భారత మార్కెట్లో కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారు విడుదల..
కొరియన్ కార్ కంపెనీ కియా మోటార్స్ భారత మార్కెట్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు కియా ఈవీ6 (Kia EV6) ను నేడు (జూన్ 2, 2022) అధికారికంగా విడుదల చేసింది. దేశీయ విపణిలో కియా ఈవీ6 ప్రారంభ ధర రూ.59.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది. ఇది రెండు వేరియంట్లలో విడుదల చేయబడింది. ఇందులో మొదటిది జిటి-లైన్ (GT-Line), ఇది రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ తో లభిస్తుంది. ఇకపోతే, రెండవది జిటి-లైన్ ఏడబ్ల్యూడి (GT-Line AWD), ఇది ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ తో లభిస్తుంది.

కియా ఇండియా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈవీ6 కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ప్రారంభంలో భాగంగా, కేవలం మొదటి 100 యూనిట్లకు మాత్రమే బుకింగ్ లను ఓపెన్ చేసినట్లు కంపెనీ ప్రకటించింది. మొదటి బ్యాచ్‌లో ఈ 100 యూనిట్ల కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కార్లను కంపెనీ విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. ఆసక్తిగల కస్టమర్లు కియా అధీకృత డీలర్‌షిప్ నుండి కానీ లేదా అధీకృత వెబ్‌సైట్ నుండి కానీ బుక్ చేసుకోవచ్చు.కియా ఈవీ6 డెలివరీలు సెప్టెంబర్ నెల నుండి ప్రారంభం కానున్నాయి.

కియా ఈవీ6 ధర ప్రకటించడానికి ముందే మొదటి బ్యాచ్ (100 యూనిట్లు) అప్పుడే పూర్తిగా అమ్ముడైపోయాయని, ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఇప్పటి వరకూ 355 యూనిట్ల బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ తెలిపింది. కియా ఈవీ6 కారుకి భారతదేశం నుండి వస్తున్న అధిక డిమాండ్ ఆధారంగా, ఇక్కడి మార్కెట్ కు కేటాయింపులను పెంచాలని కంపెనీ యోచిస్తోంది. అంటే, త్వరలోనే కియా ఈ ఎలక్ట్రిక్ కారు కోసం రెండు మరియు మూడవ బ్యాచ్ లను విదేశాల నుండి ఇక్కడి దిగుమతి చేసుకునే అవకాశం ఉంది.

ఇది మూన్‌స్కేప్, స్నో వైట్ పెర్ల్, రన్‌వే రెడ్, అరోరా బ్లాక్ పెర్ల్ మరియు యాచ్ బ్లూ అనే ఐదు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంటుంది.
కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారు చూడటానికి క్రాసోవర్ మాదిరిగా కనిపిస్తుంది. నిజానికి, ఇది హ్యుందాయ్ విక్రయిస్తున్న ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కార్ ప్లాట్‌ఫామ్‌ను పంచుకుంటుంది. సన్నటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, అగ్రెసివ్‌గా కనిపించే ఫ్రంట్ బంపర్, బానెట్‌పై ఉబ్బినట్లుగా ఉండే బాడీ లైన్స్ మరియు సన్నటి ఫ్రంట్ గ్రిల్‌తో ఇది ముందు వైపు నుండి మజిక్యులర్ లుక్‌ని కలిగి ఉంటుంది. సైడ్ డిజైన్ చాలా క్లీన్ గా ఉంటుంది, ఇక్కడ స్పోర్టీ అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కారు వెనుక భాగంలో డ్యూయెల్ టోన్ బంపర్, బూట్ లిప్ స్పాయిలర్ పొడవునా సాగే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ఆకట్టుకుంటాయి.

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, కియా ఈవీ6 క్యాబిన్ చాలా సింపుల్ అండ్ క్లీన్ డిజైన్ ను కలిగి ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ లేవుట్ కార్బన్ ఫైబర్ టెక్స్చర్‌లో చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్ మధ్య నుండి స్టీరింగ్ వెనుక భాగం వరకూ ఒకే గ్లాస్ ప్యానెల్‌లో అమర్చిన రెండు డిస్‌ప్లే యూనిట్‌లు ఉంటాయి. ఈ యూనిట్స్ డ్రైవర్ వైపు వాలుగా ఉన్నట్లు ఉంటాయి, కాబట్టి వీటని డ్రైవర్ సులువుగా యాక్సెస్ చేయగలడు. స్టీరింగ్ వెనుక భాగంలో ఉన్న 12.3 ఇంచ్ డిస్‌ప్లే యూనిట్ డ్రైవర్ సమాచారం కోసం ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ గా ఉపయోగించబడుతుంది.

