మే 2022 నెలలో టాప్ 10 కార్లు ఇవే.. మారుతి సుజుకి కార్లకే పెద్ద పీట, టాటా నెక్సాన్ రికార్డ్ సేల్స్
భారత ఆటోమొబైల్ మార్కెట్లో టాప్ 10 కార్ల జాబితా ప్రతినెలా మారుతూ ఉంటుంది. అయితే, ఈ జాబితాలో ఎప్పుడూ మారుతి సుజుకి బ్రాండ్ కి చెందిన కార్లు ఎక్కువగా అగ్రస్థానాల్లో నిలుస్తూ ఉంటాయి. అయితే, ఈసారి అనూహ్యంగా టాటా మోటార్స్ అందిస్తున్న నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ గడచిన మే 2022 నెలలో ద్వితీయ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా, టాటా మోటార్స్ ఓవరాల్‌గా గడచిన నెలలో హ్యుందాయ్ అమ్మకాలను ఓవర్‌టేక్ చేసి భారతదేశపు రెండవ అతిపెద్ద కార్ కంపెనీగా అవతరించింది. గత నెలలో అమ్ముడైన టాప్ 10 కార్ల వివరాలు ఇలా ఉన్నాయి:

1) మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (WagonR) - 16,814 యూనిట్లు
భారతదేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి విక్రయిస్తున్న టాల్ బాయ్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ మార్కెట్లో ఎల్లప్పుడూ ఓ బెస్ట్ సెల్లింగ్ మోడల్ గానే కొనసాగుతోంది. గత నెలలో ఈ మోడల్ దేశంలో అత్యధికంగా విక్రయించబడిన కారుగా నిలిచింది. మే 2022 నెలలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ అమ్మకాలు 16,814 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది మే 2021 నెలలో కంపెనీ విక్రయించిన 2,086 యూనిట్లతో పోలిస్తే, 706 శాతం (14,702 యూనిట్లు) వృద్ధిని సాధించింది.

2) టాటా నెక్సాన్ (Nexon) - 14,614 యూనిట్లు
మే 2022 నెలలో టాటా మోటార్స్ మరియు టాటా నెక్సాన్ రెండూ కూడా రికార్డు స్థాయిలో అమ్మకాలను సాధించాయి. అమ్మకాల పరంగా, టాటా నెక్సాన్ ఉత్తమ నెల విక్రయాలను నమోదు చేసింది. గత నెలలో 14,614 యూనిట్ల టాటా నెక్సాన్ కార్లు అమ్ముడయ్యాయి. మే 2021 నెలలో కంపెనీ కేవలం 6,439 యూనిట్ల నెక్సాన్ ఎస్‌యూవీలను మాత్రమే విక్రయించింది. ఈ సమయంలో నెక్సాన్ అమ్మకాలు 127 శాతం పెరిగాయి. టాటా నెక్సాన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా ఎలక్ట్రిక్ వెర్షన్ లో కూడా అందుబాటులో ఉంది. కంపెనీ ఇటీవలే ఇందులో కొత్త టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ వేరియంట్ ని కూడా లాంచ్ చేసింది, ఇది పూర్తి ఛార్జ్‌పై 437 కిమీల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది.

3) మారుతి సుజుకి స్విఫ్ట్ (Swift) - 14,133 యూనిట్లు
ఈ జాబితాలో ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉండే మారుతి సుజుకి స్విఫ్ట్ గడచిన మే 2022 నెలలో మూడవ స్థానానికి పడిపోయింది. గత నెలలో మారుతి సుజుకి మొత్తం 14,133 యూనిట్ల స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ లను విక్రయించింది. మే 2021 నెలలో కంపెనీ విక్రయించిన 7,005 యూనిట్లతో పోలిస్తే, గత నెల అమ్మకాలు 102 శాతం (7128 యూనిట్లు) పెరిగాయి.

4) మారుతి సుజుకి బాలెనో (Baleno) - 13,970 యూనిట్లు
మారుతి సుజుకి ఇటీవలే తమ అప్‌డేటెడ్ 2022 బాలెనో కారును మార్కెట్లో విడుదల చేసింది. గడచిన మే 2022 నెలలో అత్యధికంగా విక్రయించబడిన కార్లలో ఇది నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది. మారుతి సుజుకి అందిస్తున్న ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గడచిన నెలలో 13,970 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. మే 2021 నెలలో కంపెనీ విక్రయించిన 4,803 యూనిట్లతో పోలిస్తే, గత నెల అమ్మకాలు 191 శాతం (9,167 యూనిట్లు) పెరిగాయి.

