భారతదేశంలో లెక్సస్ సర్టిఫైడ్ ప్రోగ్రామ్ (Lexus Certified Programme) ప్రారంభం.. అసలు ఇదేంటి..?
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టొయోటా యొక్క లగ్జరీ కార్ బ్రాండ్ లెక్సస్ (Lexus), భారతదేశంలో ఓ కొత్త ప్రీ-ఓన్డ్ కార్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. సెకండ్ హ్యాండ్ లెక్సస్ లగ్జరీ కార్ల కోసం కంపెనీ లెక్సస్ సర్టిఫైడ్ ప్రోగ్రామ్ (Lexus Certified Programme) అనే ప్రోగ్రామ్ ను లాంచ్ చేసింది.
Recommended Video
లెక్సస్ సర్టిఫైడ్ ప్రోగ్రామ్ క్రింది కంపెనీ సర్టఫై చేసి, అన్ని విధాలుగా ధృవీకరించబడిన నాణ్యమైన సెకండ్ హ్యాండ్ కార్లను కస్టమర్లకు విక్రయిస్తుంది. అధిక ధరలను చెల్లించి నేరుగా కొత్త లెక్సస్ కార్లను కొనుగోలు చేయలేని కస్టమర్లకు, సరసమైన ధరలో నాణ్యమైన ప్రీ-ఓన్డ్ లెక్సస్ కార్లను అందించాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది.

వాడిన లెక్సస్ బ్రాండ్ కార్లను కంపెనీ నేరుగా కస్టమర్ల నుండి కొనుగోలు చేసి, వాటిని పూర్తిగా తనిఖీ చేసి, అవసరమైతే మరమ్మత్తులు చేయడం లేదా విడిభాగాలను మార్చడం చేసి తర్వాత, కంపెనీ వాటిని సర్టిఫై చేస్తుంది. ఈ సర్టిఫికేషన్ వలన భారతదేశంలో లెక్సస్ బ్రాండ్ యొక్క ప్రాముఖ్యత మరింత బలోపేతం అవుతుంది మరియు ఇది మొత్తం లెక్సస్ యాజమాన్య అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రీ-ఓన్డ్ లెక్సస్ కార్ల కోసం కంపెనీ సమగ్రమైన 203-పాయింట్ ఇన్‌స్పెక్షన్ మరియు లెక్సస్ సర్టిఫికేషన్‌ను అందజేస్తుంది. అంటే, తమ వద్దకు వచ్చిన పాత లెక్సస్ కార్లను కంపెనీ టెక్నీషియన్లు క్షుణ్ణంగా తనిఖీ చేసి, అవి ఉపయోగానికి సిద్ధంగా ఉన్నాయని సర్టిఫై చేస్తుంది. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఇలాంటి ఖరీదైన కార్లను నేరుగా తెలియని వ్యక్తుల నుండి కొనుగోలు చేసి చిక్కుల్లో పడకుండా ఉండేందుకు ఈ ప్రత్యేకమైన ప్రీ-ఓన్డ్ ప్రోగ్రామ్ సహాయపడుతుంది.

లెక్సస్ బ్రాండ్ నుండి నేరుగా ప్రీ-ఓన్డ్ కార్లను కొనుగోలు చేయడం వలన కస్టమర్లు థర్డ్ పార్టీ బ్రోకర్లు/డీలర్ల నుండి మోసపోకుండా ఉంటారని, అంతేకాకుండా తమ వద్ద నుండి ప్రీ-ఓన్డ్ కార్లను కొనుగోలు చేయడం వలన కస్టమర్లు పూర్తి మనశ్శాంతిగా ఉండొచ్చని కంపెనీ తెలిపింది. లెక్సస్ ప్రీ-ఓన్డ్ కార్లను నేరుగా కంపెనీ డీలర్‌షిప్ నుండి కొనుగోలు చేయడం ద్వారా కంపెనీ వాటిపై 24 నెలలు లేదా 30,000 కిలోమీటర్లు (ఏది ముందుగా ముగిస్తే అది) సమగ్ర వారంటీని అందిస్తుంది.

