రెండేళ్లలో పెట్రోల్ కార్ల ధరలకి, ఎలక్ట్రిక్ కార్ల ధరలకి పెద్ద తేడా ఉండదు: కేంద్ర మంత్రి
భారతదేశంలో ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ జోరందుకున్న సంగతి మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే, అమ్మకాలు మరియు తయారీ పరంగా చూస్తే, ఎలక్ట్రిక్ వాహనాలు ఇంకా సాంప్రదాయ పెట్రోల్/డీజిల్ వాహనాల కన్నా చాలానే వెనుకబడి ఉన్నాయని చెప్పవచ్చు. ఇందుకు ప్రధాన కారణం, పెట్రోల్/డీజిల్ వాహనాలతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండటం మరియు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం మౌళిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం.
అయితే, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో, ఈ విభాగంలోకి కొత్త తయారీదారులు, కొత్త ఉత్పత్తులు మరియు సరికొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. ఒకప్పటి సాంప్రదాయ వాహనాల వృద్ధితో పోల్చుకుంటే, ఎలక్ట్రిక్ వాహన విభాగంలో వృద్ధి రేటు ఎన్నో రెట్లు అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో, రానున్న రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధర పెట్రోల్ వాహనాల ధరతో సమానంగా ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ మరియు గ్రీన్ ఫ్యూయెల్స్ (హరిత ఇంధనాల) లో వేగవంతమైన పురోగతి కారణంగా రానున్న రెండేళ్లలో ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రాంట్‌ల కోసం డిమాండ్‌ల గురించి పార్లమెంటులో గడ్కరీ సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

లోక్‌సభలో మంత్రి మాట్లాడుతూ, "గరిష్టంగా రెండేళ్లలో ఎలక్ట్రిక్ స్కూటర్, కారు, ఆటో రిక్షా ధర పెట్రోల్‌తో నడిచే స్కూటర్, కారు, ఆటోరిక్షా ధరలకు సమానంగా ఉంటుందని నేను చెప్పగలను, లిథియం-అయాన్ బ్యాటరీ ధరలు తగ్గుతున్నాయి. మేము ఈ జింక్ అయాన్, అల్యూమినియం అయాన్, సోడియం అయాన్ బ్యాటరీల రసాయన శాస్త్రాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాము. పెట్రోల్ అయితే, మీరు సుమారు రూ.100 ఖర్చు చేస్తున్నారు, అదే ఎలక్ట్రిక్ వాహనంపై అయితే మీరు కేవలం రూ.10 (ఉపయోగించడానికి) మాత్రమే ఖర్చు చేస్తారు." అని చెప్పారు.

రవాణా కోసం హైడ్రోజన్ టెక్నాలజీని అవలంబించాలని మంత్రి తన తోటి పార్లమెంటు సభ్యులను కోరారు. మురుగు నీటిని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి మార్చే విషయంలో ఎంపీలు తమ సొంత నియోజకవర్గాల్లో చొరవ తీసుకోవాలని సూచించారు. గ్రీన్ హైడ్రోజన్ అనేది సౌర శక్తి మరియు పవన శక్తి (సోలార్ అండ్ విండ్ ఎనర్జీ) వంటి పునరుత్పాదక శక్తి వనరుల (రీజనరేటివ్ ఎనర్జీ రిసోర్సెస్) ద్వారా విద్యుద్విశ్లేషణ (ఎలక్ట్రోలసిస్)ను ఉపయోగించి ఉత్పత్తి చేయబడిన హైడ్రోజన్ వాయువుకు ఇవ్వబడిన పేరు.

శిలాజ ఇంధనాలు (భూమిలో లభించే పెట్రోల్, డీజిల్ మొదలైనవి) అంతరించిపోతున్న తరుణంలో ఈ 'గ్రీన్ హైడ్రోజన్' చాలా మందికి భవిష్యత్ ఇంధనంగా పరిగణించబడుతుంది, అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేయబడుతున్న మొత్తం హైడ్రోజన్‌లో ఇది చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం, ఎక్కువగా ఉపయోగించే హైడ్రోజన్ వాయువు యొక్క అత్యంత సాధారణ వెర్షన్ 'గ్రే హైడ్రోజన్' గా ఉంటుంది. గ్రే హైడ్రోజన్ ఇతర హైడ్రోజన్ వెర్షన్‌ల మాదిరిగానే అదే విద్యుద్విశ్లేషణ ప్రక్రియను ఉపయోగించి ఉత్పత్తి చేయబడుతుంది.

అయితే, విద్యుద్విశ్లేషణకు ఉపయోగించే శక్తి లేదా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ఏదైనా ఇతర ప్రక్రియ శిలాజ ఇంధనాల దహనం ద్వారా మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం ఉత్పత్తి చేయబడిన హైడ్రోజన్‌లో గ్రే హైడ్రోజన్ 95 శాతం వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న హైడ్రోజన్ యొక్క మరొక రూపాన్ని బ్లూ హైడ్రోజన్ అని కూడా అంటారు. విచారించాల్సిన విషయం ఏంటంటే, ప్రత్యామ్నాయ ఇంధనమైన హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి శిలాజ ఇంధనాన్ని మండిచాల్సి రావడం.

కాకపోతే, బ్లూ హైడ్రోజన్‌ని సృష్టించే ప్రక్రియలో బొగ్గు మరియు వాయువును కాల్చడం నుండి వచ్చే హానికరమైన కార్బన్ ఉద్గారాలను సంగ్రహించడానికి వివిధ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీలను కూడా ఉపయోగిస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ గురించి నితిన్ గడ్కరీ ప్రస్తావించడం ఇదేం మొదటిసారి కాదు. బ్యాటరీతో నడిచే ఈవీల ద్వారా అయినా లేదా హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్స్ ఉపయోగించే వాహనాల ద్వారా అయినా భారతదేశంలో ఆటోమొబైల్స్‌ను విద్యుదీకరణ (ఎలక్ట్రిఫికేషన్) వైపుకు మరల్చాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు.

ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ కార్యక్రమంలో జపాన్ కార్ల తయారీ సంస్థ టొయోటాతో మిరాయ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాన్ని అధ్యయనం చేయడానికి మరియు మూల్యాంకనం చేయడానికి భారత ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం కూడా చేసింది. ఈ పైలట్ ప్రాజెక్టులో టొయోటా మిరాయ్ యొక్క ప్రస్తుత వెర్షన్‌ను ఉపయోగించనున్నారు. ఇది మొదటిసారిగా 2019 లో ఆవిష్కరించబడింది మరియు డిసెంబర్ 2020 లో గ్లోబల్ మార్కెట్లలో అమ్మకానికి వచ్చింది.

టొయోటాకు చెందిన ఈ సెకండ్ జనరేషన్ మిరాయ్ హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్ ఈవీ కంపెనీ యొక్క 4JM ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 182 బిహెచ్‌పి పవర్ ను మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటారు హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్స్ ద్వారా పనిచేస్తుంది. ఇది శక్తిని ఉత్పత్తి చేయడానికి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్‌లను కలపడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మూడు హైడ్రోజన్ ప్రెజర్ ట్యాంకులు ఉంటాయి. వీటి సాయంతో గరిష్టంగా 647 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.


Click it and Unblock the Notifications