కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ మోడల్ ఆధారంగా రానున్న మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్!
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా గడచిన 2020 సంవత్సరంలో విడుదల చేసిన కొత్త తరం థార్ ఎస్‌యూవీకి మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసినదే. మహీంద్రా థార్ ఎస్‌యూవీ కోసం ఉన్న భారీ వెయిటింగ్ పీరియడే దీని సక్సెస్ ను సూచిస్తుంది. ప్రస్తుతం, ఈ మోడల్ 3-డోర్ మరియు 4-సీటర్ వెర్షన్ గా మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, కంపెనీ ఇందులో 5-డోర్ వెర్షన్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. కొత్త 5-డోర్ థార్ ఎస్‌యూవీని మహీంద్రా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ మోడల్ ఆధారంగా తయారు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

మహీంద్రా థార్ యొక్క రాబోయే 5-డోర్ల వేరియంట్ తాము ఇటీవలే ప్రారంభించబడిన స్కార్పియో-ఎన్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుందని మహీంద్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు ఆటోమోటివ్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ హెడ్ ఆర్ వేలుసామి ధృవీకరించారు. కొత్త థార్ రాకతో థార్ ఎస్‌యూవీ లైనప్ లో కొనుగోలుదారులకు మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా, ఎస్‌యూవీ ఫేవరేట్ అయిన భారత మార్కెట్లోని వినియోగదారులకు ఈ 5-డోర్ వెర్షన్ థార్ చాలా ప్రాక్టికల్ గా కూడా ఉంటుంది.

మహీంద్రా థార్ విషయానికి వస్తే, ప్రస్తుతం భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలలో ఇది కూడా ఒకటి. ఈ ఎస్‌యూవీ ఐకానిక్ జీప్ స్టైలింగ్ ను కలిగి ఉండటమే కాకుండా, ఆఫ్టర్ మార్కెట్ లో ఇది అత్యధిక కస్టమైజేషన్ ఆప్షన్లను కూడా కలిగి ఉంటుంది. మహీంద్రా థార్ చివరి సారిగా 2010లో మేజర్ గా అప్‌డేట్ చేయబడింది. ఆ తర్వాత సరిగ్గా పదేళ్లకు, అంటే 2020లో మహీంద్రా తమ కొత్త తరం థార్ ఎస్‌యూవీని ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కు అనుగుణంగా లేటెస్ట్ డిజైన్ మరియు ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసింది.

ఈ కొత్త తరం థార్ ఎస్‌యూవీని వినియోగదారులు ఎక్కువగా ఆదరించారు. దాని మునుపటి తరం మోడల్ తో పోలిస్తే, కొత్త మహీంద్రా థార్ శుద్ధీకరణ, నిర్మాణ నాణ్యత, సౌలభ్యం, ఫీచర్లు మరియు పనితీరు పరంగా మెరుగుపరచబడింది. అంతే కాదు, కొత్త మహీంద్రా థార్ గ్లోబల్-ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను పొంది, దేశంలోని అత్యంత సురక్షితమైన ఎస్‌యూవీల సరసన చేరింది. సరికొత్త డిజైన్, టెక్నాలజీ మరియు ఫీచర్లతో వచ్చిన కొత్త తరం థార్ ఎస్‌యూవీ దాని మునుపటి తరం థార్ కన్నా ఎంతో అధునాతనంగా ఉంటుంది.

కొత్తగా స్కార్పియో-ఎన్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రాబోయే మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్ కూడా ఇదే రకమైన ఫీచర్లను మరియు డిజైన్ ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఖర్చును తక్కువగా ఉంచేందుకు కంపెనీ దాని ఇంజన్లలో కూడా ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ప్రస్తుతం, మహీంద్రా థార్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. ఇందులోని పెట్రోల్ వెర్షన్‌లో సరికొత్త 2.0 లీటర్ టి-జిడిఐ ఎమ్‌స్టాలియన్ ఇంజన్ ను ఉపయోగించగా, డీజిల్ వెర్షన్ లో 2.2 లీటర్ ఎమ్‌హాక్ ఇంజన్ ను ఉపయోగించారు.

థార్ ఎస్‌యూవీలోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 300 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్‌ను మరియు 320 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని డీజిల్ ఇంజన్ అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపికగా ఉంది. ఈ రెండు ఇంజన్లు కూడా 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి. మహీంద్రా థార్ ఫిక్స్డ్ హార్ట్ టాప్, సాఫ్ట్ టాప్ మరియు కన్వర్టిబుల్ టాప్ అనే మూడు రకాల రూఫ్ ఆప్షన్లలో విక్రయించబడుతోంది.

మహీంద్రా థార్ ఆఫ్-రోడ్ ఫ్రెండ్లీ ఎస్‌యూవీ కాబట్టి, ఇది షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఈ ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఆఫ్-రోడ్ ఔత్సాహికులకు ఉల్లాసభరితమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ ఎస్‌యూవీలో ఇన్ని అద్భుతమైన లక్షణాలు ఉన్నప్పటికీ, భారత కార్ ప్రియుల అభిరుచిని పరిగణనలోకి తీసుకుంటే మహీంద్రా థార్ కేవలం 3-డోర్ వెర్షన్ లో మాత్రమే లభిస్తున్న కారణంగా, ఇది క్యాబిన్ లోపల తక్కువ స్థలాన్ని కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో నరలుగురికి మాత్రమే చోటు ఉంటుంది మరియు పరిమిత లగేజ్ స్పేస్ మాత్రమే ఉంటుంది.

ఈ నేపథ్యంలో, మహీంద్రా థార్ యొక్క పాపులరాటీని దృష్టిలో ఉంచుకొని మరియు కంపెనీ అమ్మకాల వాల్యూమ్ ను పెంచుకునేందుకు ఇందులో ఓ 5-డోర్ల వేరియంట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ కథనంలో ముందుగా చెప్పినట్లుగా, కొత్త థార్ 5-డోర్ ఎస్‌యూవీ ఇటీవల విడుదల చేసిన Scorpio-N ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. అంటే, దీని అర్థం రాబోయే 5-డోర్ వెర్షన్ మహీంద్రా థార్ చాలా సౌకర్యవంతంగా మరియు స్థిరంగా ఉంటుంది. స్కార్పియో-ఎన్ పెంటా-లింక్ రియర్ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది మరియు ఇందులో అదనపు బరువును భర్తీ చేయడానికి మరింత శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ ఎంపికలను కూడా కంపెనీ నుండి ఆశించవచ్చు.


Click it and Unblock the Notifications








