ఎలక్ట్రిక్ వాహన విభాగంలో సంచలనం రేపడానికి వచ్చేస్తున్న 'మహీంద్రా XUV400': వివరాలు
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' తన మొదటి ఎలక్ట్రిక్ కారుని భారతీయ విఫణిలో ఆవిష్కరించడానికి ఇంక ఎన్నో రోజులు లేదు. ఈ ఎలక్ట్రిక్ SUV కోసం ఇప్పటికే చాలామంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే కంపెనీ ఈ SUV లాంచ్ ఇక ఆలస్యం అయ్యే అవకాశం లేదు.
Recommended Video
మహీంద్రా కంపెనీ యొక్క మొదటి ఎలక్ట్రిక్ SUV అయిన XUV400 ఎప్పుడు ఆవిష్కరించబడుతుంది, దాని వివరాలు ఏమిటి అనే మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

మహీంద్రా కంపెనీ ఇప్పటికే అందించిన సమాచారం ప్రకారం ఈ XUV400 ఈ నెల 8 న అధికారికంగా ఆవిష్కరించబడుతుంది. ఈ SUV ఆవిష్కరణతో మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టనుంది. అయితే మార్కెట్లో ఇది బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇప్పటికే మహీంద్రా XUV400 కి సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. అయితే మళ్ళీ ఇప్పుడు మరో టీజర్ తీసుకువచ్చింది. గతంలో విడుదలైన టీజర్ లో ఎక్కువ సమాచారం వెల్లడికాలేదు. అయితే ఇప్పుడు విడుదలైన ఈ కొత్త టీజర్ రానున్న ఎలక్ట్రిక్ SUV గురించి చాలా సమాచారం వెల్లడించింది.

ఈ కొత్త టీజర్ లో XUV400 యొక్క డిజైన్ మరియు కలర్ వంటివి వెల్లడయ్యాయి. ఇది XUV300 ఆధారంగా రూపొందించబడింది. అయితే కంపెనీ మార్కెట్ కోసం ఇప్పటికే 5 ఎలక్ట్రిక్ కార్లను వెల్లడించింది. ఇవన్నీ కూడా బోర్న్ ఎలక్ట్రిక్ ప్లాన్ కింద ఉంటాయి. కావున ఇవన్నీ కూడా ప్రపంచ మార్కెట్ కోసం అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయబడతాయి.

ఈ టీజర్ లో మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ బ్లూ కలర్‌లో చాలా ఆక్షర్షణీయంగా కనిపిస్తుంది. ముందు భాగంలో దృఢమైన గ్రిల్ మరియు మధ్యలో బ్రాండ్ లోగో వంటివి చూడవచ్చు. ఈ లోగో కూడా బ్రాంజ్ కలర్ లో చూడముచ్చటాగా ఉంది. వీటితోపాటు ఎల్ ఆకారంలో ఉండే ఇంటిగ్రేటెడ్ LED DRL లతో పాటు LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ కూడా ఇందులో చూడవచ్చు. మొత్తం మీద ఫ్రంట్ డిజైన్ దాని XUV300 ని గుర్తుకుతెస్తుంది.

మహీంద్రా XUV400 యొక్క సైడ్ మౌంటెడ్ ఛార్జింగ్ పోర్ట్ కలిగి, మళ్లీ నెక్సాన్ ఈవిని పోలి ఉంటుంది. అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎంజీ జెడ్ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోన వంటి ఇతర ఎలక్ట్రిక్ కార్లు తమ ఛార్జింగ్ పోర్టును ముందు భాగంలో కలిగి ఉన్నాయి.

మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV 4.2 మీటర్ల పొడవుతో చాలా విశాలంగా విలాసవంతంగా ఉంటుంది. అదే సమయంలో ఇందులో ఒక పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టివిటీ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు ADAS వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా పొందనుంది. కావున ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇక రేంజ్ విషయానికి వస్తే, XUV400 ఎలక్ట్రిక్ కారు ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 350 కిమీ నుంచి 400 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. కావున దీనికోసం కంపెనీ 30kWh లేదా 40kWh బ్యాటరీ ఫ్యాక్స్ ఉపయోగించే అవకాశం ఉంది. అదే సమయంలో 50 కిలోవాట్ల డిసి ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి కేవలం 56 నిమిషాల్లో 0 నుండి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు.

మహీంద్రా కంపెనీ తన ఎలక్ట్రిక్ SUV ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని ధర రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఉంటుందని ఆశిస్తున్నాము. అయితే అధికారిక ధరలు ఇంకో రెండు రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా మహీంద్రా కంపెనీ దేశీయ మార్కెట్లో XUV.E8, XUV.E9, BE.05, BE.07 మరియు BE.09 అనే 5 ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ కార్లు అన్నీ కూడా ఆధునిక ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడతాయి. అదే సమయంలో ఇవి లేటెస్ట్ డిజైన్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటంతో పాటు మంచి భద్రతా సామర్థ్యాన్ని కూడా అందించనుంది. ఈ 5 ఎలక్ట్రిక్ కార్లు 2024 నుంచి 2026 లోపు అధికారికంగా విడుదలవుతాయని కంపెనీ తెలిపింది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
ఇప్పటివరకు దేశీయ మార్కెట్లో చాలా వాహన తయారీ సంస్థలు తమ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసి తమ ఉనికిని చాటుకుంటున్నాయి. అయితే ఇప్పటివరకు మహీంద్రా కంపెనీ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేయలేదు. కావున రానున్న XUV400 కంపెనీ యొక్క మొదటి ఎలక్ట్రిక్ SUV కానుంది. ఇది మరో రెండు రోజుల్లో దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు అప్పుడు అధికారికంగా వెల్లడి కానున్నాయి. మహీంద్రా XUV400 గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








