జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ ఎడిషన్ (Jeep Compass Trailhawk Edition) వస్తోంది.. టీజర్ విడుదల: వివరాలు
అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం జీప్ (Jeep) బ్రాండ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ (Jeep Compass Trailhawk Edition ) యొక్క రగ్గడ్ వెర్షన్ త్వరలోనే భారత మార్కెట్లో విడుదల కాబోతోంది. ఈ మేరకు కంపెనీ ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది. జీప్ బ్రాండ్ గత సంవత్సరం తమ కంపాస్ ట్రైల్‌హాక్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. ఇప్పుడు 2022లో దశలవారీగా వివిధ మార్కెట్లలో విడుదల అవుతోంది.

జీప్ ఇండియా ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ కంపాస్ ట్రైల్‌హాక్ టీజర్ ను విడుదల చేయడాన్ని చూస్తుంటే, త్వరలోనే ఈ కొత్త మోడల్ భారత మార్కెట్లో విక్రయానికి రానున్నట్లు తెలుస్తోంది. జీప్ కంపాస్ యొక్క ప్రోడక్ట్ లైనప్ లో టాప్-ఆఫ్ ది లైన్ వేరియంట్ ను ఆధారంగా చేసుకొని కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లతో ఈ ట్రైల్‌హాక్ ఎడిషన్ ను తయారు చేయనున్నారు. జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ భారత మార్కెట్లో ఆఫ్-రోడ్ ప్రయోజనాలను ఉద్దేశించి తయారు చేసిన ఎస్‌యూవీగా విడుదల చేయబడుతుంది.

కంపాస్ ట్రైల్‌హాక్ ఎస్‌యూవీలో 4X4 స్టాండర్డ్ డ్రైవ్‌ట్రెయిన్ ఉంటుంది. అంతేకాకుండా, కంపెనీ ఈ కారులో కొన్ని ప్రత్యేకమైన డిజైన్ అంశాలను కూడా జోడించబోతోంది. ఈ కొత్త డిజైన్ అంశాలలో, ప్రత్యేకమైన బంపర్, గ్రిల్, బాడీ పెయింట్ మరియు అల్లాయ్ వీల్స్ వంటి మార్పులను చూడవచ్చు. అంతేకాకుండా, జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ లో రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్‌లు మరియు రివైజ్డ్ ఫ్రంట్ గ్రిల్ రూపంలో ప్రత్యేక కాస్మెటిక్ హైలైట్‌లు కూడా ఉంటాయని భావిస్తున్నారు.

అదనంగా, ఈ ఎస్‌యూవీలో కొత్త అల్లాయ్ వీల్స్, ట్వీక్డ్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు మరియు విలక్షణమైన గ్రాఫిక్‌లు కూడా ఉంటాయి. ఇంటీరియర్‌ల విషయానికొస్తే, సాధారణ జీప్ కంపాస్ తో పోలిస్తే, ఈ ట్రైల్‌హాక్ ఎడిషన్ ను వేరు చేయడానికి ఇందులో ప్రత్యేక స్టైలింగ్ ఎలిమెంట్‌లను అందించనున్నారు. ఇంకా ఇందులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సరికొత్త యుకనెక్ట్ 5 సిస్టమ్‌తో కూడిన ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా అందించనున్నారు.

డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ సౌలభ్యం సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ వంటి మరెన్నో అధునాతన టెక్నాలజీ ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ఇవే కాకుండా, అమెజాన్ అలెక్సా సపోర్ట్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ మరియు ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్ (OTA) వంటి ఫీచర్లు కూడా ఈ కారు సపోర్ట్ చేస్తుంది.

భద్రత పరంగా చూసుకుంటే, జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ ఎడిషన్ లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, పానిక్ బ్రేక్ అసిస్ట్, రెడీ అలర్ట్ బ్రేకింగ్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్ మరియు బ్రేక్ లాక్ డిఫరెన్షియల్, రెయిన్ బ్రేక్ సపోర్ట్, సెలెక్ట్ టెర్రైన్ 4x4 సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

ఇక చివరిగా ఇంజన్ విషయానికి వస్తే, జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ ఎడిషన్ లో కంపెనీ శక్తివంతమైన 2.0-లీటర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 165 బిహెచ్‍పి పవర్ ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ లేటెస్ట్ జీప్ ఎస్‌యూవీ బ్రాండ్ యొక్క సెలెక్ట్ టెర్రైన్ సిస్టమ్‌తో కూడిన ఫోర్-వీల్-డ్రైవ్ సెటప్‌ను కూడా పొందుతుంది.

భారత మార్కెట్లో జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ ఎఢిషన్ ధర సుమారు రూ.30 లక్షల నుండి రూ.35 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండవచ్చని అంచనా. జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (CMF) పై నిర్మించబడుతోంది. భారత మార్కెట్లో ఇది మార్చి 2022 లో విడుదల కావచ్చని సమాచారం. ఇది ఈ విభాగంలో ఎమ్‌జి హెక్టర్, హ్యుందాయ్ క్రెటా వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ కొత్త మోడల్ గురించి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో తెలియనున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