అంతేకాకుండా, లెక్సస్ సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు 3 వరకు కాంప్లిమెంటరీ సేవలను (సర్వీస్) పొందవచ్చు. కంపెనీ చేసే సమగ్ర 203 పాయింట్ల తనిఖీలో వాడిన లెక్సస్ కార్ల యొక్క అన్ని కీలక విషయాలను చెక్ చేస్తారు. ప్రతి కారు యొక్క డాక్యుమెంటేషన్, నాణ్యత స్థాయి మరియు సర్వీస్ హిస్టరీ అంశాలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే వాటిని ధృవీకరించడం జరుగుతుంది.

లెక్సస్ సర్టిఫైడ్ ప్రోగ్రామ్ ప్రారంభించిన సందర్భంగా లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ నవీన్ సోనీ మాట్లాడుతూ, లెక్సస్ కార్లు ప్రపంచవ్యాప్తంగా తమ లగ్జరీ మరియు విశ్వసనీయతకు ప్రసిద్ధి చెందినవని, లెక్సస్ సర్టిఫైడ్ ప్రోగ్రామ్‌తో, తాము భారతదేశంలోని తమ కస్టమర్లకు అదనపు స్థాయి హామీని పరిచయం చేస్తున్నామని అన్నారు. ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లో తాము వాడిన లెక్సస్ కార్ల యొక్క నాణ్యత, డాక్యుమెంటేషన్ మరియు సర్వీస్ పై తగిన శ్రద్ధ వహించడంతో పాటుగా, సదరు కార్లపై 24 నెలల వరకు వారంటీని అందిస్తున్నామని చెప్పారు.

భారతదేశంలో లెక్సస్ బ్రాండ్ కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, ఈ కంపెనీ తమ సికొత్త 'లెక్సస్ ఎన్ఎక్స్ 350హెచ్' (Lexus NX 350H) క్రాసోవర్ ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. భారత విపణిలో ఈ కొత్త కొత్త 'లెక్సస్ ఎన్ఎక్స్ 350హెచ్' ధర రూ. 64.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. ఈ లగ్జరీ కారులో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, టర్న్ ఇండికేటర్లతో కూడిన స్లిమ్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, ముందు భాగంలో పెద్ద సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, పొడవాటి హుడ్ మరియు కనెక్టెడ్ ఎల్ఈడి టెయిల్-ల్యాంప్స్‌తో చాలా ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉంటుంది.

లెక్సస్ ఎన్ఎక్స్ 350హెచ్ లగ్జరీ క్రాసోవర్ లో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో కూడిన పెద్ద 9.8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 14 ఇంచ్ నావిగేషన్ సిస్టమ్, డ్రైవర్ సమాచారం కోసం డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10 స్పీకర్లతో కూడిన లెక్సస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ మరియు సరికొత్త మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ మొదలైనవి ఉన్నాయి. ఇంకా ఇందులో 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు మరియు ఆటోమేటిక్ వైపర్‌లు, కలర్ హుడ్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, పానోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ ఫ్రంట్ సీట్లు మరియు ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ రియర్ సీట్లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ విషయానికి వస్తే, ఈ లగ్జరీ కారులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఎలక్ట్రానికి స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో పాటుగా ఇతర అధునాతన భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఇది హైబ్రిడ్ పవర్‌ట్రైన్ సెటప్ తో వస్తుంది. ఇందులోని 2.5-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 192 బిహెచ్‌పి పవర్ ను విడుదల చేస్తుంది. కాగా, ఇందులో ఎలక్ట్రిక్ మోటార్‌తో కలిపి గరిష్టంగా 244 బిహెచ్‌పి పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఎలక్ట్రానికల్‌గా కంట్రోల్ చేయబడే 6-స్పీడ్ సివిటి గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








