మహీంద్రా XUV700 లో ఇప్పుడు ఆ ఫీచర్స్ లేవు.. అయితే కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఏవంటే?
మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క ఆధునిక SUV 'ఎక్స్‌యూవీ700' (XUV700) భారతీయ మార్కెట్లో విడుదలైనప్పటినుంచి కూడా విపరీతమైన అమ్మకాలను పొందుతూ.. ఇప్పటికి కూడా దానికున్న డిమాండ్ ఏమాత్రం తగ్గనీయకుండా ముందుకు దూసుకెళ్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ SUV ని కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఎంత ఆసక్తి చూపుతున్నారో స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ ఆధునిక SUV లోని కొన్ని వేరియంట్స్ లో కొన్ని ఫీచర్స్ యాడ్ చేసింది, అదే సమయంలో కొన్ని వేరియంట్లలో ఫీచర్స్ తగ్గించింది. ఇంతకీ కంపెనీ ఏ ఫీచర్స్ యాడ్ చేసింది, ఏ ఫీచర్స్ తొలగించింది.. అనే మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం రండి.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఎక్స్‌యూవీ700 లోని MX, AX3, AX5, AX7 మరియు AX7 L వేరియంట్లలో మార్పులు జరిగాయని తెలుస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 ప్రస్తుతం కంపెనీకి ఎక్కువ అమ్మకాలు చేకూర్చుతున్న వాహనాల్లో ఒకటిగా ఉన్నప్పటికీ, ఎందుకు ఫీచర్స్ తొలగించింది అనే దాని గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

తొలగించబడిన ఫీచర్స్:
- MX వేరియంట్లో రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, రియర్ స్పాయిలర్ మరియు ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్ వంటివి తొలగించబడ్డాయి.
- AX3 వేరియంట్లో రియర్ వైపర్, డీఫాగర్ మరియు సెలెక్టివ్ అన్‌లాక్ వంటి ఫీచర్‌లను కోల్పోతుంది.
- AX5 మరియు AX7 వేరియంట్స్ ఎల్ఈడీ సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్‌లు ఇప్పుడు తొలగించబడ్డాయి.
- ఇక చివరగా AX7 L మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్‌లు స్టాప్ అండ్ గో ఫంక్షన్‌లతో కూడా అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్ కోల్పోతుంది.
- ఇప్పుడు కొత్త ఫీచర్స్ యాడ్ చేసిన తరువాత AX7 క్రూయిజ్ కంట్రోల్ పొందుతుంది.
- AX7 L వేరియంట్‌లు ఎల్ఈడీ సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్‌లను పొందుతుంది.
- AX7 L ఆటోమేటిక్ వేరియంట్ స్టాప్ అండ్ గో ఫంక్షన్‌లతో కూడా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ పొందుతుంది.

యాడ్ చేసిన ఫీచర్స్:

మహీంద్రా ఎక్స్‌యూవీ700 1.5 లక్షల బుకింగ్స్:
మహీంద్రా కంపెనీ తన ఎక్స్‌యూవీ700 కోసం బుకింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 1.5 లక్షల బుకింగ్స్ పొందింది. ప్రస్తుతానికి కంపెనీ 50,000 యూనిట్లను డెలివరీ చేసింది. ఇంకా 1 లక్ష యూనిట్లు డెలివరీ చేయాల్సి ఉంది. ఇప్పటికి కూడా కొన్ని వేరియంట్స్ కోసం కస్టమర్లు దాదాపు 2 సంవత్సరాల వరకు ఎదురుచూడాల్సి ఉంది.

నిజానికి మహీంద్రా కంపెనీ తన XUV700 కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన కేవలం 3 గంటల సమయంలోనే 50,000 బుకింగ్స్ స్వీకరించి గొప్ప రికార్డ్ సృష్టించింది. దీన్ని బట్టి చూస్తే ఈ SUV కి ప్రారంభం నుంచి ఎంత డిమాండ్ ఉందొ స్పష్టంగా అర్థమవుతుంది.
మహీంద్రా కంపెనీ ఈ SUV ని దేశీయ మార్కెట్లో 2021 ఆగష్టు నెలలో ప్రారంభించింది. అయితే డెలివరీలు 2021 సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యాయి. మొదట్లో కంపెనీ ఈ SUV డెలివరీలలో కొంత ఆలస్యం చేసినప్పటికీ, క్రమంగా డెలివరీలు వేగవంతం అవుతున్నాయి. మొదట్లో కరోనా ప్రభావం మరియు సెమికండక్టర చిప్ కొరతలు కారణంగా ఉత్పత్తి ,మరియు డెలివరీలు మందగించాయి.

మహీంద్రా కంపెనీ 2021 సెప్టెంబర్ నుండి జూన్ 2022 వరకు, మొత్తం 41,846 యూనిట్లను డెలివరీ చేయగలిగింది. దీనిని బట్టి చూస్తే కంపెనీ సగటున నెలకు 4185 యూనిట్ల XUV700 డెలివరీ చేసినట్లు స్పష్టమవుతోంది. అయితే ఇప్పటికీ దీనికున్న డిమాండ్ తగ్గకపోగా రోజురోజుకి బుకింగ్స్ చేసుకునేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

Mahindra XUV700 ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా మంచి పనితీరుని అందించడానికి రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్. ఇది 153 బిహెచ్‌పి పవర్ మరియు 360 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ఇక రెండవ ఇంజిన్ 2.2-లీటర్ టర్బో డీజిల్ విషయానికి వస్తే, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులోని రెండు ఇంజిన్లు 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉన్నాయి.

ఇదిలా ఉండగా మహీంద్రా XUV700 తాజాగా గ్లోబల్ ఎన్‌సిఎపి నుంచి 'సేఫర్ ఛాయిస్ అవార్డు'ను సొంతం చేసుకుంది. గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (GNCAP) నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో మహీంద్రా ఎక్స్‌యువి700 అడల్ట్ సేఫ్టీ విషయంలో 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లు మరియు పిల్లల సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు 41.66 పాయింట్లు పొందింది. మొత్తం మీదుగా ఇది సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొంది బెస్ట్ ఎస్‌యువిగా మారింది. కావున ఇది దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కార్లలో ఒకటిగా ఉంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న మహీంద్రా XUV700 లో ఇప్పుడు కొన్ని ఫీచర్స్ తొలగించడం వల్ల కస్టమర్లు ఎలా స్పందిస్తారో తెలియదు. అదే సమయంలో ఫీచర్స్ తొలగించడానికి గల కారణాలను కూడా కంపెనీ స్పష్టం చేయలేదు. అయినప్పటికీ సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా ఫీచర్స్ తొలగించి ఉండొచ్చని భావిస్తున్నాము.


Click it and Unblock the Notifications








