టెస్లా డిమాండ్లకు నో చెప్పిన భారత ప్రభుత్వం.. ఇంతకీ టెస్లా డిమాండ్ ఏమంటే?
అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) ఎప్పటినుంచో భారతదేశంలో అడుగుపెట్టడానికి వేచి చూస్తోంది. అయితే ఇందులో భాగంగానే కంపెనీ సీఈఓ ఎలోన్ మస్క్ దిగుమతి చేసుకునే కార్లపైన టాక్స్ తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎలోన్ మస్క్ యొక్క అభ్యర్థనను మరో సారి తిరస్కరించింది.

భారతదేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి టాక్స్ 100% వరకు ఉంటుంది. కావున దీనికి బదులుగా భారత ప్రభుత్వం స్థానిక ఉత్పత్తులను మరియు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. కావున టెస్లా యొక్క డిమాండ్ లను ఒప్పుకోలేదు. ఇది టెస్లా సీఈఓ కి మరో షాక్.

మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా టెస్లా భారతదేశంలోకి ప్రవేశించడానికి చాలా ఎదురు చూస్తూనే ఉంది. అయితే దీనిపైనా కంపెనీ కూడా అధికారిక తేదీని వెల్లడించ లేదు. ఇదే విషయం గురించి కంపెనీ సీఈవో ఎలోన్ మస్క్ ని ప్రభుత్వం ప్రశ్నించినప్పుడు, ప్రభుత్వంతో ఇంకా చాలా సవాళ్లు కొనసాగుతున్నాయని చెప్పారు.

భారతదేశంలోని కార్లపై ఉన్న అధిక టాక్స్ లను తగ్గించాలని టెస్లా చాలా రోజులుగా భారత ప్రభుత్వాన్ని కోరుతూనే ఉంది. అయితే దీనిని ఇప్పటికే భారత ప్రభుత్వం చాలా సార్లు తిరస్కరించింది.

టెస్లా కంపెనీ భారతీయ మార్కెట్లో ప్రవేశించాలని సన్నాహాలు సిద్ధం చేస్తోంది, కానీ స్థానికంగా ఉత్పత్తి చేయాలనే ఆలోచనను మాత్రం పెడచెవిన పెడుతోంది. అయితే టెస్లా కార్లకు భారతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటే తయారీ కూడా దేశంలోనే చేసే ఆలోచనలు ఉన్నాయి. కంపెనీ దేశీయ మార్కెట్లో మరో మూడు మోడళ్లను తీసుకురావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కావున ఇప్పుడు కంపెనీ మొత్తం 7 మోడల్స్ ని తీసుకురానుంది.

ఇదిలా ఉండగా, ఇటీవల ఎలోన్ మస్క్ ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వంతో సవాళ్లను అధిగమించడంపై ఎలోన్ మస్క్ గతంలో చేసిన ట్వీట్‌పై తెలంగాణ పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి KTR స్పందించారు. ఇందులో భాగంగానే తెలంగాణలో తన కంపెనీ ఏర్పాటు చేయడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి టెస్లాతో భాగస్వామి కావడం పట్ల తెలంగాణ రాష్ట్రం సంతోషంగా ఉంటుందని , దానికి కావలసిన మౌలిక సదుపాయాలను రాష్ట్రం కల్పిస్తుందని ఆయన అన్నారు.

మరో వైపు దేశంలోని చాలా రాష్ట్రాలు టెస్లా తయారీ యూనిట్ కోసం ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడు వంటి రాష్ట్రాలు ఆహ్వానం పలికాయి. మొత్తానికి టెస్లా కంపెనీ 2019 లోనే భారతీయ మార్కెట్లో అడుగుపెట్టాలని ఆసక్తి చూపింది. అయితే భారత ప్రభుత్వం యొక్క ఆంక్షలు కారణంగానే ఇది ఆలస్యం అవుతూనే ఉంది.

భారతదేశంలో దిగుమతి చేసుకున్న కార్లపై 60 శాతం నుండి 100 శాతం వరకు కస్టమ్స్ టాక్స్ ఉంటుంది. భారతదేశంలో టాక్సులు ప్రపంచంలోకెల్లా ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి తమ వాహనాలు ప్రవేశించాలంటే టాక్స్ తగ్గించాలని మస్క్ ఇంతకుముందే చెప్పారు

కానీ మస్క్ చేసిన ఈ వాదన చాలా మంది భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల ఆగ్రహాన్ని కలిగించింది. ఇది స్థానిక తయారీలో పెట్టుబడులను నిరుత్సాహపరుస్తుందని భావించారు. 2021 ఆగస్ట్ నెలలో టెస్లా తన నాలుగు కార్ మోడల్‌లకు హోమోలోగేషన్ సర్టిఫికేట్‌లను అందుకుంది.

టెస్లా తన డీలర్‌షిప్‌లను భారతదేశంలో కూడా ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ కంపెనీ ఇందులో మెట్రో నగరాలకు మొదటి స్థానం అందించింది. కావున ఈ డీలర్‌షిప్‌లు ఢిల్లీ, బెంగుళూరు, ముంబై వంటి నగరాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే కంపెనీ బెంగుళూరులోని టెస్లా ఇండియా మోటార్స్ & ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో భారతదేశంలో నమోదు చేసుకుంది. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపైన టెస్లా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం తెలియాలి.


Click it and Unblock the Notifications








