తక్కువ వెయిటింగ్ పీరియడ్‌తో మహీంద్రా ఎక్స్‌యూవీ700, థార్ వాహనాలను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా?
మీరు సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700) లేదా కొత్త తరం మహీంద్రా థార్ (Mahindra Thar) ఎస్‌యూవీలను కొనుగోలు చేయాలని చూస్తున్నారా..? అయితే, మీరు వీటిని మహీంద్రా యొక్క కొత్త వెహికల్ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ద్వారా సులువుగా సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఈ విధానం ద్వారా సుదీర్ఘ నిరీక్షణ వ్యవధి (వెయిటింగ్ పీరియడ్)ను కూడా నివారించవచ్చు. మహీంద్రా తమ ఫ్లాగ్‌షిప్ మోడళ్లలో కొన్నింటిని సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లో అందించడానికి వెహికల్ లీజింగ్ ప్లాట్‌ఫారమ్ సంస్థ అయిన క్విక్‌లీజ్ (Qyicklyz) తో చేతులు కలిపింది.

మహీంద్రా వాహనాల కోసం ఈ లేటెస్ట్ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ మహీంద్రా ఆటో వెబ్‌సైట్ మరియు దాని డీలర్‌షిప్ నెట్‌వర్క్ తో పాటుగా Qyicklyz లో కూడా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి, ఈ లీజింగ్ సేవలను దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, పూణే, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, బెంగళూరు, హైదరాబాద్ మరియు చెన్నైతో సహా ఎనిమిది నగరాల్లో అందిస్తున్నారు. ఈ నగరాల్లో నివసిస్తున్న వినియోగదారులకు మహీంద్రా సబ్‌స్క్రిప్షన్ మోడల్ అందుబాటులో ఉంటుంది.

కస్టమర్లు ఈ మహీంద్రా కార్లను సబ్‌స్క్రిప్షన్ మోడల్ ద్వారా నెలవారీ ప్రారంభ అద్దె రూ. 21,000 తో సొంతం చేసుకోవచ్చు. ఈ నెలవారీ అద్దెలో (సబ్‌స్క్రిప్షన్) లో బీమా ఖర్చు, నిర్వహణ మరియు రోడ్‌సైడ్ అసిస్టెన్ లు కలిసి ఉంటాయి. అంతేకాకుండా, ఈ విధానం కోసం కంపెనీ ఎలాంటి అదనపు డౌన్ పేమెంట్ ను కూడా వసూలు చేయడం లేదు. ఈ లీజింగ్ విధానం పట్ల ఆసక్తిగల కస్టమర్లు 24 నెలల నుండి 60 నెలల వరకు మహీంద్రా కార్లను అద్దెకు తీసుకోవచ్చు.

మహీంద్రా పేర్కొన్న సమాచారం ప్రకారం, కస్టమర్‌లు సంవత్సరానికి 10,000 పరిమిత కిలోమీటర్ల నుండి వివిధ రకాల వార్షిక కిలోమీటర్ల ఎంపికల నుండి ఎంచుకోవడానికి సౌలభ్యాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా, మహీంద్రా తన కస్టమర్లకు సబ్‌స్క్రిప్షన్ పీరియడ్ ముగిసే సమయానికి వారు ఇష్టపడే వాహనాలను తిరిగి, కొనుగోలు చేయడానికి లేదా కొత్త మోడల్‌కి అప్‌గ్రేడ్ చేయడానికి కూడా అవకాశం కల్పిస్తుంది.

మహీంద్రా మరియు క్విక్‌లీజ్ సంస్థ మధ్య కుదిరిన ఈ భాగస్వామ్యంలో భాగంగా, క్విక్‌లజ్ ఇ-కామర్స్ ఫ్లీట్ ఆపరేటర్ల కోసం మహీంద్రా యొక్క ట్రియోలోడ్ వాహనాలను అందిస్తోంది. Quicklyz భాగస్వామ్యంతో నవంబర్ 2021లో మహీంద్రా ఫైనాన్స్ వెహికల్ లీజింగ్ ప్లాట్‌ఫామ్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసినదే. మహీంద్రా యొక్క ప్యాసింజర్ మరియు కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌లో సబ్‌స్క్రిప్షన్ మోడల్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.

