుతమైన ప్రీమియం కార్లలో సివిక్ (Honda Civic) సెడాన్ కూడా ఒకటి. పాత తరం సివిక్‌ను నిలిపివేసిన తర్వాత హోండా కొత్త తరం మోడల్‌ను విడుదల చేసింది. అయితే, హోండా బ్రాండ్ యొక్క కొత్త ఉత్పత్తి వ్యూహం కారణంగా ఇది కూడా మార్కెట్లో నిలిపివేయబడింది. కాబట్టి, మీరు సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్‌లో హోండా సివిక్ యొక్క పాత మరియు కొత్త తరం మోడళ్లు రెండింటినీ గుర్తించవచ్చు. ఇవి రెండూ కూడా కొనుగోలు చేయదగిన వాహనాలే.

అయితే, మీరు పాత తరం సివిక్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, మీరు సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్‌లో దీనిని సుమారు రూ. 3 లక్షల నుండి 4 లక్షల ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. పాత తరం హోండా సివిక్ 2013 వరకు ఉత్పత్తిలో ఉంది. అయితే, హోండా సివిక్ కోసం విడి భాగాలు తక్షణమే అందుబాటులో ఉండవని గుర్తుంచుకోండి. ఈ స్పేర్ పార్ట్స్ కోసం మీరు కొంత కాలం వేచి ఉండాల్సి రావచ్చు. కాబట్టి, హోండా సివిక్ ను కొనుగోలు చేయాలనుకునే వారు ముందుగా దాని విడిభాగాల లభ్యత గురించి సమాచారాన్ని సేకరించండి.

రెనో డస్టర్ డీజిల్
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనో భారత మార్కెట్లో విక్రయించిన అత్యద్భుతమైన ఎస్‌యూవీ డస్టర్. భారత ఎస్‌యూవీ రూపు రేఖలను మార్చడంలో ఈ మోడల్ ఎంతగానో సహాయపడిందని చెప్పవచ్చు. అయితే, రెనో ఇటీవలే భారత మార్కెట్లో డస్టర్ (Renault Duster) ఎస్‌యూవీని నిలిపివేసింది. రెనాల్ట్ డస్టర్ భారతదేశంలో 84 bhp మరియు 108 bhp పవర్ అవుట్‌పుట్ లతో కూడిన డీజిల్ ఇంజన్ వేరియంట్లలో విక్రయించబడుతోంది. ఈ పాత మోడల్ డీజిల్ ఇంజన్ వేరియంట్‌లు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి, సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో రెనో డస్టర్ యొక్క డీజిల్ వేరియంట్ ను సుమమారు రూ. 4.4 లక్షల నుండి రూ. 7 లక్షల ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా డీజిల్
బిఎస్6 కాలుష్య నిబంధనలు అమల్లోకి రాక ముందు మారుతి సుజుకి తమ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విటారా బ్రెజ్జాను డీజిల్ ఇంజన్ తో కూడా విక్రయించేంది. అయితే, ఆ తర్వాత కంపెనీ అన్ని డీజిల్ కార్ల తయారీని నిలిపివేసి, కేవలం పెట్రోల్ కార్లను మాత్రమే తయారు చేస్తోంది. మారుతి సుజుకి విటారా బ్రెజ్జా (Maruti Suzuki Vitara Brezza Diesel) భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సబ్ కాంపాక్ట్ SUVలలో ఒకటి. కానీ, 2019లో కొత్త ఉద్గార నిబంధనలను ప్రవేశపెట్టిన తర్వాత కంపెనీ ఇందులో డీజిల్ వేరియంట్లను తయారు చేయడం నిలిపివేసింది.

అయితే, ఒకవేళ మీకు సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో ఇప్పటికీ విటారా బ్రెజ్జా డీజిల్ వెర్షన్ లభించినట్లయితే, టక్కున దానిని కొనేయండి. ఎందుకంటే, విటారా బ్రెజ్జా యొక్క 1.3-లీటర్ DDiS డీజిల్ ఇంజన్ దాని విజయానికి అతిపెద్ద కారణాలలో ఒకటి. ప్రస్తుతం, ఈ ఎస్‌యూవీ కేవలం పెట్రోల్ ఇంజన్‌లో మాత్రమే విక్రయించబడుతోంది. ప్రీ-ఓన్డ్ కార్ మార్కెట్లో మీరు విటారా బ్రెజ్జా డీజిల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, దానిని సుమారు రూ. 5.5 లక్షల నుండి 9.5 లక్షల వద్ద కొనుగోలు చేయవచ్చు.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ 1.6
మారుతి సుజుకి ఎస్-క్రాస్ అనేది ఈ కంపెనీ అందించిన ఓ బెస్ట్ కాంపాక్ట్ క్రాస్ఓవర్. చాలా మందికి ఈ కారు డిజైన్ నచ్చలేదో లేక దాని పెర్ఫామెన్స్ పై తక్కువ అంచనా వేశారో తెలియదు కానీ, ఇది మార్కెట్లో ఆశించిన ఆదరణ పొందలేకపోయింది. ఇది 1.6-లీటర్ DDiS డీజిల్ వేరియంట్‌లో శక్తివంతమైన క్రాస్ఓవర్. అయితే, తక్కువ డిమాండ్ కారణంగా, కంపెనీ ఈ ఇంజన్ ఎంపికను నిలిపివేయాల్సి వచ్చింది. అయినప్పటికీ, మీరు ఈ కారును సెకండ్ హ్యాండ్ కార్ కొనుగోలు చేయవచ్చు. సెకండ్ హ్యాండ్ మారుతి ఎస్-క్రాస్ (Maruti Suzuki S-Cross 1.6) ను సుమారు రూ. 5.5 లక్షల నుండి 6.5 లక్షల ధర మధ్యలో కొనుగోలు చేయవచ్చు.

పాత తరం టాటా సఫారి
పాత తరం టాటా సఫారికి ఉన్న ఆదరణ ఈ కొత్త తరం టాటా సఫారికి (Old Gen Tata Safari) లేదనే చెప్పాలి. ఎందుకంటే, ఇది 4x4 (ఆల్-వీల్ డ్రైవ్) సిస్టమ్‌తో రాలేదు, ఇది భారతదేశంలోని సఫారీ ఔత్సాహికులను చాలా నిరాశకు గురి చేసింది. పాత తరం సఫారి ఎస్‌యూవీ దాని 4x4 డ్రైవ్ సిస్టమ్‌కు ప్రసిద్ధి చెందింది. మీరు ఈ కారు ఇప్పటికీ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మంచి కండిషన్‌లో గుర్తించినట్లయితే, వెంటనే కొనుగోలు చేయవచ్చు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో పాత తరం సఫారి దొరకడం చాలా కష్టం, ఒకవేళ దొరికినా దాని కండిషన్ శిధిలావస్థలో ఉండొచ్చు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో టాటా సఫారీని దాని కండిషన్ ను బట్టి రూ. 4 లక్షల నుండి 8 లక్షల ధర మధ్య కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








