హ్యుందాయ్ ఆర్ఎన్22ఇ (Hyundai RN22e), ఐయానిక్ 6ఎన్ హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కార్ల ఆవిష్కరణ
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai) ఓ సరికొత్త హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. హ్యుందాయ్ ఆర్ఎన్22ఇ (Hyundai RN22e) పేరుతో కంపెనీ ఈ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను విడుదల చేసింది. ఆర్ఎన్22ఇ కాన్సెప్ట్ వాహనాన్ని హ్యుందాయ్ యొక్క పెర్ఫార్మెన్స్ బ్రాండ్ అయిన ఎన్ డివిజన్ (N Division) ప్రత్యేకంగా తయారు చేసింది మరియు ఇది హ్యుందాయ్ ఎన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ ఫ్యూచర్ ను ప్రతిభింభింపజేస్తుంది. ఈ కారుకి సంబంధించిన మరిన్ని ఆసక్తిర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

హ్యుందాయ్ ఆర్ఎన్22ఇ స్పెసిఫికేషన్లు మరియు కొలతలు
హ్యుందాయ్ ఆర్ఎన్22ఇ డ్యూయల్ మోటార్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ప్రతి యాక్సిల్‌పై ఒక్కొక్క ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ డ్యూయల్ మోటార్ పవర్‌ట్రైన్ గరిష్టంగా 577 బిహెచ్‌పి (430kW) పవర్ ను మరియు 740 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులోని శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ల సాయంతో ఆర్ఎన్22ఇ ఎలక్ట్రిక్ కారు అతి తక్కువ సమయంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఈ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కారు గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ టాప్ స్పీడ్ తో పరుగులు తీస్తుంది.

హ్యుందాయ్ RN22e కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ టార్క్ వెక్టరింగ్ కోసం ట్విన్ క్లచ్‌లతో సహా కొన్ని పెర్ఫార్మెన్స్ భాగాలను కూడా కలిగి ఉంటుంది. ఈ పెర్ఫార్మెన్స్ భాగాల కారణంగా, ఆర్ఎన్22ఇ కాన్సెప్ట్ కారు మూలలో (కార్నరింగ్‌లో) మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని హ్యుందాయ్ పేర్కొంది. ట్రాక్ పనితీరును మెరుగుపరిచే ఇతర లక్షణాలలో 400 మిమీ హైబ్రిడ్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి మరియు నాలుగు పిస్టన్ కాలిపర్‌లు ఉన్నాయి. ఆర్ఎన్22ఇ కాన్సెప్ట్ కారు యొక్క బరువును అదుపులో ఉంచేందుకు కంపెనీ ఇందులో 3D-ప్రింటెడ్ భాగాలను కూడా ఉపయోగించింది.

ఇక అసలు విషయమైన బ్యాటరీ ప్యాక్ దగ్గరకు వస్తే, హ్యుందాయ్ ఆర్ఎన్22ఇ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కారులో శక్తివంతమైన 77.4 kWh బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించారు. ఇది హ్యుందాయ్ మోటార్ గ్రూప్ యొక్క E-GMP ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది మరియు 800V ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలను కూడా సపోర్ట్ చేస్తుంది. హ్యుందాయ్ ఆర్ఎన్22ఇ చార్జింగ్ సమయాన్ని పరిశీలిస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 18 నిమిషాలలోపే 10 నుండి 80 శాతం వరకు బ్యాటరీ ప్యాక్‌ను వేగంగా ఛార్జ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

హ్యుందాయ్ ఆర్ఎన్22ఇ కొలతలను గమనిస్తే, ఇది 4,915 మిమీ పొడవు, 2,023 మిమీ వెడల్పు మరియు 1,479 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కారులో 2,950 మిమీ పొడవాటి వీల్ బేస్ ఉంటుంది.

హ్యుందాయ్ ఆర్ఎన్22ఇ కాన్సెప్ట్ డిజైన్
హ్యుందాయ్ ఆర్ఎన్22ఇ కాన్సెప్ట్ యొక్క డిజైన్, కంపెనీ ఇటీవలే ఆవిష్కరించిన ఐయానిక్ 6 (Ioniq 6) యొక్క స్ట్రీమ్‌లైనర్ ఎలక్ట్రిక్ సెడాన్ ఆధారంగా రూపొందించబడింది. అయితే, హ్యుందాయ్ ఐయానికి 6 మాదిరిగా కాకుండా కొత్త ఆర్ఎన్22ఇ కాన్సెప్ట్ పనితీరుపై ఎక్కువ దృష్టి పెట్టింది మరియు కొంచెం పొడవుగా మరియు వెడల్పుగా కూడా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ కారు ముందు భాగంలో పెద్ద ఎయిర్ ఇన్‌టేక్, చంకీ ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, పెద్ద రియర్ డిఫ్యూజర్ మరియు భారీ రియర్ వింగ్‌ను కలిగి ఉంటుంది.

హ్యుందాయ్ యొక్క ఎన్ డివిజన్, ఆర్ఎన్22ఇ కాన్సెప్ట్ తో పాటుగా ఎన్ విజన్ 74 (N Vision 74) అని పిలువబడే మరొక కాన్సెప్ట్ ఈవీని కూడా ఆవిష్కరించింది. హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ డివిజన్ హెడ్ థామస్ స్కీమెరా ఈ కాన్సెప్ట్ కార్ల గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతూ, "మా మొత్తం ఉత్పత్తి శ్రేణి యొక్క వ్యూహాత్మక అభివృద్ధిలో, ప్రత్యేకించి మా విద్యుదీకరించబడిన, అధిక-పనితీరు గల వాహనాలలో RN22e మరియు N Vision 74 కాన్సెప్ట్ వాహనాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మా పరిశోధనా ల్యాబ్‌లు మా అత్యంత అధునాతన సాంకేతికతల యొక్క నిరంతర అభివృద్ధిని సూచిస్తాయి. ఈ ప్రత్యేకమైన విధానం మనల్ని సాంకేతికంగా మరింత ముందుకు తీసుకెళ్లడానికి మరియు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంచుతుంది" అని అన్నారు.

హ్యుందాయ్ బ్రాండ్ కి చెందిన గో-ఫాస్టర్ ఎన్ డివిజన్ ఇప్పటి వరకూ హై-పెర్ఫార్మెన్స్ గ్యాసోలీన్ కార్లను మాత్రమే తయారు చేస్తూ వచ్చింది. కాగా, ఇప్పుడు ఈ కొత్త హ్యుందాయ్ ఆర్ఎన్22ఇ కాన్సెప్ట్ తో ఈ పెర్ఫార్మెన్స్ బ్రాండ్ మొదటిసారిగా ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది. దాని వేగవంతమైన భాగాలతో, ఆర్ఎన్22ఇ ఇటీవలే ఆవిష్కరించబడిన హ్యుందాయ్ ఐయోనిక్ 6 ఎలక్ట్రిక్ సెడాన్ యొక్క భవిష్యత్తు ఎన్ వెర్షన్ ఎలా ఉండబోతోందో మనకు ఓ అవగాహనను కల్పిస్తోంది. - మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