5) మారుతి సుజుకి ఆల్టో (Alto) - 12,933 యూనిట్లు
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కారుగా పేరు దక్కించుకున్న మారుతి సుజుకి ఆల్టో గడచిన మే 2022 నెలలో ఐదవ స్థానానికి పడిపోయింది. గత నెలలో మారుతి సుజుకి యొక్క ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఆల్టో 12,933 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది మే 2021 నెలలో కంపెనీ విక్రయించిన 3,220 యూనిట్లతో పోలిస్తే గత నెల అమ్మకాలు 302 శాతం (9,713 యూనిట్లు) పెరిగాయి.

6) మారుతి సుజుకి ఎర్టిగా (Ertiga) - 12,226 యూనిట్లు
మారుతి సుజుకి ఇండియా గడచిన మే 2022 నెలలో ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ ఎర్టిగా ఎమ్‌పివిని మార్కెట్లో విడుదల చేసింది. గత నెలలో మారుతి సుజుకి మొత్తం 12,226 యూనిట్ల ఎర్టిగా ఎమ్‌పివిలను మార్కెట్లో విక్రయించింది. కాగా, మే 2021 నెలలో కంపెనీ విక్రయించిన 2,694 యూనిట్లతో పోలిస్తే, గత నెల అమ్మకాలు ఏకంగా 354 శాతం (9,532 యూనిట్లు) పెరిగాయి.

7) మారుతి సుజుకి డిజైర్ (Dzire) - 11,603 యూనిట్లు
ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సెడాన్ మారుతి సుజుకి డిజైర్ మాత్రమే. మారుతి సుజుకి గత నెలలో 11,603 యూనిట్ల డిజైర్ కాంపాక్ట్ సెడాన్లను విక్రయించింది. మే 2021 నెలలో మారుతి సుజుకి విక్రయించిన 5,819 యూనిట్ల డిజైర్ కార్లతో పోలిస్తే, గత నెలలో ఈ మోడల్ అమ్మకాలు 99 శాతం (5,784 యూనిట్లు) పెరిగాయి.

8) హ్యుందాయ్ క్రెటా (Creta) - 10,973 యూనిట్లు
హ్యుందాయ్ క్రెటా ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న రెండవ మారుతీయేతర వాహనం. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మే 2022 నెలలో మొత్తం 10,973 యూనిట్ల క్రెటా వాహనాలను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 7,527 యూనిట్లతో పోలిస్తే 46 శాతం (3,3446 యూనిట్లు) వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం, ఈ మోడల్ హ్యుందాయ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఉంది.

9) మారుతి సుజుకి ఈకో (Eeco) - 10,482 యూనిట్లు
వ్యాన్ విభాగంలో తిరుగులేని అమ్మకాలను కనబరుస్తున్న మోడల్ మారుతి సుజుకి ఈకో. మారుతి సుజుకి గత నెలలో భారతదేశంలో మొత్తం 10,482 యూనిట్ల ఈకో వ్యాన్‌లను విక్రయించింది. మే 2021 నెలలో కంపెనీ విక్రయించిన కేవలం 1,096 యూనిట్లు మారుతి ఈకో వ్యాన్ లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు ఏకంగా 856 శాతం (9,386 యూనిట్లు) పెరిగాయి.

10) మారుతి సుజుకి విటారా బ్రెజ్జా (Vitara Brezza) - 10,312 యూనిట్లు
ఇక ఈ జాబితాలో చివరి స్థానంలో ఉన్నది కూడా మారుతి సుజుకి బ్రాండ్ కు చెందిన వాహనమే. మారుతి సుజుకి విటారా బ్రెజ్జాలో కంపెనీ ఓ కొత్త మోడల్ ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, పాత మోడల్ అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. గడచిన మే 2022 నెలలో మారుతి సుజుకి మొత్తం 10,312 యూనిట్ల విటారా బ్రెజ్జా ఎస్‌యూవీలను విక్రయించింది. ఇది మే 2021 నెలలో కంపెనీ విక్రయించిన 2,648 యూనిట్లతో పోలిస్తే, 289 శాతం (7,664 యూనిట్లు) వృద్ధిని మోదు చేసింది.


Click it and Unblock the Notifications








