మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీలో ఎలక్ట్రిక్ వెర్షన్.. 2023లో విడుదల!
భారతదేశంలో అందరికంటే ముందు 4-సీటర్ ఎలక్ట్రిక్ కార్లకు పరిచయం చేసింది మహీంద్రా సంస్థ. అయితే, ఆ తర్వాతి కాలంలో మహీంద్రా తమ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెటింగ్ చేసుకోవడంలో విఫలమైంది. రేంజ్ తక్కువగా ఉన్న కారణంగా మహీంద్రా ఇ-వెరిటో కారును కొనుగోలు చేసే కస్టమర్లు కూడా పరిమతింగానే ఉన్నాయి. ఇటీవలి కాలంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వేగం పుంజుకోవడంతో కంపెనీ ఇప్పుడు తిరిగి తమ ఎలక్ట్రిక్ వాహనాల పునరుద్ధరణకు స్వీకారం చుట్టింది.

భారతదేశపు ఎస్‌యూవీ స్పెషలిస్ట్ గా పేరుగాంచిన మహీంద్రా, ఇప్పుడు 2023 మొదటి త్రైమాసికంలో తమ అధునాతన ఎక్స్‌యూవీ300 (XUV300) ఎస్‌యూవీ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మహీంద్రా తొలిసారిగా 2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ300 ని కాన్సెప్ట్ రూపంలో ఆవిష్కరించింది. వచ్చే 2027 నాటికి మొత్తం 8 ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు మహీంద్రా వెల్లడించింది. వీటిలో XUV300 యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ మహీంద్రా నుండి రాబోయే మొదటి ఎలక్ట్రిక్ వాహనంగా ఉంటుందని భావిస్తున్నారు.

మహీంద్రా యొక్క కొత్త ఎక్స్‌యూవీ300 ఎలక్ట్రిక్ వెర్షన్ లాంచ్ గురించి కంపెనీ ఓ విలేకరుల సమావేశంలో తెలియజేసింది. కాగా, మహీంద్రా బోర్న్ ఎలక్ట్రిక్ లైనప్‌లో భాగంగా కంపెనీ వచ్చే నెలలో (జూలై 2022)లో మూడు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, అదే వేడుకలో కంపెనీ ఈ కొత్త XUV300 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా ఆవిష్కరించబడుతుందని భావిస్తున్నారు. మహీంద్రా బోర్న్ ఎలక్ట్రిక్ లైనప్‌ను ఇంగ్లండ్‌లో ఉన్న మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరోప్ స్టూడియో రూపొందించింది, ఇది కంపెనీ చీఫ్ డిజైన్ ఆఫీసర్, గతంలో టాటా మోటార్స్ సంస్థలో పనిచేసిన ప్రతాప్ బోస్ నేతృత్వంలో ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ దాని అంతర్గత దహన (ఐసి) ఇంజన్ మోడల్ కంటే పెద్దదిగా ఉంటుందని తెలుస్తోంది. ఎక్స్‌యూవీ300 ఎలక్ట్రిక్ వెర్షన్ 4.2 మీటర్ల పొడవు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అంటే, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ దాని అంతర్గత దహన ఇంజన్ వెర్షన్‌ల కంటే దాదాపు 200 మిమీ పొడవుగా ఉంటుంది. మరో నివేదిక ప్రకారం, గతంలో మహీంద్రా కొనుగోలు చేసిన కొరియన్ కార్ కంపెనీ శాంగ్‌యాంగ్ కు చెందిన టివోలి ఎస్‌యూవీ యొక్క పొడవైన శరీర నిర్మాణాన్ని ఉపయోగిస్తుందని సూచిస్తుంది. ఫలితంగా, ఇది దాని పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ మోడల్ కన్నా ఎక్కువ బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 యొక్క ICE పవర్డ్ వెర్షన్‌లు ప్రస్తుతం 4-మీటర్ మరియు సబ్-మీటర్ వాహనాలకు భారత ప్రభుత్వం అందించే ప్రయోజనాలను పొందేందుకు Tivoli యొక్క ప్లాట్‌ఫామ్ ను ఉపయోగిస్తున్నాయి. కాగా, కొత్తగా రాబోయే ఎలక్ట్రిక్ కారు 4 మీటర్ల కన్నా ఎక్కువ పొడవు ఉంటుంది కాబట్టి దీనికి ఎక్స్‌యూవీ400 (XUV400) అనే బ్యాడ్జ్‌ను ఉపయోగించవచ్చని సదరు నివేదిక సూచిస్తుంది.

కొత్త ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ300 లో ఉపయోగించబోయే పవర్‌ట్రెయిన్ గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ, ఇది నెక్సాన్ ఈవీ మాదిరిగా అంతే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుందని సమాచారం. టాటా నెక్సాన్ ఈవీ భారతీయ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో తిరుగులేని మార్కెట్ లీడర్ గా నిలిచింది. టాటా ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ యొక్క రెండు వెర్షన్‌లను విక్రయిస్తోంది. ఇటీవలే ఇందులో ఓ శక్తివంతమైన టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ను విడుదల చేసింది.

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ 40.1kWh బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉంటుంది, దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 417 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా ఉంది. ఈ నేపథ్యంలో, మహీంద్రా నుండి కొత్తగా రాబోయే ఎక్స్‌యూవీ300 ఎలక్ట్రిక్ వెర్షన్ టాటా నెక్సాన్ ఈవీకి గట్టి పోటీ ఇవ్వగలదని భావిస్తున్నారు.

మహీంద్రా ఇటీవలే ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌తో ఓ భాగస్వామ్యాన్ని కూడా ప్రకటించింది. ఇది జూలై 2022 లో ఆవిష్కరించబడే మహీంద్రా బోర్న్ ఎలక్ట్రిక్ విజన్ ఎస్‌యూవీల లైనప్ కోసం జర్మన్ ఆటోమోటివ్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ యొక్క MEB ప్లాట్‌ఫారమ్ నుండి భాగాలను పరీక్షించడాన్ని చూస్తుంది. వచ్చే 2023 ప్రారంభంలో ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ300 విడుదలతో, మహీంద్రా ఒకప్పుడు ఆధిపత్యం చెలాయించిన ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌కి తిరిగి రారాజుగా నిలుస్తుందని భావిస్తున్నారు.

జూన్ 27న మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) విడుదల
ఇదిలా ఉంటే, మహీంద్రా బ్రాండ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెక్స్ట్ జనరేషన్ స్కార్పియో విడుదల తేదీని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. జూన్ 27, 2022వ తేదీన ఈ కొత్త తరం స్కార్పియోని మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త తరం స్కార్పియోని కొత్త పేరుతో విడుదల చేయనున్నారు. సమాచారం ప్రకారం, మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) అనే పేరుతో ఇది విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న స్టాండర్డ్ స్కార్పియోతో పాటుగా, ఈ కొత్త స్కార్పియో-ఎన్ మోడల్ ను కూడా విక్రయించనున్నారు.


Click it and Unblock the Notifications