అమేజింగ్ "అమేజ్".. ఇప్పటి వరకూ 5 లక్షల మందికి పైగా కస్టమర్లకు చేరువైన హోండా అమేజ్!
జపనీస్ కార్ బ్రాండ్ హోండా (Honda) దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ సెడాన్ అమేజ్, భారతదేశంలో మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకూ ఈ కారు ఐదు లక్షలకు పైగా కస్టమర్లకు చేరువైంది.
Recommended Video
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ 2013లో తమ బ్రయో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా విడుదల చేసిన అమేజ్ సెడాన్ తన 9 ఏళ్ల ప్రయాణంలో 5 లక్షల ఇళ్లను చేరుకుంది. భారతదేశంలో ఎస్‌యూవీలకు పాపులారిటీ పెరిగినప్పటికీ, హోండా అమేజ్ మాత్రం తన పాపులారిటీని కోల్పోలేదు. ఖరీదైన హోండా సిటీ సెడాన్‌ను కొనుగోలు చేయలేని వారికి హోండా అమేజ్ ఎల్లప్పుడూ ఓ మినీ సిటీ సెడాన్ మాదిరిగానే కనిపించింది.

హోండా అమేజ్ తొలిసారిగా 2013లో భారత మార్కెట్లో విడుదలైంది. ఆ తర్వాత కంపెనీ ఇందులో 2018లో రెండవ తరం అమేజ్ మోడల్‌ను విడుదల చేసింది. ఈ రెండవ తరం మోడల్ మార్కెట్లోకి వచ్చిన మూడేళ్లలోనే 2 లక్షల యూనిట్లు అమేజ్ కార్లు అమ్ముడయ్యాయి. హోండా నుండి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంట్రీ లెవల్ మోడల్ కూడా అమేజ్ కావడంతో ఈ మోడల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

అమేజ్ రాకతో భారతదేశంలో హోండా స్థానం చాలా వరకూ స్థిరపడిందని చెప్పొచ్చు. మొదట్లో హోండా కేవలం పెట్రోల్ కార్లను మాత్రమే విక్రయిస్తూ, చాలా పరిమిత సంఖ్యలో మార్కెట్ వాటాను కలిగి ఉండేది. కాగా, ప్రస్తుతం కంపెనీ మొత్తం విక్రయాల్లో 40 శాతం అమ్మకాలు హోండా అమేజ్ నుండే వస్తున్నాయంటే ఈ కారు ఎంత పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. హోండా అమేజ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

ప్రస్తుతం విక్రయించబడుతున్న సెకండ్ జనరేషన్ అమేజ్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉన్న కారణంగా ఇది మునుపటి మోడల్ కన్నా వేగంగా అమ్ముడవుతోంది. హోండా అమేజ్ 1.2-లీటర్ i-VTEC పెట్రోల్ మరియు 1.5-లీటర్ i-DTEC ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 88 బిహెచ్‌పి శక్తిని మరియు 110 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కాగా, డీజిల్ ఇంజన్ గరిష్టంగా 98.6 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ విషయానికి వస్తే, మ్యాన్యువల్ మరియు సివిటి ట్రాన్సిమిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

భారతదేశంలోని టైర్ 1, 2 మరియు 3 నగరాల్లో హోండా అమేజ్ అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటిసారిగా కారు కొనుగోలు చేసేవారు, విశ్వసనీయమైన హోండా బ్రాండ్‌ను కోరుకునే వారుకు ఎక్కువగా ఈ కారును ఎంచుకుంటున్నారు. హోండా కంపెనీపై ఉన్న నమ్మకం మరియు అమేజ్ కారు యొక్క నాణ్యత కారణంగా ఎక్కువ మంది భారతీయులు ఈ కారును కొనుగోలు చేస్తున్నారు. హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ విభాగంలో మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా మరియు టాటా టిగోర్ అంటి వాటికి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

హోండా తొలిసారిగా అమేజ్ కారును కారును ప్రారంభించినప్పుడు కంపెనీ మొత్తం అమ్మకాలలో ఈ కారు అమ్మకాలు కేవలం 9 శాతం మాత్రమే ఉండేవి. కాగా, ఇప్పుడు అది 30 శాతానికి పైగా చేరుకుంది. కొత్త హోండా అమేజ్ తయారీలో కంపెనీ దాదాపు 95 శా స్థానికీకరణ విధానాన్ని అనుసరిస్తోంది. ఫలితంగా, సరసమైన ధరకే కంపెనీ ఈ కారును విక్రయించగలుగుతోంది. హోండా అమేజ్ కొనుగోలు చేసే కస్టమర్లలో ఎక్కువ మంది సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

హోండా అమేజ్ కారులో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది Apple CarPlay మరియు Android Auto కనెక్టివిటీతో పాటుగా హోండా యొక్క స్వంత కనెక్టింగ్ సాఫ్ట్‌వేర్ అయిన Weblink ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్రైవర్ సమాచారం కోసం డిజిటల్ ఎమ్ఐడి డిస్‌ప్లే యూనిట్, ఆటోమేటిక్ హెడ్‌లైట్స్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఐసోఫిక్స్ మౌంట్ చైల్డ్ సీట్ యాంకర్స్ మరియు ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హోండా నుండి మరో మూడు కార్లు డిస్‌కంటిన్యూ కానున్నాయా..?
హోండా బ్రాండ్‌కు సంబంధించిన తాజా వార్తలను గమనిస్తే, ఈ జపనీస్ కంపెనీ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హోండా జాజ్ (Honda Jazz), క్రాసోవర్ డబ్ల్యూఆర్-వి (Honda WR-V) మరియు 4వ తరం హోండా సిటీ (4th Gen Honda City) సెడాన్ లను డిస్‌కంటిన్యూ చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే, హోండా నుండి ఇండియన్ ప్రోడక్ట్ లైనప్ లో కేవలం మూడు మోడళ్ల మాత్రమే ఉంటాయి. వీటిలో అమేజ్ (Honda Amaze) కాంపాక్ట్ సెడాన్, 5వ తరం హోండా సిటీ (5th Gen Honda City) సెడాన్ మరియు కొత్తగా వచ్చిన సిటీ ఇ-హెచ్ఈవి (Honda City e:HEV) హైబ్రిడ్ కారు ఉన్నాయి.

ఓ నివేదిక ప్రకారం, హోండా జాజ్ ఉత్పత్తి అక్టోబర్ 2022 తర్వాత నిలిపివేయబడుతుంది, అయితే డబ్ల్యూఆర్-వి క్రాస్ఓవర్ ఉత్పత్తి మాత్రం మార్చి 2023 తర్వాత నిలిపివేయబడుతుంది. హోండా యొక్క మిడ్-సైజ్ సెడాన్ అయిన 4వ తరం సిటీ ఉత్పత్తి ఈ ఏడాది డిసెంబర్ వరకూ మాత్రమే జరుగుతుందని సమాచారం. అయితే, ఈ విషయంపై హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ మాత్రం అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. బహుశా, భారతదేశంలో తమ ప్రోడక్ట్ లైనప్‌ను రిఫ్రెష్ చేసే ప్రక్రియలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