ఇకపోతే, డ్యాష్‌బోర్డ్ మధ్యలో ఉన్న రెండవ 12.3 ఇంచ్ డిస్‌ప్లే యూనిట్ ప్రయాణీకుల వినోదం కోసం ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ గా ఉపయోగించబడుతుంది. ఇంకా ఇందులో ఆల్-ఎల్ఈడి లైట్స్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, డ్యూయెల్ టోన్ సెంటర్ కన్సోల్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, Apple CarPlay మరియు Android Auto కనెక్టివిటీ, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు, డోర్ ప్యానెళ్లపై డ్యూయెల్ టోన్ ఫినిషింగ్స్, 14 స్పీకర్లతో కూడిన మెరీడియన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, స్మార్ట్ పవర్ టైల్ గేట్, షిఫ్ట్ బై వైర్ టెక్నాలజీ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

పవర్‌ట్రైన్ విషయానికి వస్తే, ఈ రెండు వేరియంట్లు కూడా ఒకే రకమైన బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉంటాయి. ఇందులో 77.4 కిలోవాట్అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇది కారు ప్లాట్‌ఫామ్‌లోనే అమర్చబడి ఉంటుంది. పూర్తి చార్జ్ పై ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్టంగా 528 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ లను సపోర్ట్ చేస్తుంది. ఈ కారును 350 కిలోవాట్ డిసి ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 18 నిమిషాల్లో 0-80 శాతం బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అదే 50 కిలోవాట్ డిసి ఫాస్ట్ చార్జర్ సాయంతో అయితే కేవలం 73 నిమిషాల్లో 0-80 శాతం బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు.

పెర్ఫార్మెన్స్ మరియు రేంజ్ విషయానికి వస్తే, కియా ఈవీ6 జిటి-లైన్ (రియర్ వీల్ డ్రైవ్) వేరియంట్‌లోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 229 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, కియా ఈవీ6 జిటి-లైన్ ఏడబ్ల్యూడి (ఆల్-వీల్ డ్రైవ్) వేరియంట్ గరిష్టంగా 325 బిహెచ్‌పి శక్తిని మరియు 605 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.5 సెకన్లలో గంటకు 0-100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. కియా ఈవీ యొక్క గరిష్ట వేగాన్ని గంటకు 192 కిమీ పరిమితం చేశారు. కియా ఈవీ6 RWD వేరియంట్ పూర్తి ఛార్జ్‌పై 528 కిమీ మరియు AWD వేరియంట్ పూర్తి చార్జ్ పై 425 కిమీ రేంజ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 12 నగరాలు మరియు 15 డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా కియా ఈవీ6 అందుబాటులో ఉంటుంది. కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కార్ వారంటీ విషయానికి వస్తే, ఇందులో మోటార్‌పై 3 సంవత్సరాలు లేదా అపరిమిత కిలోమీటర్లు మరియు బ్యాటరీ పై కోసం 8 సంవత్సరాలు లేదా 1.60 లక్షల కిమీల వారంటీని కంపెనీ అందిస్తోంది.

ఇక ఈ ఎలక్ట్రిక్ కారులోని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే..
- 8 ఎయిర్‌బ్యాగ్‌లు
- అన్ని చక్రాల డిస్క్ బ్రేక్‌లు
- యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్ (ABS)
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)
- హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC)
- మల్టీ కొలైజన్ బ్రేక్ అసిస్ట్ (MCBA)
- బ్రేక్ అసిస్టెంట్ సిస్టమ్ (BAS)
- వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM)
- ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ (ESS)
- మాన్యువల్ స్పీడ్ లిమిట్ అసిస్ట్ (MSLA)
- ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు
- ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్
- ఫార్వర్డ్ కొలైజన్ అవైడెన్స్ అసిస్ట్ (FCA) కారు
- ఫార్వర్డ్ కొలైజన్ అవైడెన్స్ అసిస్ట్ (FCA) పాదచారులు
- ఫార్వర్డ్ కొలైజన్ అవైడెన్స్ అసిస్ట్ (FCA) సైక్లిస్ట్
- ఫార్వర్డ్ కొలైజన్ అవైడెన్స్ అసిస్ట్ (FCA) జంక్షన్ టర్నింగ్
- లేన్ కీప్ అసిస్ట్ (LKA)
- బ్లైండ్-స్పాట్ కొలిజన్ అవైడెన్స్ అసిస్ట్ (BCA)
- వెనుక క్రాస్ ట్రాఫిక్ అవైడెన్స్ అసిస్ట్ (RCTA)
- సేఫ్ ఎగ్జిట్ అసిస్ట్ (SEA)
- లేన్ ఫాలో అసిస్ట్ (LFA)
- డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ (DAW)
- స్టాప్ అండ్ గో ఫంక్షనాలిటీతో కూడిన స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ (SCC)

కియా ఈవీ6 ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్లు:

ఈ కారులోని ఇతర ఫీచర్లను గమనిస్తే, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటివి ఉన్నాయి. అంతే కాకూండా ఇందులో రిమోట్ ఫోల్డింగ్ 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు, ఫ్రంట్ వన్ టచ్ ఆటో అప్/డౌన్ పవర్ విండోస్, వెంటిలేటెడ్ డ్రైవర్ మరియు ప్యాసింజర్ సీట్లు, మెమరీ ఫంక్షన్‌తో కూడిన 10-వే అడ్జస్టబల్ డ్రైవర్ అండ్ ఫ్రంట్ ప్యాసింజర్ పవర్ సీట్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఎయిర్ కండీషనర్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు (నార్మల్/ ఎకో/ స్పోర్ట్), రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, పుష్ బటన్ స్టార్ట్ తో కూడిన స్మార్ట్ కీ, రియర్ డీఫాగర్, టైర్ మొబిలిటీ కిట్ (TMK) మరియు వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ మొదలైనవి ఉన్నాయి.ఇటీవల మేము కియా ఈవి6 టెస్ట్ డ్రైవ్ కూడా చేసాము. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








