కారెన్స్ 7-సీటర్ ఎమ్‌పివి రాకతో జోరందుకున్న కియా సేల్స్.. ఏప్రిల్ 2022లో 18 శాతం వృద్ధి!
కొరియన్ కార్ బ్రాండ్ కియా ఇండియా (గతంలో కియా మోటార్స్) భారత మార్కెట్లో సరసమైన ధరకే ప్రవేశపెట్టిన 7-సీటర్ ఎమ్‌పివి కియా కారెన్స్ (Kia Carens) రాకతో ఈ బ్రాండ్ అమ్మకాలు మరింత జోరందుకున్నాయి. ఇప్పటికే సెల్టోస్ మరియు సోనెట్ మోడళ్లకు డిమాండ్ బలంగా ఉన్న నేపథ్యంలో, కంపెనీ తాజాగా కారెన్స్ ఎమ్‌పివిని ఎర్టిగా మరియు ఇన్నోవా మోడళ్లకు పోటీగా ప్రవేశపెట్టింది. ఈ ఎమ్‌పివి మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. సరసమైన ధర, ప్రీమియం డిజైన్ మరియు విశిష్టమైన ఫీచర్లతో ఇది కస్టమర్లను ఇట్టే ఆకట్టుకుంటోంది.

కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కియా ఇండియా గత నెలలో దేశీయ మార్కెట్లో మొత్తం 19,019 యూనిట్ల కార్ల విక్రయించింది. ఏప్రిల్ 2021 నెలతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కియా ఇండియా మొత్తం అమ్మకాలు 18 శాతం వృద్ధి చెందాయి. అయితే, నెలవారీ విక్రయాలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. ఈ కంపెనీ గడచిన మార్చి 2022లో మొత్తం 22,622 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఈ సమయంతో పోలిస్తే, గడచిన ఏప్రిల్‌లో కంపెనీ అమ్మకాలు 16 శాతం పడిపోయాయి.

గత నెలలో, కియా సెల్టోస్ కంపెనీ విక్రయాలకు ప్రధాన సహకారం అందించింది. ఏప్రిల్ 2022 నెలలో మొత్తం 7,506 యూనిట్ల కియా సెల్టోస్ ఎస్‌యూవీలు విక్రయించబడగా, ఏప్రిల్ 2021 నెలలో ఇవి 8,086 యూనిట్లుగా ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కియా నుండి తాజాగా మార్కెట్లో విడుదలైన కారెన్స్ ఎమ్‌పివి గడచిన నెలలో 5,754 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కియా సేల్స్ భారీగా పెరగడానికి ఈ మోడల్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక కియా సోనెట్ అమ్మకాల విషయానికి వస్తే, గడచిన నెలలో ఇవి 5,404 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే, గతేడాది ఇదే సమయంలో కియా సోనెట్ అమ్మకాలు 7,724 యూనిట్లుగా ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే, సోనెట్ అమ్మకాలు స్వల్పంగా క్షీణిస్తున్నట్లు అనిపిస్తోంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే, కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అమ్మకాలు 30 శాతం క్షీణించాయి. ఇక కియా అందిస్తున్న ప్రీమియం లగ్జరీ ఎమ్‌పివి కార్నివాల్ అమ్మకాలలో మాత్రంపెద్దగా తేడా కనిపించలేదు. గతేడాది ఏప్రిల్ నెలలో ఇవి 301 యూనిట్లు నమోదు కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇవి 355 యూనిట్లు అమ్ముడయ్యాయి.

కియా ఇండియా భారత మార్కెట్‌లోకి ప్రవేశించిన అతికొద్ది కాలంలోనే అందరూ ఆదరించే బ్రాండ్‌గా మారిపోయింది. ఇందుకు ప్రధాన కారణం, కంపెనీ అందించే విశిష్టమైన ఉత్పత్తులేనని చెప్పవచ్చు. ఈ సెగ్మెంట్లోని ఇతర బ్రాండ్లతో పోల్చుకుంటే, అధునాతన ఫీచర్లతో కూడిన వాహనాలను కంపెనీ సరసమైన ధరలకే అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికితోడు, ఈ కొరియన్ కంపెనీ భారతదేశంలోనే ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, స్థానికంగా తమ వాహనాలను ఇక్కడే ఉత్పత్తి చేస్తోంది. కంపెనీ పోర్ట్ ఫోలియోలో మూడు మేడ్ ఇన్ ఇండియా కార్లు ఒక ఇంపోర్టెడ్ కారు ఉంది.

కియా కారెన్స్ ఎమ్‌పివి విషయానికి వస్తే, ఈ లేటెస్ట్ కియా మోడల్ కోసం ఇప్పటికే 50,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ మొత్తం బుకింగ్స్ లో దాదాపు 21,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు భారతదేశంలోని టైర్ 3 నగరాల నుండే వచ్చాయి. దానికి తోడు, ఈ ఎమ్‌పివి యొక్క పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్‌లకు డిమాండ్ సమానంగానే ఉంది. కారెన్స్ మార్కెట్లోకి వచ్చిన అతికొద్ది సమయంలోనే చాలా పాపులర్ అయ్యింది. ఈ ఎమ్‌పివి ఫిబ్రవరి 2022లో కంపెనీ 5,300 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.

ఇదిలా ఉంటే, కియా ఇండియా దేశీయ విపణిలో ఓ ఎలక్ట్రిక్ వాహనాన్ని (EV) కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కియా అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న కియా ఈవీ6 (Kia EV6) ఎలక్ట్రిక్ కారును కంపెనీ ఇక్కడి మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. సమాచారం ప్రకారం, కియా ఈవీ6 కోసం బుకింగ్‌లు మే 26న ప్రారంభం కానున్నాయి. ప్రారంభంలో, కియా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పూర్తిగా విదేశాలలో తయారు చేసిన యూనిట్‌గా, సిబియూ రూట్‌లో భారతదేశంలోకి దిగుమతి చేసుకోనుంది.

కియా మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మే 2021లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. కాగా, ఇది భారత మార్కెట్ కు రావడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. కియా ఈవీ e-GMP గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది మరియు ఇది బ్రాండ్ యొక్క వ్యతిరేక డిజైన్ ఫిలాసఫీని ఉపయోగిస్తుంది. కియా ఈవీ6 చాలా స్పోర్టీ మరియు ఏరోడైనమిక్ డిజైన్ ను కలిగి ఉంటుంది. దాని ఏరోడైనమిక్ డిజైన్ కారణంగా, ఈవీ6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పనితీరు కూడా మరింత మెరుగ్గా ఉండబోతోందని కంపెనీ పేర్కొంది.

ఇందులో స్లోపింగ్ రూఫ్, యాంగ్యులర్ రియర్ విండోస్, ఎల్ఈడి హెడ్‌లైట్, ఎల్ఈడి స్ట్రిప్ టెయిల్ లైట్ మరియు పెద్ద రియర్ విండ్‌స్క్రీన్ వంటి ఎక్స్టీరియర్ డిజైన్ హైలైట్స్ ఉంటాయి. కియా ఈవీ6 ఇంటీరియర్ చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. దీని క్యాబిన్‌లో, డ్రైవర్ స్క్రీన్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉంటుంది. ఇందులో లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ, టూ-స్పోక్ స్టీరింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) హెడ్స్-అప్ డిస్‌ప్లే మరియు ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి సేఫ్టీ ఫీచర్‌లను కలిగి ఉంటుందని సమాచారం.


Click it and Unblock the Notifications








