EV6 బుకింగ్స్ ప్రారంభించిన Kia Motors: బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా?
దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం 'కియా మోటార్స్' (Kia Motors) భారతీయ మార్కెట్లో తన ఉనికిని నిరంతరం చాటుకుంటూనే ఉంది. అయితే ప్రస్తుతం ఆటో మొబైల్ మార్కెట్ ఎలక్ట్రిక్ వాహన తయారీవైపు పరుగులు తీస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కియా కంపెనీ త్వరలో దేశీయ మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ కారు 'ఈవి6' (EV6) విడుదల చేయడానికి సన్నద్ధమైంది. అయితే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని మార్కెట్లో విడుదల చేయకముందే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుని బుక్ చేసుకోవడానికి ఇప్పుడు రూ. 3 లక్షల టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. మొత్తం భారతదేశంలోని 12 నగరాలలో ఎంపిక చేసిన 15 డీలర్‌షిప్‌లలో కంపెనీ తన బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించింది. బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

భారతీయ మార్కెట్లో ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు 2022 జూన్ 2 న అధికారికంగా విడుదల కానుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతానికి కేవలం 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. కావున కొనుగోలుదారులు ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా బుక్ చేసుకున్న వారికి త్వరగా డెలీవరీలు జరుగుతాయి. కొనుగోలుదారులు దీనిని గుర్తుంచుకోవాలి.

మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త కియా EV6 ఎలక్ట్రిక్ కారు భారతదేశానికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా తీసుకురాబడుతుంది. కావున దీని ధర కూడా కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క ధర లాంచ్ సమయంలో తెలుస్తుంది.

కియా కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కొత్త EV6 ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (E-GMP) పై ఆధారపడి నిర్మిచబడుతుంది. ఇది బ్రాండ్ యొక్క భవిష్యత్తులో రానున్న ఎలక్ట్రిక్ వాహనాలకు ఆధారం అవుతుంది. ఈ ఆధునిక ఎలక్ట్రిక్ కారు ఆధునిక డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది.

కియా EV6 యొక్క డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో వాలుగా ఉండే రూఫ్ దీనిని మరింత అద్భుతంగా చూపిస్తుంది. ఇది యాంగ్యులర్ రియర్ విండోస్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్ మరియు పెద్ద రియర్ విండ్‌స్క్రీన్ వంటి వాటిని పొందుతుంది. మొత్తం మీద ఇది కొత్త డిజైన్ పొందుతుంది, తద్వారా దీని పనితీరు కూడా మరింత మెరుగ్గా ఉంటుంది.

కియా ఈవీ6 ఇంటీరియర్ కూడా చెప్పుకోదగ్గ విధంగానే ఉంది. క్యాబిన్‌లో డ్రైవర్ స్క్రీన్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఇవ్వబడుతుంది. ఇది కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, టూ-స్పోక్ స్టీరింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్స్-అప్ డిస్‌ప్లే మరియు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారులో 77.4kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది మరియు ఇది 320bhp యొక్క మిశ్రమ అవుట్‌పుట్ కలిగిన రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లకు శక్తినిస్తుంది. ఇది 50kW DC ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే 350kW DC ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటికీ అనుకూలంగా ఉన్నందున ఈ బ్యాటరీలను చాలా వేగంగా చార్జ్ చేయవచ్చు.

ఈ కారును 50kW DC ఫాస్ట్ చార్జర్ తో 10 నుండి 80 శాతానికి చార్జ్ చేయడానికి 73 నిమిషాల సమయం పడుతుంది. అదే 350kW DC ఫాస్ట్ చార్జర్ తో అయితే, కేవలం18 నిమిషాల్లోనే ఈ బ్యాటరీని 80 శాతానికి చార్జ్ చేయవచ్చు. కియా ఈవీ6 దాదాపు 528 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే వాస్తవ ప్రపంచంలో ఈ పరిధి తగ్గే అవకాశం ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 5.2 సెకన్లలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఇందులో ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ అనే 3 డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. ఈ మోడ్‌లలో ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకమైన థ్రోటల్ మరియు స్టీరింగ్ పనితీరును కలిగి ఉంటుంది. స్పోర్ట్స్ మోడ్‌లో, కియా ఈవీ6 గరిష్టంగా గంటకు 192 కిమీ టాప్ స్పీడ్ తో దూసుకుపోతుంది.

కియా ఈవి6 ఇటీవల ANCAP ద్వారా క్రాష్ టెస్ట్ చేయబడింది. ఇందులో కియా ఈవి6 ఏకంగా 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. ఈ టెస్ట్ లో కంపెనీ యొక్క ఈ కొత్త కార్ పెద్దల సేఫ్టీ విషయంలో 38 పాయింట్లకు గాను 34.48 పాయింట్స్ స్కోర్ చేసి 5 స్టార్ రేటింగ్ పొందింది. ఇక పిల్లల భద్రత విషయంలో 49 పాయింట్లకు గాను 42.96 పాయింట్స్ స్కోర్ చేసింది. మొత్తం మీద ఇది సురక్షితమైన వాహనంగా మార్కెట్లో విడుదల కానుంది. ఇటీవల మేము ఈ కియా ఈవి6 టెస్ట్ డ్రైవ్ చేసాము. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