క్విక్‌లీజ్ ఒక మల్టీ-బ్రాండ్ వాహనాలను అందించే కంపెనీ, ప్రస్తుతం ఇది ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో అతిపెద్ద పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ఇందులో మహీంద్రా, టాటా మోటార్స్, మెర్సిడెస్-బెంజ్, ఎమ్‌జి మోటార్స్, ఆడి, జాగ్వార్ మరియు పియాజియో వంటి అసలైన పరికరాల తయారీదారుల (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యాన్యుఫాక్చరర్ - OEM) ల నుండి ఎలక్ట్రిక్ త్రిచక్ర మరియు నాలుగు-చక్రాల వాహనాలు ఉన్నాయి.

క్విక్‌లీజ్ తెలిపిన సమాచారం ప్రకారం, ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారిస్తుంది మరియు వినియోగదారులకు ఈ తరహా వాహనాలను సరసమైన మరియు అవాంతరాలు లేని పద్ధతిలో అందించడానికి వీలుకు ఒక ఉత్తేజకరమైన ప్లాట్‌ఫారమ్‌ను సృష్టిస్తుంది. ఇవన్నీ 2070 నాటికి కార్బన్-న్యూట్రల్‌గా మారాలన్న భారతదేశ నిబద్ధతకు అనుగుణంగా ఉంటాయి. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రకారం, కొత్త EV లాంచ్‌లలో ఎప్పటికప్పుడు పెరుగుతున్న సాంకేతిక లక్షణాలకు అనుగుణంగా కస్టమర్‌లు తమ వాహనాన్ని 2-3 సంవత్సరాలలో అప్‌గ్రేడ్ చేసుకునే సౌలభ్యాన్ని కలిగి ఉంటారు.

ఇదిలా ఉంటే, మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ విపణిలో విక్రయిస్తున్న థార్ మరియు ఎక్స్‌యూవీ700 మోడళ్లతో పాటుగా అన్ని రకాల ప్యాసింజర్ వెహికల్ (PV) మోడళ్ల కోసం దేశవ్యాప్తంగా సేవా శిబిరాన్ని (సర్వీస్ క్యాంపైన్) ను నిర్వహిస్తోంది. అన్ని మహీంద్రా డీలర్‌షిప్‌లలో ఫిబ్రవరి 19 వరకు ఈ క్యాంపు నిర్వహించబడుతుంది. ఈ సర్వీస్ క్యాంపులో భాగంగా ప్యాసింజర్ వాహనాలకు 75 చెకప్ లు చేస్తామని, ఇది పూర్తిగా ఉచితం అని మహీంద్రా ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ జనరల్ చెకప్ సమయంలో ఏదైనా మరమ్మతులు జరిగితే, వినియోగదారులు విడి భాగాలు మరియు ఉపకరణాలపై ఐదు శాతం తగ్గింపు మరియు లేబర్ ఖర్చుపై 10 శాతం తగ్గింపును కూడా పొందవచ్చని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, ఈ సమయంలో వినియోగదారులు కొనుగోలు చేసే రోడ్-సైడ్ అసిస్టెన్స్ (RSA)పై 15 శాతం తగ్గింపును కూడా పొందవచ్చని పేర్కొంది. వినియోగదారులకు త్వరితగతిన సేవలను అందించేందుకు అన్ని కేంద్రాలను సిద్ధం చేశామని, వాటిలో జనరల్ మెయింటినెన్స్ సర్వీస్ లేదా చిన్న మరమ్మతులు 90 నిమిషాల్లోనే పూర్తవుతాయని కంపెనీ తెలిపింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ (Mahindra XUV300 Facelift)
మహీంద్రా అండ్ మహీంద్రా భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మహీంద్రా ఎక్స్‌యూవీ300' (Mahindra XUV300) లో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మహీంద్రా నుండి మంచి ప్రజాదరణ పొందిన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను ఈ ఏడాది మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications