థార్, ఎక్స్‌యూవీ700 మోడళ్లకు తగ్గని డిమాండ్.. గత నెలలో రెండింతలు పెరిగిన సేల్స్..
భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా, గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మకాల రేసులో దూసుకుపోతోంది. కంపెనీ విడుదల చేసిన సరికొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీ మరియు కొత్త ఎక్స్‌యూవీ700 వంటి మోడళ్లకు ఉన్న బలమైన డిమాండ్ కారణంగా, కంపెనీ అమ్మకాలు ప్రతినెలా స్థిరమైన వృద్ధిని కనబరుస్తున్నాయి. కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం, మహీంద్రా గడచిన మే 2022 నెలలో మొత్తం 53,726 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే, ఇవి రెండింతలకు పైగా వృద్ధిని చెందాయి.

మహీంద్రా గడచిన మే 2022 నెలలో మొత్తం 26,632 ఎస్‌యూవీలను విక్రయించించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ భారతదేశంలో కేవలం 7,748 స్పోర్ట్ యుటిలిటీ వాహనాలను విక్రయించింది. ఈ సమయంలో మహీంద్రా ఎస్‌యూవీ అమ్మకాలు 244 శాతం భారీ వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. అలాగే, ఏప్రిల్ 2022 నెలలో కంపెనీ విక్రయించిన 22,168 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో విక్రయాలు 20 శాతం నెలవారీ వృద్ధిని నమోదు చేశాయి.

గత నెలలో ప్యాసింజర్ వాహన విభాగంలో మహీంద్రా విక్రయించిన మొత్తం వాహనాలు 26,904 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో కంపెనీ 2,028 యూనిట్లను పలు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి కూడా చేసింది. కాగా, మే 2021 నెలలోలో మహీంద్రా యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్లో 7,748 యూనిట్లను మరియు ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో 8,004 యూనిట్లను విక్రయించింది. వాణిజ్య వాహన విభాగంలో మహీంద్రా ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసింది.

ఈ సందర్భంగా మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా మాట్లాడుతూ, "మే నెలలో, మేము ఎక్స్‌యూవీ700 మరియు థార్‌తో సహా మా బ్రాండ్‌లన్నింటితో మంచి పనితీరును కనబరుస్తూ వృద్ధిని కొనసాగించాము. ఈ కార్లకు మేము బలమైన బుకింగ్‌లను చూస్తున్నాము మరియు బలమైన పైప్‌లైన్‌ను కూడా కలిగి ఉన్నాము. త్వరలోనే మేము స్కార్పియో-ఎన్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించాము. ఇది ఇప్పటికే మార్కెట్లో మంచి హైప్ ను సృష్టిస్తోంది మరియు ఇది తప్పకుండా మహీంద్రా నుండి మరో బ్లాక్‌బస్టర్ అవుతుందని భావిస్తున్నాం" అని చెప్పారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 కోసం ఇంకా 78,000 మంది వెయిటింగ్..
మహీంద్రా ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన తమ ఫ్యూచరిస్టిక్ ఎస్‌యూవీ XUV700 ని కొనుగోలు చేసిన కస్టమర్లు ఇంకా డెలివరీ కోసం వెయిటింగ్ చేస్తూనే ఉన్నారు. మహీంద్రా ఈ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసినప్పటి నుండి ఇప్పటి వరకూ (8 నెలల్లో) భారతదేశంలో 30,000 యూనిట్ల ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలను కస్టమర్లకు అంద జేసింది. అయితే, ఈ కారు డెలివరీ కోసం ఇంకా సుమారు 78,000 మందికి పైగా కస్టమర్లు వెయిట్ చేస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

కోవిడ్-19 తెచ్చిన సెమీకండక్టర్ చిప్ షార్టేజ్ కారణంగా కంపెనీ ఈ కారును పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతోంది. గత నెలలో ఆనంద్ మహీంద్రా కూడా తన భార్య కోసం ఓ ఎక్స్‌యూవీ700 కారుని బుక్ చేశానని, దాని డెలివరీ కోసం తాను కూడా క్యూలో వేచి ఉన్నానని ట్విట్టర్ లో వెల్లడించారు. సమాచారం ప్రకారం, ప్రస్తుతం, మహీంద్రా ఎక్స్‌యూవీ700 లో కొన్ని వేరియంట్‌ల కోసం వెయిటింగ్ పీరియడ్ 24 నెలల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఎస్‌యూవీ యొక్క 'AX' వేరియంట్‌లతో పోలిస్తే బేస్ 'MX' వేరియంట్ చాలా తక్కువ నిరీక్షణ వ్యవధిని కలిగి ఉన్నట్లు సమాచారం.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 కోసం వస్తున్న బుకింగ్‌లలో ఎక్కువ భాగం డీజిల్ వేరియంట్‌లకు సంబంధించినవే అధికంగా ఉన్నాయి. ఫలితంగా, మహీంద్రా ఎక్స్‌యూవీ700 యొక్క పెట్రోల్ వేరియంట్‌ల వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉంటోంది. వెయిటింగ్ పీరియడ్ ను తగ్గించేందుకు మహీంద్రా ఈ ఎస్‌యూవీ ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో, రానున్న రోజుల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700 యొక్క వెయిటింగ్ పీరియడ్ తగ్గుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం, ఇది సగటున ప్రతినెలా 4,000 యూనిట్లకు పైగా అమ్ముడవుతోంది.

జూన్ 27న కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ (Scorpio-N) విడుదల
ఇదిలా ఉంటే, ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా తమ నెక్స్ట్ జనరేషన్ స్కార్పియోని ఈనెల అధికారికంగా విడుదల చేయనుంది. జూన్ 27, 2022వ తేదీన తమ కొత్త తరం స్కార్పియోను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మహీంద్రా తెలిపింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది కొత్త పేరుతో మార్కెట్లోకి రానుంది. సమాచారం ప్రకారం, దీనిని మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) పేరుతో విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న స్టాండర్డ్ స్కార్పియోకి ఎగువ ఈ ప్రీమియం స్కార్పియో-ఎన్ ను ప్రవేశపెట్టనున్నారు.

మహీంద్రా స్కార్పియో-ఎన్ లాడెర్-ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించబడనుంది. ఇది ప్రస్తుత స్కార్పియో కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. కొత్త తరం 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ పూర్తిగా సరికొత్త డిజైన్‌లో రాబోతోంది. అంతే కాకుండా, ఈ ఎస్‌యూవీ యొక్క ఫీచర్లు మరియు పరికరాలలో కూడా అనేక అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయి. కంపెనీ విక్రయిస్తున్న ఎక్స్‌యూవీ700 లో ఉపయోగిస్తున్న అవే టర్బోచార్జ్డ్ 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్లను కొత్త స్కార్పియోలో కూడా ఉపయోగించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్లు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ తో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications