హిందుస్థాన్ మోటార్స్ నుండి ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు ఎలక్ట్రిక్ అంబాసిడర్ వస్తోంది..!
భారతదేశపు పురాతన కార్ కంపెనీ హిందుస్థాన్ మోటార్స్ (Hindustan Motors) మరియు దాని ఐకానిక్ కార్ బ్రాండ్ అంబాసిడర్ (Ambassdor) తిరిగి భారత మార్కెట్లో జీవం పోసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. భారతదేశంలో హిందూస్థాన్ మోటార్స్ అంబాసిడర్ రీ-ఎంట్రీ గురించి మేము ఇటీవల ఓ కథనంలో వెల్లడించాము. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించి మరో ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే, హిందుస్థాన్ మోటార్స్ ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఎలక్ట్రిక్ అంబాసిడర్ కారును కూడా అభివృద్ధి చేయనున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

హిందుస్థాన్ మోటార్స్ సంస్థకు భారతదేశంలో చాలా గొప్ప చరిత్రే ఉంది. భారతదేశంలో ఇన్ని దశాబ్ధాల వారసత్వాన్ని కలిగి ఉన్న ఆటోమోటివ్ బ్రాండ్ బహుశా ఏదీ లేదనే చెప్పొచ్చు. సుమారు 1957 లో, హిందూస్థాన్ మోటార్స్ భారతదేశంలో మోరిస్ ఆక్స్‌ఫర్డ్ సిరీస్ 3 కారుని తయారు చేసేందుకు బ్రిటిష్ మోటార్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ విధంగా పుట్టుకొచ్చిందే హెచ్‌ఎమ్ అంబాసిడర్ కారు. ఒకప్పుడు మనదేశంలో సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకూ కార్ అంటే, అంబాసిడర్ మాత్రమే.

అయితే, మారుతున్న కాలంతో పాటుగా అంబాసిడర్ తన రూపాన్ని మరియు ప్రత్యేకతలను మార్చుకోవడం విఫలం కావడంతో, ఈ మోడల్ కాస్తా అటకెక్కి కూర్చుంది. అయితే, ఇప్పుడు హిందుస్థాన్ మోటార్స్ పునరాగమనానికి సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. ఈసారి లేటెస్ట్ గా, మార్కెట్లోని ఇతర కంపెనీలకు ధీటుగా పూర్తి ఎలక్ట్రిక్ రూపంలో అంబాసిడర్ కారు తిరిగి మార్కెట్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముందుగా ఈ బ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో వ్యాపారం ప్రారంభించి, ఆ తర్వాత ఎలక్ట్రిక్ కారును విడుదల చేయవచ్చని సమాచారం.

హిందుస్థాన్ మోటార్స్ ఇప్పుడు ఫ్రెంచ్ ఆటోమొబైల్ కంపెనీ అయిన ప్యూజో యాజమాన్యంలో ఉంది. తాజా నివేదికల ప్రకారం, ఈ కంపెనీ ఓ యూరోపియన్ ఈవీ బ్రాండ్ తో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు నివేదించబడింది. హిందుస్థాన్ మోటార్స్ నుండి రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్లను కోల్‌కతా సమీపంలోని ప్లాంట్‌లో తయారు చేసే అవకాశం ఉంది. తరువాతి దశలో, హిందుస్థాన్ మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లను కూడా విడుదల చేస్తుందని మరియు మనం భారత రోడ్లపై ఎలక్ట్రిక్ అంబాసిడర్‌ను చూసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

గత వారం ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురించబడిన నివేదిక ప్రకారం, హింద్ మోటార్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Hind Motor Financial Corporation) మరియు ప్యూజో (Peugeot) మధ్య ఏర్పడిన జాయింట్ వెంచర్ కొత్త అంబాసిడర్ కారు కోసం డిజైన్ మరియు పవర్‌ట్రైన్ పై పని చేస్తోందని పేర్కొనబడింది. హిందుస్థాన్ మోటార్స్ డైరెక్టర్ ఉత్తమ్ బోస్ టైమ్స్ ఆఫ్ ఇండియా తో మాట్లాడుతూ, కొత్త ఇంజన్ కోసం మెకానికల్ మరియు డిజైన్ పనులు అధునాతన దశకు చేరుకున్నాయని, కొత్త లుక్ అంబాసిడర్ 2.0 (Ambassador 2.0) ని తీసుకురావడానికి పనులు జరుగుతున్నాయని చెప్పారు.

ఈ వార్తలపై ఇరు కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, ఇందకు సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ మరియు కస్టమర్లు వాటిని ఆదరిస్తున్న తీరుని చూసి, ఇప్పటికే అనేక కొత్త కంపెనీలు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారాన్ని ప్రారంభించాయి. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు ఇక్కడ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నాయి. టెస్లా వంటి అగ్రగామి ఈవీ కంపెనీలు కూడా భారత్ లో వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాయి.

ఓలా నుండి రాబోతున్న ఎలక్ట్రిక్ కారు (Ola Electric Car)..
ఇదిలా ఉంటే, భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో ఇప్పుడు అగ్రగామిగా అవతరించిన ఓలా ఎలక్ట్రిక్, త్వరలోనే ఓ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ డిజైన్ మరియు దాని తయారీకి సంబంధించిన ప్లాంట్ ఏర్పాటు పై కసరత్తులు చేస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ తమ భవిష్యత్ ఎలక్ట్రిక్ కార్ల కోసం ఓ ఫ్యూచర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. తొలుత ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారవుతున్న కొత్త ఫ్యూచర్ ఫ్యాక్టరీలోనే ఈ ఎలక్ట్రిక్ కారు ఉత్పత్తి కూడా జరుగుతుందని మునుపటి నివేదికలు ధృవీకరించాయి. అయితే, ఓలా ఇప్పుడు తమ ఫ్యూచర్ కార్ ఫ్యాక్టరీ కోసం అనేక ఇతర రాష్ట్రాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఓలా ఎలక్ట్రిక్ తమ ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయడానికి ఏర్పాటు చేయబోయే ఫ్యూచర్ ఫ్యాక్టరీ, తమిళనాడు ఫ్యాక్టరీ కన్నా మరింత పెద్దదిగా ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం ప్రకారం, ఓలా దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణంలో తమ ఎలక్ట్రిక్ కార్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇందుకు సంబంధించి భూ సేకరణ కోసం ప్రస్తుతం తమిళనాడుతో పాటు మరో ఐదు రాష్ట్రాలను పరిశీలిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఉన్నట్లు సమాచారం. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








