కొత్త మోడళ్ల రాకతో పరుగులు పెడుతున్న మహీంద్రా సేల్స్.. పెరుగుతున్న వెయిటింగ్ పీరియడ్!
ప్రముఖ దేశీయ యుటిలిటి వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న కొత్త తరం మహీంద్రా థార్ మరియు సరికొత్త ఎక్స్‌యూవీ700 వంటి వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా, కంపెనీ అమ్మకాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. గడచిన మార్చి 2022 నెలలో మహీంద్రా మొత్తం 54,643 యూనిట్ల వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (మార్చి 2021 నెలలో) కంపెనీ విక్రయించిన 40,403 యూనిట్తో పోలిస్తే, గత నెల అమ్మకాలు 35 శాతానికి పైగా పెరిగాయి.

మహీంద్రా గ్రూప్ భారతదేశంలో వివిధ ఆటోమొబైల్ విభాగాలలో వాహనాలను విక్రయిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే 2022లో చాలా వరకు విభాగాలు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. అయితే, గత ఏడాదితో పోలిస్తే, మూడు చక్రాల (త్రీ వీలర్) వాహనాల విక్రయాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. మహీంద్రా ఆటోస్ మార్చి 2022లో 27,380 యూనిట్ల యుటిలిటీ వెహికల్స్ (UVలు) విక్రయించింది. కాగా, గతేడాది ఇదే సమయంలో వీటి అమ్మకాలు కేవలం 16,643 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. అంటే, ఈ సమయంలో యుటిలిటి వాహనాల విక్రయాలు ఏకంగా 65 శాతం పెరిగాయి.

ఇకపోతే, మార్చి 2022 లో కార్లు మరియు వ్యాన్‌ల మొత్తం అమ్మకాల సంఖ్య 223 యూనిట్లుగా ఉంది. ఇవి తక్కువగానే అనిపించినప్పటికీ, మార్చి 2021లో మహీంద్రా విక్రయించిన 57 యూనిట్లతో పోలిస్తే మాత్రం ఇవి 291 శాతం వృద్ధిని సాధించాయి. మహీంద్రా తన ప్యాసింజర్ వెహికల్ లైనప్‌లో ప్రధానంగా మహీంద్రా కెయూవీ100, మహీంద్రా ఎక్స్‌యూవీ300, మహీంద్రా బొలెరో, మహీంద్రా స్కార్పియో, మహీంద్రా మరాజో, మహీంద్రా ఎక్స్‌యూవీ700 మరియు మహీంద్రా అల్టూరాస్ జి4 వంటి యుటిలిటీ వాహనాలను విక్రయిస్తోంది.

గత నెలలో యుటిలిటీ వెహికల్స్ మరియు కార్ల అమ్మకాలను రెండింటిని కలుపుకుంటే, మహీంద్రా ఆటోస్ మార్చి 2022లో మొత్తం 27,603 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే సమయంలో, మహీంద్రా ఆటోస్ కేవలం 16,700 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 65 శాతం వృద్ధి చెందాయి. ఇక వాణిజ్య వాహన విభాగం విషయానికి వస్తే, మహీంద్రా మార్చి 2022 లో 2 టన్నుల సామర్థ్యంతో కూడిన 3,806 యూనిట్ల LCV (లైట్ కమర్షియల్ వెహికల్) పికప్ ట్రక్కులను విక్రయించింది.

కాగా, మార్చి 2021లో 2 టన్నుల సామర్థ్యం కలిగిన వాణిజ్య వాహనాలను కంపెనీ కేవలం 1,641 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఈ సమయంలో ఈ వాహనాలు 132 శాతం వృద్ధిని కనబరచాయి. అలాగే, మార్చి 2022లో కంపెనీ 2T-3.5T LCV సెగ్మెంట్ లో 15,202 యూనిట్లను విక్రయించగలిగింది. గతేడాదితో పోల్చుకుంటే, ఈ విభాగపు అమ్మకాలు స్వల్పంగా 4 శాతం మేర వృద్ధి చెందాయి. అలాగే, 3.5 టన్నుల సెగ్మెంట్ పైన ఉన్న వాణిజ్య వాహనాల విక్రయాలు కూడా 5 శాతం వృద్ధిని సాధించి 829 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఇదివరకు చెప్పినట్లుగా, గత నెలలో త్రీ-వీలర్ అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. మార్చి 2022లో మహీంద్రా 4,043 యూనిట్ల ఆటోలను విక్రయించింది. ఈ సమయంలో త్రీవలర్ అమ్మకాలు 9 శాతం తగ్గాయని కంపెనీ తెలిపింది. చివరగా, ఎగుమతుల విషయానికి వస్తే, మహీంద్రా గడచిన మార్చి 2022 నెలలో మొత్తం 3,160 యూనిట్లను ఎగుమతి చేసింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే, మహీంద్రా వాహనాల ఎగుమతులు 49 శాతం వృద్ధిని సాధించాయి.

మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వస్తోంది.. జులై 2022లో ఆవిష్కరణ
ఇదిలా ఉంటే, ఈ ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra), ఇటీవలే తమ సరికొత్త ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700) ఎస్‌యూవీని అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల చేసి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటున్న సంగతి తెలిసినదే. కొత్త తరం థార్ మరియు సరికొత్త ఎక్స్‌యూవీ700 మోడళ్ల లాంచ్ తో వరుస విజయాలను దక్కించుకున్న మహీంద్రా, ఇప్పుడు మరో అతిపెద్ద లాంచ్ కు సిద్ధమవుతోంది. ఈసారి కంపెనీ ఎలక్ట్రిక కారును తీసుకురాబోతున్నట్లు తమ టీజర్ లో వెల్లడించింది.

ఈ టీజర్ ను బట్టి చూస్తుంటే, మహీంద్రా అండ్ మహీంద్రా ప్రవేశపెట్టబోయే తమ తర్వాతి కారు, గతంలో కంపెనీ విక్రయించిన కార్ల కన్నా ఎంతో భిన్నంగా, ఫూచరిస్టిక్ గా ఉండబోతోందని తెలుస్తోంది. కంపెనీ విడుదల చేసిన టీజర్ చూస్తే, ఎవరికైనా ఈ విషయం స్పష్టమవుతోంది. ఈ టీజర్ ప్రకారం, మహీంద్రా తమ కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని జులై 2022 లో అధికారికంగా ఆవిష్కరించనుంది. ప్రస్తుతానికి కంపెనీ ఇంకా ఈ కారుకి ఎలాంటి పేరును నిర్ధారించలేదు. ఇది గ్లోబల్ మార్కెట్లలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

మహీంద్రా అండ్ మహీంద్రా ప్రస్తుతం మూడు కొత్త ఎలక్ట్రిక్ కార్లపై పని చేస్తోంది మరియు కంపెనీ వీటికి బోర్న్ ఎలక్ట్రిక్ రేంజ్ (Born Eelectric Range) అని పేరు పెట్టింది. ఈ మూడు మోడళ్లలో మహీంద్రా నుండి ముందుగా ఓ ఎస్‌యూవీ మోడల్ మార్కెట్లోకి రావచ్చని ఈ టీజర్ చిత్రాలను చూస్తుంటే అర్థమవుతుంది. ప్రస్తుతం, దేశంలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, కంపెనీ ముందుగా ఈ విభాగంలో తమ ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








